ఈశాన్యంలో చొరబాట్లు... కాంగ్రెస్‌ పుణ్యమే!  | PM Narendra Modi accuses Congress of neglecting Assam | Sakshi
Sakshi News home page

ఈశాన్యంలో చొరబాట్లు... కాంగ్రెస్‌ పుణ్యమే! 

Feb 15 2026 5:58 AM | Updated on Feb 15 2026 5:58 AM

PM Narendra Modi accuses Congress of neglecting Assam

వారిని కాపాడుతూ వచి్చంది

గువాహటి సభలో మోదీ ధ్వజం

గువాహటి: కాంగ్రెస్‌ పారీ్టపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఈశాన్య భారతదేశంలో అభివృద్ధిని దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. అంతేగాక ఈ ప్రాంతంలో చొరబాట్లను విపరీతంగా ప్రోత్సహించింది’’అంటూ దుయ్యబట్టారు. చొరబాటుదారులను కాపాడిన, కాపాడుతున్న చరిత్ర ఆ పార్టీదేనని ఆక్షేపించారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని చెప్పారు. అస్సాంలో ఒక్క రోజు పర్యటనలో భాగంగా శనివారం గువాహటిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. 

కాంగ్రెస్‌ తన హయాంలో దేశ భద్రతను నిత్యం ప్రమాదంలో నెట్టిందంటూ మండిపడ్డారు. ఆ పార్టీ పాలనలో అస్సాంలో నిత్యం భయం, అభద్రతలే రాజ్యమేలాయని ఆరోపించారు. ‘‘కాంగ్రెస్‌ నిత్యం సమాజంలో విభజనను ప్రోత్సహించింది. ఓటుబ్యాంకు రాజకీయాల్లో మునిగి తేలింది. దేశ భద్రతను గాలికొదిలేసింది. చివరికి ఆయుధాల కొనుగోళ్లలో కూడా భారీ కుంభకోణాలకు పాల్పడింది. గతంలో ముస్లిం లీగ్‌ వల్ల దేశ విభజన జరిగింది. కానీ ఇప్పుడు మావోయిస్టులు, ముస్లిం లీగ్, కాంగ్రెస్‌ (ఎంఎంసీ)లతో దేశానికి ముప్పు పొంచి ఉంది. వీటిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి’’అని ప్రధాని సూచించారు. 

‘డబుల్‌ ఇంజన్‌’కే ఓటెయ్యండి 
వచ్చే ఐదేళ్ల కాలం అస్సాంకు చాలా కీలకమని మోదీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని గెలిపించి డబుల్‌ ఇంజన్‌ సర్కారును కొనసాగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం ఒక్కటే బీజేపీ లక్ష్యం కాదని, ప్రజల హృదయాలు గెలవడం తమకు ముఖ్యమని చెప్పారు. ‘‘70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కాంగ్రెస్‌ కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేం పదేళ్లలోనే ఐదు బ్రిడ్జిలు కట్టి చూపించాం. మా ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతోంది. 

అస్సాంను వేగంగా అభివృద్ధి చేసేందుకు, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర అస్తిత్వాన్ని, సంప్రదాయాలను పరిరక్షించేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. 2014 నుంచి ఈశాన్యానికి చెందిన 125 మంది పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు’’అని మోదీ చెప్పారు. బీజేపీకి కార్యకర్తలే ప్రాణవాయువని, పార్టీకి ఎనలేని బలమని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వేళ ప్రతి పౌరునికీ చేరువ కావాలని కార్యకర్తలకు సూచించారు. ‘‘మేం విశ్వసించేది వ్యవస్థాగతమైన బలాన్నే. నేను బీజేపీ కార్యకర్తను. అది నాకు గర్వకారణం. అదే నా అతి పెద్ద అర్హత. అస్సాం ప్రజలు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. దానికి అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా బదులు చెల్లించుకుంటాను’’అని ప్రకటించారు. 

పలు ప్రాజెక్టులు ప్రారంభం
కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో రూ.5,500 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. వీటిపై బ్రహ్మపుత్రా నదిపై భారీ వంతెన, ఐఐఎం, డేటా సెంటర్‌ తదితరాలున్నాయి. ఐఐఎం–గువాహటిని గువాహటి సమీపంలోని పలాస్‌బరిలో, హైటెక్‌ డేటా సెంటర్‌ను కామరూప్‌ జిల్లాలోని అమీన్‌గావ్‌లో నిర్మించారు. వీటితో పాటు పీఎం–ఇబస్‌ సేవా పథకం కింద మంజూరైన 225 ఎలక్ట్రిక్‌ బస్సులను కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు.  

బ్రహ్మపుత్రపై భారీ బ్రిడ్జి 
బ్రహ్మపుత్రా నదిపై రూ.3,030 కోట్లతో నిర్మించిన కుమార్‌ భాస్కర్‌ వర్మ సేతును మోదీ ప్రారంభించారు. అనంతరం బ్రిడ్జిపై నడుస్తూ దాన్ని పరిశీలించారు. అప్రోచ్‌ రోడ్లు, ఫ్లై ఓవర్లతో కలిపి ఇది 7.75 కి.మీ. పొడవుంటుంది. సువిశాలమైన ఈ ఆరు లేన్ల బ్రిడ్జి వల్ల గువాహటి, ఉత్తర గువాహటి నడుమ ప్రయాణ సమయం ఇకపై కేవలం ఏడు నిమిషాలకు తగ్గనుంది. ప్రస్తుతం సరాయ్‌ఘాట్‌ బ్రిడ్జి మాత్రమే వాటిని అనుసంధానిస్తోంది. దానిపై బ్రహ్మపుత్రను దాటేందుకు కనీసం 30 నిమిషాలు పడుతుంది. కొత్త బ్రిడ్జిని భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఎక్స్‌ట్రా డోస్డ్‌ ప్రీ స్ట్రెస్డ్‌ కాంక్రీట్‌తో నిర్మించారు. ఈశాన్య భారతదేశంలో ఈ టెక్నాలజీతో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే. దీని నిర్మాణానికి 2019లో మోదీయే శంకుస్థాపన చేశారు. 2020 లో నిర్మాణ పనులు మొదలయ్యాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement