Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా.. | Mahashivratri rush at Prayagraj 10 lakh devotees throng Sangam ghats | Sakshi
Sakshi News home page

Prayagraj: పుణ్యస్నానాల్లో సరికొత్త రికార్డు.. క్యూలో లక్షలాదిగా..

Feb 15 2026 11:11 AM | Updated on Feb 15 2026 12:07 PM

Mahashivratri rush at Prayagraj 10 lakh devotees throng Sangam ghats

ప్రయాగ్‌రాజ్: శివరాత్రి వేళ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ భక్తజన సంద్రమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర త్రివేణి సంగమ ఘాట్‌లకు పోటెత్తారు. వార్షిక మాఘమేళాలో భాగంగా జరిగిన చివరి ‘స్నాన పర్వం’లో దాదాపు 10 లక్షల మందికి పైగా భక్తులు ఇప్పటివరకూ పవిత్ర స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ‘హర హర మహాదేవ శంభో’ అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో గంగా తీరం మార్మోగిపోయింది. భక్తుల రాక నిరంతరాయంగా కొనసాగుతూనే ఉందని మాఘమేళా అధికారి రిషి రాజ్ మీడియాకు తెలిపారు.
 

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ (ఏటీఎస్‌) మొబైల్ పెట్రోలింగ్ బృందాలు మేళా ప్రాంతంలో నిరంతరం పహారా కాస్తున్నాయి. ఘాట్‌ల వద్ద తొక్కిసలాట జరగకుండా క్రౌడ్ మేనేజ్‌మెంట్ బృందాలను రంగంలోకి దించారు. నెల రోజుల పాటు సాగిన  మాఘమేళా వేడుక ప్రశాంతంగా ముగిసేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

 

శివరాత్రి సందడి కేవలం ప్రయాగ్‌రాజ్‌కే పరిమితం కాలేదు. ఆధ్యాత్మిక రాజధాని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం వెలుపల భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. అలాగే అహ్మదాబాద్‌లోని మినీ సోమనాథ్ ఆలయం, రియాసీలోని ఆప్ శంభు మహాదేవ్ గుడి, అయోధ్యలోని నాగేశ్వరనాథ్ ఆలయాల్లో ప్రత్యేక హారతులు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు రోజంతా ఉపవాస దీక్షలు చేపట్టి, రాత్రంతా జాగరణ చేస్తూ శివయ్యను కొలుస్తున్నారు. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి అంటే శివ-పార్వతుల కళ్యాణం జరిగిన రోజని భక్తుల నమ్మకం. దేవతలు, గంధర్వులు, పశుపక్షాదులు, భూతగణాల సాక్షిగా పార్వతీ దేవిని శివుడు వివాహం చేసుకున్నాడని చెబుతారు.

ఇది కూడా చదవండి: మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement