ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ, ఇంగ్లండ్-ఏ జట్టు (ఇంగ్లండ్ లయన్స్) కోచ్‌గా మారాడు. అతనితో పాటు మరో ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ కూడా లయన్స్ కోచింగ్ టీమ్‌లో చేరాడు. వచ్చే నెలలో పాకిస్తాన్-ఏతో (పాకిస్తాన్ షాహీన్స్) జరుగబోయే వైట్ బాల్ సిరీస్ కోసం ఈ ఇద్దరూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
యువ ఆటగాళ్లకు మెళకువలు నేర్పించడం కోసం స్టోక్స్-మొయిన్ కోచ్ అవతరామెత్తారు. లయన్స్ తమ చివరి యూత్ టీ20ని 2018లో.. చివరి యూత్ వన్డేను 2023లో ఆడింది. లయన్స్‌లో ఈ గ్యాప్‌ను కవర్ చేసేందుకే స్టోక్స్-మొయిన్ కోచింగ్ బాట పట్టారు.
వీరిద్దరు ఇంగ్లండ్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో కలిసి లయన్స్ కోచింగ్ బృందంలో పని చేస్తారు. స్టోక్స్-ఫ్లింటాఫ్ గత ఎడిషన్ హండ్రెడ్ లీగ్‌లో కూడా కలిసి పని చేశారు. స్టోక్స్ నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఫ్లింటాఫ్ ఆ ఫ్రాంచైజీకి మెంటార్‌గా పని చేశాడు.
ఇటీవల యాషెస్ సిరీస్ చివరి టెస్ట్ సందర్భంగా గాయపడిన స్టోక్స్ ఈ కోచింగ్ అనుభవాన్ని రిహాబ్‌గా ఉపయోగించుకుంటాడు. మొయిన్ విషయానికొస్తే.. ఇతను తాజాగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని, దేశవాలీ టీ20 టోర్నీ టీ20 బ్లాస్ట్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు యార్క్‌షైర్ టీమ్‌తో ఒప్పందం చేసుకున్నాడు.
ఆటగాడిగా కెరీర్ చరమాంకంలో ఉన్న మొయిన్ ఈ కోచింగ్ అనుభవాన్ని తన కోచింగ్ కెరీర్‌కు పునాదిగా మలుచుకోనున్నాడు. పాకిస్తాన్-ఏ సిరీస్‌కు స్టోక్స్, మొయిన్‌తో పాటు మరికొంతమంది మాజీలు కూడా కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. వీరి కోచింగ్ బృందంలో నీల్ మెక్‌కెంజీ, సారా టేలర్, నీల్ కిల్లెన్, అమర్ రషీద్, ట్రాయ్ కూలీ ఉన్నారు.
ఇంగ్లండ్ లయన్స్ జట్టు యూఏఈ వేదికగా పాక్-ఏతో మూడు టీ20లు, ఐదు వన్డేలు ఆడనుంది. స్టోక్స్, మొయిన్‌కు యూఏఈలో ఆడిన అనుభవం ఉండటం కూడా వారిని కోచ్‌లుగా ఎంపిక చేసేలా చేసింది. ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్‌ల కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ లయన్స్ జట్టుకు జోర్డన్ కాక్స్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో జేమ్స్ కోల్స్, సాకిబ్ మహమూద్ లాంటి టీ20 స్పెషలిస్ట్‌లు ఉన్నారు.
ఇంగ్లండ్ లయన్స్ టీ20 జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్ (కెప్టెన్), స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, సాకిబ్ మహమూద్, బెన్ మెకిన్నీ, టామ్ మూర్స్, డాన్ మౌస్లీ, మాట్ రెవిస్, విల్ స్మీడ్, నాథన్ సౌటర్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్
వన్డే జట్టు: సోనీ బేకర్, లూక్ బెంకెన్‌స్టెయిన్, జేమ్స్ కోల్స్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, స్కాట్ క్యూరీ, కాల్విన్ హారిసన్, ఎడ్డీ జాక్, బెన్ మెకిన్నీ, డాన్ మౌస్లీ (కెప్టెన్), లియామ్ ప్యాటర్సన్-వైట్, మాథ్యూ పాట్స్, మాట్ రెవిస్, జేమ్స్ రెవ్, మిచెల్ స్టాన్లీ, ఆసా ట్రైబ్, జేమ్స్ వార్టన్.


