వాళ్లిద్దరు సూపర్‌.. తిలక్‌ వర్మ విఫలం: భారత దిగ్గజం | Tilak Varma disappointed IND Overconfident: Gavaskar slams SKY & Co | Sakshi
Sakshi News home page

T20 WC: ఓవర్‌ కాన్ఫిడెన్స్‌.. తిలక్‌ వర్మ విఫలం: భారత దిగ్గజం

Feb 23 2026 2:19 PM | Updated on Feb 23 2026 3:43 PM

Tilak Varma disappointed IND Overconfident: Gavaskar slams SKY & Co

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియా ఆట తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. చెత్త ప్రదర్శనతో భారీ మూల్యమే చెల్లించారంటూ భారత మాజీ క్రికెటర్లు సూర్యకుమార్‌ సేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తుదిజట్టు కూర్పు విషయంలో తప్పు జరిగిందంటూ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ను సైతం విమర్శిస్తున్నారు.

ఇదే అతిపెద్ద పరాజయం
కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా.. ఏకంగా 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో భారత్‌కు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద పరాజయం. ఈ మ్యాచ్‌లో వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌కు బదులు వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించడం విమర్శలకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (Sunil Gavaskar) తనదైన శైలిలో స్పందించాడు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఆడలేదని విమర్శించాడు. ముఖ్యంగా వన్‌డౌన్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ ఆడిన తీరు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నాడు.

వారిద్దరు సూపర్‌
‘‘సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్‌ బ్రెవిస్‌ (Dewald Brevis), డేవిడ్‌ మిల్లర్‌ అద్భుత రీతిలో భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గట్టెక్కించారు. అయితే, టీమిండియా బ్యాటర్లు మాత్రం వారి నుంచి ఏమీ నేర్చుకోలేకపోయారు. వచ్చీ రాగానే బౌండరీ కొట్టాలనే తలంపుతో వికెట్‌ పారేసుకున్నారు.

టీ20 క్రికెట్‌లో ఇలా ఆడటం సరికాదు. ప్రత్యర్థి జట్టు ఏం చేసిందో చూసిన తర్వాత కూడా ఇలాగే చేస్తారా? వికెట్‌ అంతగా అనుకూలించకపోయినా వాళ్లు మెరుగ్గా ఆడారు. కానీ మనం.. ఇగోకు పోయాము. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వికెట్లు పోగొట్టుకున్నాం. సౌతాఫ్రికా అద్భుత ప్రదర్శనతో టీమిండియాను చిత్తు చేసింది.

తిలక్‌ వర్మ నిరాశపరిచాడు
ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు. ఇక తిలక్‌ వర్మ (Tilak varma) విషయానికొస్తే.. అతడు తెలివైన బ్యాటర్‌. కానీ ఈ మ్యాచ్‌లో అతడు ఆడిన తీరు నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్‌కు 9.5 పరుగులు రాబట్టాల్సింది. కానీ మనోళ్లు 15 పరుగులు చేయాలి అన్నట్లుగా తొందరపడ్డారు.

తిలక్‌ ఇంకాసేపు సమయం తీసుకుని క్రీజులో నిలదొక్కుకోవాల్సింది. అభిషేక్‌ శర్మ వరుస వైఫల్యాల నేపథ్యంలో తిలక్‌ కాస్తైనా బాధ్యతాయుతంగా ఆడాల్సింది. కానీ అతడు పూర్తిగా విఫలమయ్యాడు’’ అని గావస్కర్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

దూబే ఒక్కడే
కాగా అహ్మదాబాద్‌ వేదికగా సౌతాఫ్రికా విధించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 111 పరుగులకే కుప్పకూలింది. టాపార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ కాగా.. అభిషేక్‌ శర్మ 15 పరుగులు చేయగలిగాడు. 

తిలక్‌ వర్మ రెండు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేసి పెవిలియన్‌ చేరాడు. మిగిలిన వారంతా కూడా విఫలం కాగా.. శివం దూబే 42 పరుగులతో రాణించడంతో భారత్‌ వంద పరుగుల మార్కు దాటగలిగింది.

చదవండి: అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు.. రింకూ ఎందుకసలు?: మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement