నిత్యం అబద్ధాలేనా?  | Amit Shah slams Rahul Gandhi over India-US trade deal claims | Sakshi
Sakshi News home page

నిత్యం అబద్ధాలేనా? 

Feb 15 2026 6:30 AM | Updated on Feb 15 2026 6:32 AM

Amit Shah slams Rahul Gandhi over India-US trade deal claims

రాహుల్‌ గాందీపై అమిత్‌ షా ధ్వజం 

కారైకల్‌: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాం«దీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిత్యం అబద్ధాలు చెప్పడం అనే కొత్త సంప్రదాయాన్ని రాహుల్‌ ప్రారంభించాడని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. గొంతు చించుకొని గట్టిగా అబద్ధం చెప్పడం, దాన్ని పునరావృతం చేయడం, అబద్ధాన్ని నిజంగా నమ్మించాలని చూడడం రాహుల్‌ విధానంగా మారిపోయిందని విమర్శించారు. 

రాహుల్‌ అబద్ధాల ఫ్యాక్టరీ వెనకున్న అసలు బాగోతాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. యూకే, ఈయూ, అమెరికాలతో కుదుర్చున్న వాణిజ్య ఒప్పందాలతో మన రైతులకు, మత్స్యకారులకు, పాడి పరిశ్రమకు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదన్నారు. అయినప్పటికీ రాహుల్‌ తప్పుడు ప్రచారంతో వారిని భయోత్పాతానికి గురి చేస్తున్నాడని ధ్వజమెత్తారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం తప్పనిసరిగా కాపాడుందన్నారు. 

విదేశాలతో వాణిజ్య ఒప్పందాల గురించి క్షుణ్నంగా తెలుసుకొని మాట్లాడాలని రాహుల్‌ గాం«దీకి హితవు పలికారు. శనివారం పుదుచ్చేరిలోని కారైకల్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల బహిరంగ సభలో అమిత్‌ షా ప్రసంగించారు. విదేశాలతో వాణిజ్య ఒప్పందాల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చిచెప్పారు. మన ప్రయోజనాలు 100 శాతం కాపాడుకొనేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని వివరించారు.    

వచ్చేది బీజేపీ ప్రభుత్వమే  
ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదని అమిత్‌ షా ఉద్ఘాటించారు. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్‌ దాడులు చేసిన ఘనత మోదీ నిర్ణయాత్మక నాయకత్వానిదేనని ప్రశంసించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో ముష్కర మూకలకు గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పుదుచ్చేరి అభివృద్ధి జరగాలంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement