
‘శాఫ్’ చాంపియన్‌షిప్ కైవసం
చెన్నై: అండర్–17 దక్షణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (SAFF U17) చాంపియన్‌షిప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. శనివారం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో భారత జట్టు పెనాల్టీ షూటౌట్‌లో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలవడం ఇది ఏడోసారి.
తుదిపోరు నిర్ణీత సమయంలో 2–2 గోల్స్‌తో సమం కాగా... అనంతరం విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన పెనాల్టీ షూటౌట్‌లో భారత్ 4–1తో ముందంజ వేసింది. భారత్ తరఫున డల్లామౌన్ గాంగ్టే (4వ నిమిషంలో), అజ్లాన్ షా (38వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. షూటౌట్‌లో భారత్ నుంచి డల్లామౌన్ గాంగ్టే, కొరో కొన్‌థోజమ్, ఇంద్ర రాణా, శుభమ్ పునియా విజయంవంతం అయ్యారు. బంగ్లా నుంచి మనిక్ మాత్రమే గోల్ చేశాడు.
పసిడి గురి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నీలో భారత షూటర్ల జోరు సాగుతోంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు స్వర్ణ, రజతాలు ఖాతాలో వేసుకున్నారు. రష్మిక సెహగల్–కపిల్ శర్మ అదిరిపోయే గురితో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నారు.
ఇటీవల ఆసియా చాంపియన్‌షిప్ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించిన రష్మిక–కపిల్ జోడీ... శనివారం మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో 16–10 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన వన్షిక–జొనాథన్ గావిన్ ఆంటోనీ జంటపై గెలుపొందింది.
ఒర్టెగా కాస్ట్రో–లూకాస్ సెంచెజ్ (స్పెయిన్) ద్వయం కాంస్యం ఖాతాలో వేసుకుంది. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్‌లో రష్మిక–కపిల్ చెరో 291 పాయింట్లు స్కోరు చేసి 582 పాయింట్లతో అగ్రస్థానంతో ఫైనల్‌కు చేరారు.
వన్షిక–జొనాథన్ ద్వయం 578 పాయింట్ల (287+291)తో రెండో స్థానం దక్కించుకుంది. ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ క్వాలిఫయింగ్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జోడీలు పసిడి పతకం కోసం పోటీ పడగా... మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన జంటల కాంస్య పతక పోరు జరిగింది. ఫైనల్లో ఆరంభం నుంచే రష్మిక–కపిల్ జంట ఆధిక్యం కొనసాగింది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పురుషుల వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం ఖాతాలో వేసుకున్న జొనాథన్... ఫైనల్లో విజృంభించినా... వన్షిక పలుమార్లు తడబడంతో ఈ జోడీ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జూనియర్ మహిళల స్కీట్ విభాగంలో ఒలింపియన్ రైజా ఢిల్లాన్ రజత పతకం కైవసం చేసుకుంది. ఇటలీకి చెందిన అరియానా 53 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఢిల్లాన్ 51 పాయింట్లతో రజతం నెగ్గింది. భారత్‌కే చెందిన మాన్సి రఘువంశీ 41 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకుంది.
జూనియర్ మెన్స్ స్కీట్ విభాగంలో భారత షూటర్లు హర్‌మెహర్ సింగ్, అతుల్ సింగ్ రజావత్ వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచి పతకం కోల్పోయారు. మూడు రోజుల పోటీలు ముగిసేసరికి భారత్ 11 పతకాల (2 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్యాలు)తో పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటలీ (2 స్వర్ణాలు, 1 రజతం) రెండో స్థానంలో ఉండగా... తటస్థ అథ్లెట్స్ రెండు స్వర్ణాలు గెలిచి మూడో స్థానంలో ఉన్నారు.