ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో కంగారూల చేతిలో స్టోక్స్ బృందం.. 4-1తో ఓడిపోయింది. కనీస పోటీ ఇవ్వలేక చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటోంది.
ఆఖరిగా 2010-11లో ఆస్ట్రేలియాలో యాషెస్ గెలిచిన ఇంగ్లండ్.. ఆ తర్వాత ఇప్పటికి 20 టెస్టులు ఆడి కేవలం ఒకటి మాత్రమే గెలిచి.. రెండు డ్రా చేసుకోగలిగింది. తాజాగా మరోసారి ఇలా చేదు అనుభవం ఎదుర్కొంది.
అతడో గ్యాంబ్లర్
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ హెడ్‌కోచ్ బ్రెండన్ మెకల్లమ్ (Brendon McCullum)పై ఆ దేశ దిగ్గజ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడో జూదగాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించాడు. ప్రతిసారీ తానే గెలుస్తానని భావిస్తాడని.. అందుకే బొక్కబోర్లాపడుతున్నాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
జవాబుదారీతనం లేదు
‘‘ఇంగ్లండ్ జట్టు యాజమాన్యంలోని ముగ్గురు తెలివైన వ్యక్తులు.. ఇప్పుడు అందరికీ జోకర్లలా కనిపిస్తున్నారు. బ్రెండన్ మెకల్లమ్, రాబ్ కీ, బెన్ స్టోక్స్.. గత మూడేళ్లుగా అబద్ధాలతో సావాసం చేస్తున్నారు. ‘నాకు నచ్చినట్లు చేస్తా.. ప్రపంచంతో నాకు పనిలేదు’ అనేది మెకల్లమ్ సిద్ధాంతం.
వరుస మ్యాచ్‌లలో జట్టు ఓడిపోతున్నా.. వారిని అడిగేవాళ్లు ఎవరూ లేరు. వాళ్ల దగ్గర జవాబుదారీతనం లేదు. ప్రదర్శన బాగా లేని వారిపై ఎవరూ వేటు వేయరు. అందుకే వాళ్లు చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తారు.
కెప్టెన్, కోచ్‌కు భయం లేదు. అందుకే ప్లేయర్లు కూడా అలాగే ఉంటారు. బాగా ఆడని వాళ్లను తప్పిస్తేనే కదా.. మిగతావారికి భయం ఉండేది. కానీ ఇక్కడ అలా జరగదు. ఇప్పటికీ రాబ్ కీ (ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్) మెకల్లమ్‌ను సమర్థిస్తూ పోతే.. పాత ఫలితాలే పునరావృతం అవుతాయి.
కన్నీళ్లే మిగులుతాయి..
వ్యక్తిగతంగా నాకు మెకల్లమ్ అంటే ఇష్టం. ఇంగ్లండ్ క్రికెట్‌కు అతడు నిజంగానే కొత్త ఊపిరిలూదాడు. కానీ అతడో గ్యాంబ్లర్. ప్రతిసారీ తానే గెలుస్తానని అనుకుంటాడు. క్యాసినోలో గ్యాంబ్లర్లు అంతా తమకే దక్కుతుందని ముందుగా సంబరపడిపోతారు.
అయితే, ఆఖర్లో వారిలో చాలా మందికి కన్నీళ్లే మిగులుతాయి. అయినా సరే ఆడటం ఆపరు. వారి వైఖరి మార్చుకోరు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఓడిపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే భయం లేనపుడు.. తప్పులు పునరావృతం చేస్తూనే ఉంటారు.
మాజీలతో మాట్లాడండి
ఇంగ్లండ్ జట్టులో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. కానీ వారి నైపుణ్యాలను వాడుకోవడంలో మేనేజ్‌మెంట్ విఫలమవుతోంది. ఇప్పటికీ ఇంగ్లండ్ బోర్డు కీ, మెకల్లమ్, స్టోక్స్‌ను కొనసాగించాలనుకుంటే.. ఇయాన్ బోతం, గ్రాహమ్ గూచ్, డేవిడ్ గోవర్ వంటి వాళ్లను పిలిచి.. వీరితో ఓ సమావేశం ఏర్పాటు చేయాలి.
లోపాలు సరిచేసుకునేలా వారు ఇచ్చిన సలహాలు స్వీకరిస్తే బాగుంటుంది’’ అని 85 ఏళ్ల జెఫ్రీ బాయ్‌కాట్ ‘ది టెలిగ్రాఫ్’నకు రాసిన కాలమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
చదండి: 6 దేశాల్లో 6 సెంచరీలు: సంజూ స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఫిక్స్!


