హైదరాబాద్: మాదాపూర్ ఎస్సై వినయ్‌కుమార్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఐటీ కన్సల్టెన్సీ కంపెనీ కేసు విషయంలో కోర్టు నుంచి ఆర్డర్ కాపీ ఉన్నప్పటికీ బీఎన్‌ఎస్‌ఎస్ నోటీసు ఇవ్వడానికి ఎస్సై వినయ్ జాప్యం చేస్తున్నారు.
నోటీసు కావాలని బాధితుడు పదేపదే వేడుకోవడంతో రూ.లక్ష లంచం ఇవ్వాలన్నారు. ఒకేసారి ఇవ్వలేననడంతో.. రూ.50 వేల చొప్పున ఇవ్వాలన్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వినయ్ రూ.50 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


