‘ఏఐ సాంకేతికత అందరిదీ’: ‘సమితి’ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు | India is the right place for global AI talks, says UN Chief | Sakshi
Sakshi News home page

‘ఏఐ సాంకేతికత అందరిదీ’: ‘సమితి’ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Feb 15 2026 11:49 AM | Updated on Feb 15 2026 12:23 PM

India is the right place for global AI talks, says UN Chief

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యవహారాల్లో విస్తరిస్తున్న భారత్‌ ప్రభావంపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రశంసలు కురిపించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కీలక అంశాలపై ప్రపంచ స్థాయి చర్చలు నిర్వహించడానికి భారత్ అత్యంత అనువైన దేశమని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన వృద్ధి పథంలో ఉందని, ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఏఐ సాంకేతికత మానవాళి అందరికీ ఉపయోగపడాలని ఆంటోనియో గుటెర్రెస్ ఆకాంక్షించారు.

ఏఐ సాంకేతికత కేవలం ధనిక దేశాలకో లేదా రెండు అగ్రరాజ్యాలకే (అమెరికా, చైనా) పరిమితం కాకూడదని గుటెర్రెస్ పేర్కొన్నారు. ఈ శక్తివంతమైన సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలు ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందాలని, ముఖ్యంగా ‘గ్లోబల్ సౌత్’ దేశాలకు ఇందులో సమాన వాటా ఉండాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం కొద్దిమంది చేతుల్లోనే ఈ అధికారం ఉంటే అది ఆమోదయోగ్యం కాదని, అభివృద్ధి, ఆవిష్కరణలు, ప్రపంచ ప్రగతికి ఏఐ ఒక సార్వత్రిక సాధనంగా మారాలని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 16 నుండి 20 వరకు న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సు, గ్లోబల్ సౌత్‌లో జరుగుతున్న మొట్టమొదటి భారీ ఏఐ సదస్సుగా నిలవనుంది. ఈ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో పాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ తదితర దిగ్గజాలు పాల్గొననున్నారు. ఈ చర్చల్లో పాల్గొనేందుకు గుటెర్రెస్ స్వయంగా భారత్‌కు రానున్నారు.కాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పులు రావాలని, నేటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టాలని ఆయన కోరారు. భారత ప్రాచీన నాగరికత, ప్రజాస్వామ్య విలువలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని కొనియాడిన ఆయన, ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే భేటీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement