ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు | Valentines Day Sadness Bodies With Gunshots In Car | Sakshi
Sakshi News home page

ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు

Feb 15 2026 9:22 AM | Updated on Feb 15 2026 11:32 AM

Valentines Day Sadness Bodies With Gunshots In Car

నోయిడా: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ప్రేమికుల రోజున విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 39 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కారులో యువతీ యువకుల జంట విగతజీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, లోపల నుండి లాక్ చేసి ఉన్న కారులో బుల్లెట్ గాయాలతో ఉన్న ఇద్దరిని గుర్తించారు. వెంటనే కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ బృందం సాయంతో ఆధారాలు సేకరించారు.

ఈ ఘటనలో మృతిచెందిన వారిని నోయిడా సెక్టార్ 58కి చెందిన రేఖ (26), ఢిల్లీ త్రిలోక్‌పురికి చెందిన సుమిత్ (32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారని, వీరి సంబంధం గురించి ఇరు కుటుంబాలకు ముందే తెలుసని సమాచారం. అయితే, ఈ ఘటనకు ముందు రోజు నుండే వీరు ఎవరికీ కనిపించకుండా పోవడంతో, కుటుంబ సభ్యులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో సుమిత్ చేతిలో ఒక పిస్టల్ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సుమిత్ తన ప్రియురాలు రేఖను కాల్చి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి బలమైన సాక్ష్యంగా సుమిత్ పంపిన ఒక వాట్సాప్ సందేశం లభించింది. ‘నేను, సుమిత్.. ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి రేఖే కారణం. ఆమె 15 ఏళ్లుగా నాతో ప్రేమలో ఉండి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోబోతోంది. ఆమె నన్ను మోసం చేసినందునే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను’ అని ఆ సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.

పోలీసులు దీనిని ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ, సుమిత్ కుటుంబ సభ్యులు మాత్రం ఇది ముమ్మాటికీ హత్యేనని ఆరోపిస్తున్నారు. కులం పేరుతో రేఖ కుటుంబం తమను అవమానించిందని, తమకు  బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని వారు పోలీసులకు తెలిపారు. కారు దొరికిన ప్రాంతం రేఖ ఉండే గ్రామానికి అతి సమీపంలో ఉండటంపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుల వివక్ష కారణంగానే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నారని వారు చెబుతున్నారు. పోలీసులు  అన్ని కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇది  కూడా చదవండి: Bangladesh: తారిఖ్‌ రెహ్మాన్‌ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

Advertisement
 
Advertisement
Advertisement