WC 2026: ఆసీస్‌ అవుట్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ | U19 WC 2026 1st Semis: England Beat Australia Enters Final | Sakshi
Sakshi News home page

WC 2026: ఆసీస్‌ అవుట్‌.. వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌

Feb 3 2026 8:59 PM | Updated on Feb 3 2026 9:10 PM

U19 WC 2026 1st Semis: England Beat Australia Enters Final

ఐసీసీ అండర్‌-19 వరల్డ్‌కప్‌-2026 టోర్నమెంట్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.

జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌ టోర్నీలో సూపర్‌ సిక్స్‌ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గ్రూప్‌-2 నుంచి భారత్‌ , ఇంగ్లండ్‌ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్‌- ఇంగ్లండ్‌ మంగళవారం తలపడ్డాయి.

థామస్‌ రూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
బులవాయోలో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్‌ డాకిన్స్‌ (1) విఫలం కాగా.. జోసెఫ్‌ మూర్స్‌ 25 పరుగులు.. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్‌ మేయ్స్‌ 24 రన్స్‌ చేశారు. టాపార్డర్‌ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన థామస్‌ రూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

శతకంతో చెలరేగిన థామస్‌.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్‌ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్‌ ఫాల్కనర్‌ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్‌ అహ్మద్‌ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.

ఆసీస్‌ బౌలర్లలో హేడెన్‌ షీలర్‌, నడేన్‌ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్‌ బైరమ్‌, ఆర్యన్‌ శర్మ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 

కెప్టెన్‌ ఒలీవర్‌ పీక్‌ ఒంటరి పోరాటం
ఓపెనర్‌ విల్‌ మలాజుక్‌ 15, వన్‌డౌన్‌ బ్యాటర్‌ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్‌ నితేశ్‌ సామ్యూల్‌ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ లీ యంగ్‌ (3), జేడన్‌ డ్రేపర్‌ (12) నిరాశపరిచారు.

ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ ఒలీవర్‌ పీక్‌ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్‌ పదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్‌ గెలుపు ఖరారైంది. 

టార్గెట్‌ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్‌ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. థామస్‌ రూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్‌- అఫ్గనిస్తాన్‌ బుధవారం తలపడతాయి.

అండర్‌-19 వరల్డ్‌కప్‌ ఆసీస్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ స్కోర్లు
👉ఇంగ్లండ్‌-277/7(50)
👉ఆస్ట్రేలియా- 250(47.3).  

చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement