అండర్–19 ప్రపంచకప్-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య కీలకమైన సూపర్ సిక్స్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్ ఇప్పటికే సెమీఫైనల్ దిశగా అడుగులు వేసినా, పాక్ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది.
బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేస్తుంది. పాక్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్ చౌహాన్ (35), ఖిలన్ పటేల్ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.
భారత బ్యాటర్లలో ఆరోన్ జార్జ్ (16), కెప్టెన్ ఆయుశ్ మాత్రే (0), అభిగ్యాన్ కుందు (16), దీపేశ్ దేవేంద్రన్ (1) విఫలం కాగా.. వైభవ్ సూర్యవంశీ (30), విహాన్ మల్హోత్రా (21), అంబ్రిష్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో అబ్దుల్ సుభాన్ 3, మొహమ్మద్ సయ్యద్ 2, అలీ రజా, అహ్మద్ హుసేన్, మొమిన్ ఖమార్, అలీ హస్సన్ బలోచ్ తలో వికెట్ తీశారు.
ఇదిలా ఉంటే, భారత ఇన్నింగ్స్ సందర్భంగా పాకిస్తాన్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన ఓ పని వివాదాస్పదమైంది. ఇన్నింగ్స్ 25వ ఓవర్ తర్వాత అతను డ్రెస్సింగ్ రూమ్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ కనిపించాడు. ఐసీసీ నియమాల ప్రకారం, PMOA (Player and Match Officials Area)లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు వాడటం పూర్తిగా నిషేధం.
ఇవి మ్యాచ్ ఫలితాలను ప్రభావితం (ఫిక్సింగ్ లేదా చీటింగ్) చేసే అవకాశం ఉందని ఐసీసీ ఈ నిబంధనను అమలు చేస్తుంది. ఆర్టికల్ 4.1.1 ప్రకారం PMOAలో ఎవరూ మొబైల్ ఫోన్ వాడకూడదు. ఆర్టికల్ 4.1.2 ప్రకారం ల్యాప్‌టాప్‌లు లేదా ఇతర కమ్యూనికేషన్ పరికరాలు కూడా వాడకూడదు.


