మెట్టు దిగిన ఆటగాళ్లు.. ఫీజుల కోతకు అంగీకారం | ISL: Sunil Chhetri rest of Bengaluru FC players agree to pay cuts | Sakshi
Sakshi News home page

మెట్టు దిగిన ఆటగాళ్లు.. ఫీజుల కోతకు అంగీకారం

Feb 3 2026 6:10 PM | Updated on Feb 3 2026 6:42 PM

ISL: Sunil Chhetri rest of Bengaluru FC players agree to pay cuts

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ నిర్వహణ కోసం ఆటగాళ్లు ఓ మెట్టు దిగారు. సునీల్‌ ఛెత్రి నేతృత్వంలోని బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (FC) ఆటగాళ్లు తమ మ్యాచ్‌ ఫీజుల తగ్గింపునకు సమ్మతించారు. పలు సమస్యలతో ఐఎస్‌ఎల్‌ గతేడాది జరగలేదు. 

ఏడాది విరామం తర్వాత మొత్తానికి సమస్యలు పరిష్కరించుకొని ఇటు లీగ్‌ నిర్వాహకులు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఈ ఏడాది నుంచి తిరిగి ఎప్పటిలాగే టోర్నీని నిర్వహించాలనే ఒప్పందానికి వచ్చారు.

ఈ నెల 14 నుంచే ఫుట్‌బాల్‌ లీగ్‌ జరుగుతుంది. సజావుగా టోర్నీ నిర్వహణకు ఫుట్‌బాలర్లు సైతం తమ మ్యాచ్‌ ఫీజుల కోతకు అంగీకరించారు. దీనిపై బెంగళూరు యజమాని పార్థ్‌ జిందాల్‌ సంతోషం వ్యక్తం చేశారు. లీగ్‌ ఒడిదొడుకులను అర్థం చేసుకొని టోర్నీ నిర్వహణ కోసం తమ ఫీజుల్ని తగ్గించుకున్న ఆటగాళ్లను ఆయన అభినందించారు.  

రూ.కోట్లు పోయి లక్షలు  
ఐఎస్‌ఎల్‌ ప్రసార హక్కుల్ని చాలా తక్కువ మొత్తానికే ‘ఫ్యాన్‌కోడ్‌’ యాప్‌ చేజిక్కించుకుంది. మొత్తం 91 మ్యాచ్‌లున్న ఫుట్‌బాల్‌ ఈవెంట్‌ ప్రపంచవ్యాప్త ప్రసార హక్కుల్ని రూ. 8.62 కోట్లకే దక్కించుకుంది. 

అంటే ఒక్కో మ్యాచ్‌కు సగటున రూ.9.5 లక్షలకే గ్లోబల్‌ మీడియా రైట్స్‌ పొందింది. 2024–25 సీజన్‌లో రూ.275 కోట్లు రాగా అప్పుడు 163 మ్యాచ్‌లు జరిగాయి. అంటే మ్యాచ్‌కు రూ. 1.68 కోట్లు వచ్చాయి. కానీ ప్రస్తుత సీజన్‌కు వచ్చేసరికి రూ.కోట్లు పోయి రూ.9.5 లక్షలకు పడిపోయింది. 

ఇదీ చదవండి: భారత జట్టు ఓటమి 
నేపాల్‌ వేదికగా దక్షిణాసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (శాఫ్‌) అండర్‌–19 మహిళల చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న భారత యువ జట్టుకు బంగ్లాదేశ్‌ చేతిలో చుక్కెదురైంది. ఏఎఫ్‌సీ అండర్‌–17 మహిళల ఆసియా కప్‌కు సన్నద్ధమయ్యేందుకు ఈ అండర్‌–19 టోరీ్నలో భారత్‌ అండర్‌–17 జట్టును బరిలోకి దింపింది.

టీనేజ్‌ జట్టు తొలి మ్యాచ్‌లో 1–0తో ఆతిథ్య నేపాల్‌పై గెలిచింది. కానీ సోమవారం జరిగిన పోరులో భారత అమ్మాయిల జట్టు 0–2 స్కోరుతో బంగ్లాదేశ్‌ చేతిలో కంగుతింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ అసలు ఖాతానే తెరువలేదు. బంగ్లా జట్టులో అర్పిత బిస్వాస్‌ (29వ నిమిషంలో), అల్పి అక్తర్‌ (40వ ని.) చెరో గోల్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement