న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో ఈ నెల 17వ తేదీన ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్మన్ తారిఖ్ రెహ్మాన్ నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ ఈ వేడుకను అంతర్జాతీయ వేదికగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్, చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, యూఏఈ సహా మొత్తం 13 దేశాల ప్రభుత్వాధినేతలకు అధికారికంగా ఆహ్వానాలు పంపారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉన్న ప్రత్యేక దౌత్య సంబంధాల దృష్ట్యా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అందిన ఆహ్వానం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఫిబ్రవరి 17న ముంబైలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపధ్యంలో ప్రధాని ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయనకు బదులుగా భారత ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ లేదా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బంగ్లాదేశ్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ పార్టీ అధికారికంగా మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించబోతోంది. బంగ్లాదేశ్ పార్లమెంట్ హౌస్‌లోని సదరన్ ప్లాజాలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. అదే రోజు ఉదయం నూతనంగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణం చేయనుండగా, అనంతరం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏఎంఎం నాసిర్ ఉద్దీన్.. తారిఖ్ రెహమాన్ చేత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
దక్షిణాసియాలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమానికి శ్రీలంక, నేపాల్, మాల్దీవులు, భూటాన్ తదితర పొరుగు దేశాల ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. కాగా బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ, భారత్‌తో ఆ దేశ సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో బీఎన్‌పీ హయాంలో భారత్‌తో సంబంధాలు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, ప్రస్తుత నాయకత్వం ప్రాంతీయ సహకారం, వాణిజ్యం, స్థిరత్వంపై సానుకూల ప్రకటనలు చేసింది.


