ఈనెల 20 నుంచి భారత మహిళల ఫుట్‌బాల్ లీగ్
బరిలో 8 జట్లు
ఈస్ట్ బెంగాల్ క్లబ్ తరఫున బరిలోకి తెలంగాణ ప్లేయర్ సౌమ్య గుగులోత్
న్యూఢిల్లీ: పురుషుల జట్లకు నిర్వహించే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీపై ఒకవైపు సందిగ్ధత కొనసాగుతున్నా... మరోవైపు ఇండియన్ ఉమెన్స్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) 2025–2026 సీజన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ తేదీలను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) ప్రకటించింది. కోల్‌కతాలోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఈనెల 20న ఈ లీగ్ మొదలవుతుంది. వచ్చే ఏడాది మే 10వ తేదీ వరకు జరిగే ఈ లీగ్‌లో 8 జట్లు పోటీపడుతున్నాయి.
ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ (కోల్‌కతా), గర్వాల్ యునైటెడ్ ఎఫ్‌సీ (న్యూఢిల్లీ), గోకులం కేరళ ఎఫ్‌సీ (కోజికోడ్), కిక్‌స్టార్ట్ ఎఫ్‌సీ (బెంగళూరు), నీతా ఫుట్‌బాల్ అకాడమీ (కటక్), సెసా ఫుట్‌బాల్ అకాడమీ (సిర్కయిమ్, గోవా), సేతు ఎఫ్‌సీ (మదురై), శ్రీభూమి ఎఫ్‌సీ (కోల్‌కతా) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. తొలి మ్యాచ్‌లో సేతు ఫుట్‌బాల్ క్లబ్‌తో కిక్‌స్టార్ట్ ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది.
తొలి అంచె డిసెంబర్ 20 నుంచి జనవరి 9వ తేదీ వరకు... రెండో అంచె ఏప్రిల్ 20 నుంచి మే 10వ తేదీ వరకు జరుగుతుంది. ఒక్కో జట్టు 14 మ్యాచ్‌ల చొప్పున ఆడుతుంది. అత్యధిక పాయింట్లు సాధించిన జట్టుకు టైటిల్ లభిస్తుంది. లీగ్‌లో చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్–2కు పడిపోతాయి. ఐడబ్ల్యూఎల్–2లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఐడబ్ల్యూఎల్‌కు ప్రమోట్ అవుతాయి.
కోల్‌కతాకు చెందిన ఈస్ట్ బెంగాల్ ఎఫ్‌సీ జట్టు 2024–2025 ఐడబ్ల్యూఎల్ చాంపియన్‌గా నిలిచింది. తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ ఈస్ట్ బెంగాల్‌కు తొలి టైటిల్ దక్కడంలో ముఖ్యపాత్ర పోషించింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సౌమ్య గత ఐడబ్ల్యూఎల్ సీజన్‌లో 9 గోల్స్ సాధించి అత్యధిక గోల్స్ చేసిన భారత ప్లేయర్‌గా నిలిచింది.
గోకులం కేరళ ఎఫ్‌సీ జట్టుకు ఆడిన ఉగాండా ప్లేయర్ ఫాజిలా ఇక్వాపుట్ 24 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలువగా... ఈస్ట్ బెంగాల్ జట్టుకు చెందిన ఘనా ప్లేయర్ ఎల్షాదాయ్ అచీమ్‌పోంగ్ 10 గోల్స్‌తో రెండో స్థానంలో, సౌమ్య 9 గోల్స్‌తో మూడో స్థానంలో నిలిచారు.


