మరో ‘నిర్భయ’ ఉదంతం  | Woman assaulted In Moving Van In Faridabad For 2 Hours Thrown Out On Road | Sakshi
Sakshi News home page

మరో ‘నిర్భయ’ ఉదంతం 

Dec 31 2025 1:11 PM | Updated on Jan 1 2026 5:19 AM

Woman assaulted In Moving Van In Faridabad For 2 Hours Thrown Out On Road

పాతికేళ్ల యువతిపై వ్యానులో సామూహిక అత్యాచారం 

వేగంగా వెళ్తున్న వాహనం నుంచి విసిరివేత 

తలకు, ముఖానికి గాయాలు 

12కుపైగా కుట్లు 

విషమంగా బాధితురాలి ఆరోగ్యం 

హరియాణాలో దారుణ ఘటన 

ఇద్దరు నిందితుల అరెస్ట్‌ 

ఫరీదాబాద్‌/చండీగఢ్‌: భారతావనిలో మహిళలకు రక్షణలేదని చాటిన అత్యంత దారుణమైన ‘నిర్భయ’ఉదంతాన్ని 13 ఏళ్ల తర్వాత మళ్లీ స్మరణకు తెస్తూ హరియాణాలోని ఫరీదాబాద్‌లో మృగాళ్లు యువతిని గ్యాంగ్‌రేప్‌ చేసి రోడ్డుపై పడేసి వెళ్లారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వ్యాన్‌ను పోనిస్తూ అందులో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన రాక్షసపర్వం సోమవారం అర్ధరాత్రి దాటాక నుంచి మంగళవారం తెల్లవారుజాము మూడు, నాలుగింటిదాకా కొనసాగింది. 

ఈ హేయమైన అత్యాచారం తర్వాత యువతిని వేగంగా వెళ్తున్న వ్యాను నుంచి రోడ్డు మీదకు విసిరేసి వెళ్లారు. దీంతో తల, ముఖం, భుజానికి తీవ్రమైన గాయాలై యువతి నడిరోడ్డుపై రక్తమోడింది. జీవచ్ఛవంలా పడి ఉన్నా బలాన్ని కూడదీసుకుని ఎలాగోలా తన సోదరికి ఫోన్‌ చేసి విషయం చెప్పింది. దీంతో హుతాశురాలైన సోదరి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాద్‌షా ఖాన్‌ పౌర ఆస్పత్రిలో చేరి్పంచింది. పరిస్థితి విషమించడంతో వెంటనే అక్కడి ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. 

వేగంగా రోడ్డుపైపడటంతో తల, ముఖం, భుజం దెబ్బతిన్నాయి. ఇప్పటికే 12కుపైగా కుట్లు వేశారు. ముఖంలో ఎముకలు విరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వార్తలొచ్చాయి. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించాలని సూచించారు. విషయం తెల్సుకున్న హరియాణా పోలీసులు రంగంలోకి దిగి ఇంతటి దారుణానికి పాల్పడిన మృగాళ్లను అరెస్ట్‌చేశారు. వీరిలో ఒకరికి ఉత్తరప్రదేశ్‌కాగా మరొకరిది మధ్య ప్రదేశ్‌. వీళ్లిద్దరూ ఫరీదాబాద్‌లోనే నివసిస్తున్నారు.  

లిఫ్ట్‌ అడిగితే... 
బాధితురాలి సోదరి, ఫరీదాబాద్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాతికేళ్ల బాధితురాలు వైవాహిక జీవితంలో సమస్యల కారణంగా ఫరీదాబాద్‌లోని తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఒకే ఇంట్లో ఉంటోంది. సోమవారం రాత్రి 8.30 గంటలప్పుడు తల్లితో గొడవపడి సెక్టార్‌23 పరిధిలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. రాత్రి కాస్తంత ఆలస్యమయ్యాక ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు న్యూ ఇండ్రస్టియల్‌ టౌన్‌షిప్‌–2 వరకు ఆటోలో వచ్చింది. అక్కడి నడుచుకుంటూ మెట్రో చౌక్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ప్రజారవాణా బస్సులో ఇంటికెళ్లేందుకు రోడ్డు మీద ఎదురుచూసింది. అదే సమయంలో అటుగా వ్యానులో వచ్చిన ఇద్దరు నిందితులు తాము కూడా అదే కళ్యాణ్‌పురికి వెళ్తున్నామని నమ్మబలికారు. లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి వ్యానులో ఎక్కించుకున్నారు. బాధితురాలిని గమ్యస్థానంలో దిగబెట్టకుండా వేరే మార్గంలో గురుగ్రామ్‌ సిటీ వైపు వ్యానును పోనిచ్చారు. 

కదులుతున్న వ్యానులోనే ఇద్దరూ ఆమెను గ్యాంగ్‌రేప్‌ చేశారు. ఆ వ్యాను రాజ్‌చౌక్‌ రోడ్డులో మంగళవారం రాత్రి 3 గంటలప్పుడు వెళ్తున్నప్పుడు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లు సీసీటీవీ వీడియోలో రికార్డయింది. రేప్‌ చేశాక ఆమెను నిర్మానుష్యంగా ఉన్న ములా హోటల్‌ వద్ద రహదారిపై విసిరేసి వెళ్లారు. కాపాడండంటూ సాయం కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా అర్ధరాత్రి రోడ్లు నిర్మానుష్యంగా ఉండటం, దట్టంగా కమ్ముకున్న పొగమంచులో ఒక్కరూ స్పందించలేదని బాధితురాలు సోదరితో చెప్పినట్లు తెలుస్తోంది. 

గాయాలపాలైన యువతి ఎలాగోలా తన సోదరికి ఫోన్‌ చేయడంతో ఆమె వచ్చి ఆస్పత్రిలో చేర్పించింది. సోదరి ఇచ్చిన ఫిర్యాదులో కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన పోలీసులు వెంటనే నిందితుల కోసం వేట మొదలెట్టి ఇద్దరినీ బుధవారం మధ్యాహ్నం అరెస్ట్‌చేసి సిటీ కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ఇద్దరినీ జ్యుడీషియల్‌ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలిచ్చారు. నేరాన్ని నిందితులిద్దరూ జడ్జి ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ‘‘ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహించేదాకా నిందితుల వివరాలను వెల్లడించబోము.

 తీవ్ర గాయాల కారణంగా బాధితురాలు ఆస్పత్రిలో వాంగ్మూలం ఇచ్చే పరిస్థితిలో లేదు’’ అని ఫరీదాబాద్‌ పోలీస్‌ ప్రజాసంబంధాల అధికారి యశ్‌పాల్‌ యాదవ్‌ బుధవారం మీడియాతో చెప్పారు. దారుణోదంతంలో కీలకంగా మారిన వ్యానును మారుతి సుజుకీ ఎకోగా గుర్తించారు. దానిని పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్‌ బృందాలు వ్యాను నుంచి బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. భారతీయ న్యాయ సంహితలోని 70(1) (యువతిపై గ్యాంగ్‌రేప్‌), 351(3) (నేరపూరిత లైంగికదాడి), 3(5) (మూకుమ్మడి దురుద్దేశం) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాధితురాలికి ముగ్గురు పిల్లలున్నారు.  

ఇదీ చదవండి: అస్థిపంజరంలా ఆమె, ఆకలితో కన్నుమూసిన తండ్రి

Advertisement
 
Advertisement
Advertisement