లక్ష కోట్లతో అర్బన్ చాలెంజ్ ఫండ్
కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పట్టణ ప్రగతికి భారీ ఊతం
ప్రాజెక్టు వ్యయంలో 25% కేంద్ర సాయం
కనీసం 50% మార్కెట్ సమీకరణలు
సాక్షి, న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాలను ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్లుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, వాటి అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం శనివారం ఇందుకు ఆమోదం తెలిపింది. ఈ పథకానికి కేంద్ర సాయంగా ఏకంగా రూ.లక్ష కోట్లను కేటాయించింది! ఈ పథకం 2025–26 నుంచి 2030–31 ఆరి్ధక సంవత్సరం దాకా ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. అనంతరం అవసరాన్ని బట్టి మరింతకాలం పొడిగిస్తారు.
అప్పు తెస్తే కేంద్రం సాయం!
నగరాలు తమ కాళ్లపై తాము నిలబడేలా, మార్కెట్ నుంచి నిధులు సమీకరించుకునేలా యూసీఎఫ్‌ను కేంద్రం రూపొందించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేపట్టే పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల్లో 25% నిధులను యూసీఎఫ్ కింద కేంద్రం ఇస్తుంది. ఇందుకోసం ప్రాజెక్టు నిధుల్లో కనీసం 50 శాతాన్ని రాష్ట్రాలు మార్కెట్ నుంచి సమీకరించాల్సి ఉంటుంది. మున్సిపల్ బాండ్లు, బ్యాంక్ రుణాలు లేదా పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) వాటిని సమకూర్చుకోవాలి.
మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం, లేదా స్థానిక సంస్థలు భరించాలి. యూసీఎఫ్‌తో రాబోయే ఐదేళ్లలో దేశ పట్టణాభివృద్ధి రంగంలో ఏకంగా రూ.4 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని కేంద్రం అంచనా వేస్తోంది. పట్టణాభివృద్ధిలో గ్రాంట్ ఆధారిత విధానం స్థానంలో మార్కెట్, సంస్కరణల ఆధారిత విధానానికి ఇది నాంది పలుకుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది.
చిన్న పట్టణాలకు రూ.5,000 కోట్ల నిధి
యూసీఎఫ్ పథకంలో భాగంగా పోటీతత్వానికి కేంద్రం తెర తీసింది. పారదర్శకంగా, సంస్కరణలు అమలు చేసే నగరాలకే ప్రాధాన్యమిస్తారు. పాలనలో డిజిటల్ విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, అర్బన్ ప్లానింగ్ సంస్కరణలు అమలు చేసే నగరాలు రేసులో ముందుంటాయి. అంతేగాక టైర్2, టైర్3 నగరాలు, ముఖ్యంగా లక్ష లోపు జనాభా ఉన్న చిన్న పట్టణాల కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక కార్పస్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈశాన్య రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాలు మార్కెట్ రుణాలు పొందడానికి కేంద్రం ‘క్రెడిట్ రీపేమెంట్ గ్యారంటీ’ఇస్తుంది. దీనికింద తొలిసారి రుణాలకు రూ.7 కోట్లు లేదా రుణ మొత్తంలో 70% దాకా కేంద్రమే గ్యారంటీగా ఉంటుంది.
మూడు రంగాలపై ఫోకస్
యూసీఎఫ్ ద్వారా మూడు రకాల అభివృద్ధి పనులకు ప్రాధాన్యమిస్తారు...
→ నగరాల విస్తరణ, ఆర్థిక కారిడార్లు, రవాణా వ్యవస్థ మెరుగుదల
→ పాత బస్తీలు, హెరిటేజ్ ప్రాంతాల ఆధునీకరణ, బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులు, విపత్తుల నుంచి రక్షణ
→ తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, చెత్త నిర్వహణ (స్వచ్ఛత), నీటి వనరుల రక్షణ ఎవరికి వర్తిస్తుంది?
→ 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు
→ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు
→ లక్ష జనాభా దాటిన పారిశ్రామిక నగరాలు
→ చిన్న పట్టణాలు (గ్యారెంటీ స్కీమ్ కింద)
కేబినెట్ ఇతర నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. వేల కోట్ల రూపాయలతో కూడిన పలు ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ వాటిని మీడియాకు వెల్లడించారు...
→ తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో రూ.11 వేల కోట్ల రోడ్డు ప్రాజెక్టులకు అనుమతి
→ అస్సాంలో రూ.18,662 కోట్లతో బ్రహ్మపుత్ర నది కింద దేశంలోనే తొలి అండర్ వాటర్ రైల్, రోడ్డు ట్విన్ టన్నెల్ ప్రాజెక్టు. దీన్ని గోహ్‌పూర్–నుమాలిగఢ్ నడుమ 34 కి.మీ. పొడవున నిర్మించనున్నారు
→ కసారా–మన్మాడ్, ఢిల్లీ–అంబాలా, బళ్లారి–హోస్పేట నడుమ మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణం నిమిత్తం రూ.18,509 కోట్లతో మూడు భారీ ప్రాజెక్టులు
→ రూ.10 వేల కోట్లతో తలపెట్టిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0కు ఆమోదం
→ నోయిడా మెట్రో రైల్ ప్రాజెక్టు 11.56 కి.మీ. మేరకు విస్తరణ.
→ ప్రధాని కార్యాలయాన్ని రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ నుంచి నూతనంగా నిర్మించిన సేవా తీర్‌్థలోకి మార్చడం పట్ల కేంద్ర మంత్రివర్గం హర్షం వెలిబుచి్చంది. శుక్రవారం సౌత్‌బ్లాక్ కార్యాలయంలో జరిగిన చివరి మంత్రివర్గ భేటీలో ఈ మేరకు తీర్మానం ఆమోదించింది. ‘‘సేవా తీర్థ్ చరిత్ర, భవిష్యత్తుల కూడలి. గతకాలపు బానిసత్వం నుంచి భవిష్యత్ వికసిత భారత్ దిశగా వేసిన ముందడుగు’’అని అభివరి్ణంచింది.


