ఆగంతకురాలి కాల్పుల్లో 10 మంది దుర్మరణం
27 మందికి గాయాలు
తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన ఆగంతకురాలు
బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో ఘటన
వాంకోవర్: ప్రశాంత కెనడాలో కాల్పుల మోత మోగింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని టుంబ్లర్ రిడ్జ్ కొండ ప్రాంత పట్టణంలోని టుంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లో ఓ ఆగంతకురాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. రక్తమోడుతున్న ఇద్దరిని అధికారులు హుటాహుటిన హెలికాప్టర్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. సమీప ఇంట్లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు.
వినబడగానే వణికిపోయాం..
‘‘కాల్పుల శబ్దాలు రాగానే అంతా వణికిపోయాం. స్కూల్‌లో లాక్‌డౌన్ ప్రకటిస్తున్నాం. పిల్లలంతా వెంటనే మీ క్లాస్‌రూమ్‌ను లోపలి నుంచి గడియపెట్టండి అని లౌడ్‌స్పీకర్లలో అనౌన్స్‌మెంట్ వినపడింది. వెంటనే మా తరగతి గది తలుపులు మూసేశాం. వాటిని బద్దలుకొట్టకుండా అడ్డుగా టేబుళ్లను పేర్చాం. వాటిని అలాగే రెండు గంటలపాటు అదిమిపట్టాం. పోలీసులు వచ్చాకే మా ప్రాణం లేచొచి్చంది’’అని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న డేరియన్ క్విస్ట్ చెప్పాడు.
‘‘మా స్కూల్ ప్రిన్సిపల్ లాక్‌డౌన్ అని అరుస్తూ కన్పించారు. వెంటనే విద్యార్థులతోపాటు తరగతి గదిలోకి పరుగెత్తి లోపలి నుంచి గడియ బిగించాం. అడ్డుగా బెంచీలను అడ్డుపెట్టాం. అలా రెండు గంటలు ఉండిపోయాం. కాల్పుల శబ్దాలు మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ దెబ్బకు చిన్నారులు మళ్లీ పాఠశాలకు అడుగుపెట్టడం కష్టమే’’అని మెకానికల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు జార్బాస్ నోరోన్హా చెప్పారు.
పాఠాల ప్రతిధ్వనులు మినహా కాల్పుల మోతలు అస్సలు వినబడని కెనడా పాఠశాలల్లో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు మొదలుకాగానే పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్లు కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్‌కు వచ్చారు’’అని బ్రిటిష్ కొలంబియా ప్రజా భద్రతా మంత్రి, సొలిసిటర్ జనరల్ నైనా క్రీగర్ వెల్లడించారు. పోలీసులు వచ్చేలోపే ఆగంతకురాలు తనను తాను తీవ్రంగా గాయపర్చుకుని చనిపోయింది.
ఆమె మృతదేహాన్ని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. ఆగంతకురాలి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సూపరింటెండెంట్ కెన్ ఫ్లాయిడ్ చెప్పారు. ‘బ్రౌన్ రంగు జుట్టు ఉన్న సాయుధురాలు’’అని మాత్రమే పేర్కొన్నారు. స్కూల్‌కు ఆమెకు ఉన్న సంబంధం ఏంటనేది తెలియరాలేదు. ఘటన జరిగిన పాఠశాలలో ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం 175 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. టుంబ్లర్ రిడ్జ్ జనాభా 2,700 మాత్రమే. సమీప బొగ్గు పరిశ్రమకు సహాయకంగా 1981లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాన్ని నిర్మించింది.


