అమెరికాలోని కాలిఫోర్నియాలో శాంటాక్రూజ్ సమీపంలో సముద్రంలో బోటు ప్రమాదంనుంచి ఒక కుటుంబం తృటిలో తప్పించుకుంది. బోటింగ్ చేస్తున్న సమయంలో భారీ అలలు విరుచుకుపడటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. అదృష్టవశాత్తూ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలా? తెలుసు కుందాం.
సముద్రం తీరానికి వెళ్లినపుడు బోటింగ్‌కి వెళ్లడం సర్వ సాధారణం. అలా నలుగురు పిల్లలతో ఒక జంట కూడా బోటింగ్‌కు వెళ్లింది. చాలా ఉత్కంఠ భరితంగా రైడ్‌ను ఆస్వాదిస్తున్నారు వారంతా. పడవ నెమ్మదిగా ఒడ్డు వైపు కదులుతోంది. ఇంతలో అకస్మాత్తుగా రాకాసి అలలు విరుచుకు పడ్డాయి. అలల ధాటికి పడవ తిరగపడింది. అనేక మంది సర్ఫర్‌లను దాటి దూసుకెళ్లి, పడవ పల్టీలు కొట్టడంతో మొత్తం ఆరుగురూ నీటిలో మునిగి పోయారు. ఈ దృశ్యాలు సర్ఫర్లను రికార్డు చేస్తున్న వారి దృష్టిలోపడింది. వెంటనే వారిని రక్షించేందుకు రంగంలోకి దిగారు. సర్ఫర్లు, విరోస్ట్కో,అతని స్నేహితుడు ట్రైక్, ఇతర సర్ఫర్లు తక్షణమే స్పందించారు. సమయస్ఫూర్తితో వారిని ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ, సర్ఫర్లలో ఎవరికీ గాయాలు కాలేదు.

ఈ సంఘటన ఫిబ్రవరి 13, 2026న శాంటా క్రజ్ వెస్ట్ క్లిఫ్ డ్రైవ్ సమీపంలో జరిగింది. మూడుసార్లు మావెరిక్స్ విజేత డారిల్ 'ఫ్లీ' విరోస్ట్కోతో సహా సర్ఫర్ల బృందం ఈ కుటుంబాన్ని రక్షించేందుకు చొరవ చూసి అనేక ప్రశంసలందుకుంది.
శాంటా క్రజ్ అగ్నిమాపక విభాగం
డిపార్ట్‌మెంట్ వాటర్ రెస్క్యూ విభాగం దీనిపై స్పందించింది. ఆరుగురు బాధితులను విజయవంతంగా రక్షించిన స్థానిక సర్ఫింగ్ కమ్యూనిటీ, ఇతర ఏజెన్సీలను అభినందించింది. ఈ సంఘటనకు ఖచ్చితమైన కారణాలు, భద్రతా ప్రోటోకాల్స్ పాటించారా? లేదా అనేదానిపై దర్యాప్తు చేస్తోంది.
ఇదీ చదవండి: FASTag వార్షిక పాస్ తీసుకుంటున్నారా? ఎన్‌హెచ్‌ఏఐ తాజా హెచ్చరిక!
బిగ్ వేవ్ సర్ఫర్ డారిల్ 'ఫ్లీ' విరోస్ట్కో మాట్లాడుతూ నమ్మలేకపోతున్నా.. కానీ చిన్న పిల్లలతో అందరూ ఈ పడవ ప్రమాదం నుండి బయటపడ్డారంటూ ఆనందాన్ని ప్రకటించారు. మరోవైపు బోటింగ్ సమయంలో లైఫ్ జాకెట్లు ధరించడం తప్పనిసరి. ఈ ప్రమాదంలో వీరంతా లైఫ్ జాకెట్లను ధరించలేదని తెలుస్తోంది.


