రూ.6 వేలతో ఉన్న కవర్
మొయినాబాద్, శంకర్‌పల్లిలో డబ్బుల వరద
మున్సిపల్ ఓటర్లకు పండుగే.. పండుగ
కరీంనగర్ కార్పొరేషన్: ఎలక్షన్ ముందు ‘డిస్ట్రిబ్యూషన్’ ట్రెండ్ మారింది. కరీంనగర్‌లోని 66 డివిజన్‌లలో తక్కువలో తక్కువగా రూ.వేయి, ఎక్కువగా రూ.6 వేల చొప్పున ఓటుకు ఇచ్చారు. కరీంనగర్ కార్పొరేషన్‌లో ఉదయం నుంచే అభ్యర్థులు ఓటర్లకు డబ్బులు, మద్యం, బహుమతులు పంచారు. నగరవ్యాప్తంగా 2వ డివిజన్ డబ్బుల పంపకాల్లో అత్యంత విలువైన డివిజన్‌గా మారింది. ఇక్కడ ఓ అభ్యర్థి ఒక్కో ఓటుకు రూ.6 వేలు ఇచ్చారు. రూ.6 వేలతో కూడిన కవర్‌ను నేరుగా ఓటరుకు అందజేశారు.
ఒకే ఇంట్లో నలుగురు నాలుగు కవర్లు అంటే రూ.24 వేలు ఇవ్వడంతో ఓటర్లే ఆశ్చర్యపోయారు. కనీసం రెండు వేల మంది ఓటర్లకు రూ.1.20 కోట్లు పంచినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి ఈ స్థాయిలో పంచడంతో మరో అభ్యర్థి కూడా సెలెక్టెడ్ ఓటర్లకు రూ.5 వేల చొప్పున, ఇతర అభ్యర్థులు ఓటుకు రూ.1,500, రూ.2 వేలచొప్పున పంపకాలు చేపట్టారు.
‘రియల్’ ప్రభావంతో
శంకర్‌పల్లి/మొయినాబాద్: శంకర్‌పల్లి, మొయినాబాద్‌లో ఓటుంటే బాగుండేది’.. ఇదీ ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ ఓటర్ల ఫీలింగ్. ఎందుకంటారా..? ఇక్కడ ఒక్కో ఓటుకు పలుకుతున్న రేటు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి మున్సిపాలిటీలున్నాయి.
వీటిలో మొయినాబాద్, శంకర్‌పల్లి హాట్‌టాపిక్‌గా మారాయి. ఇక్కడ ఒక్క ఓటుకు రూ.వేలల్లో, ఇంట్లో రెండు, మూడు ఓట్లుంటే రూ.లక్షల్లో నగదు అందుతోంది. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న పలువురు అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వార్డుల్లో పెద్దమొత్తంలో కరెన్సీ వెదజల్లుతున్నారు.
15 వార్డులు.. రూ.50 కోట్లు
శంకర్‌పల్లి మున్సిపాలిటీలో 15 వార్డులు ఉండగా.. 57 మంది బరిలో నిలిచారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వీరు ఇప్పటికే పలు వార్డుల్లో ఒక్కో ఓటుకు రూ.30 వేల వరకు పంచారు. అంతటితోనే ఆగకుండా వెండినాణేలు, పట్టు చీరలు పంపిణీ చేశారు. ఇలా మున్సిపల్ పరిధిలో మొత్తం రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశముంది.
ఒక్క అభ్యర్థి.. రూ.5 కోట్లు
మొయినాబాద్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఓటుకు రూ.లక్ష ఇచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు అతి చేరువలో ఉండటం, ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో చాలామంది రియల్ వ్యాపారులు కావడంతో డబ్బును లెక్కచేయడం లేదు. మొయినాబాద్ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉండగా, త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పంచుతుండగా, రెండు మూడు వార్డుల్లో మాత్రం ఓటుకు రూ.30 నుంచి రూ.40 వేలు పంచినట్టు సమాచారం.
ఓ వార్డులో ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఓటుకు రూ.లక్ష ఇచ్చినట్టు తెలుస్తోంది. తన చేయివాటంతో చివరి నిమిషంలో ఓ ప్రధాన పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్న ఈయన ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో వార్డులో రూ.5 కోట్లు పంపిణీ చేసినట్టు ప్రచారం సాగుతోంది.
గుట్టలో ఓటు కాస్ట్‌లీ
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట మున్సిపాలిటిలోని ఓ వార్డులో ఓ అభ్యర్థి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఒక్కో ఓటుకు చెల్లించాడు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే ఆ అభ్యర్థి ఓటర్లను ఆకర్షించేందుకు మద్యం పంపిణీ చేశాడు. ఇంటికి 25 కిలోల బియ్యం బస్తా, మాంసం, చీరలు కూడా అందించారు.
అదే వార్డులో మరో అభ్యర్థి రూ.5 వేలు ఓటుకు అందజేశారు. ఇంకో వార్డులో ఓ అభ్యర్థి రూ.7వేలతోపాటు వెండి కుంకుమ భరణి ఓటర్లకు ఇచ్చాడు. మరికొందరు రూ.3 వేల నుంచి రూ.5 వేలతో పాటు యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సెంటిమెంట్‌కు తెరలేపారు.
ఇస్నాపూర్‌లో బంగారం ఆఫర్
బెంగళూరు, చెన్నైలో ఉండే ఓటర్లకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ఓ అభ్యర్థి ఓటర్లకు బంగారం ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఓటుకు రూ.5 వేల చొప్పున నలుగురు ఓటర్లు ఉన్న ఇంటికి రూ.20 వేలు పంపిణీ చేస్తున్న సదరు అభ్యర్థి..తాను గెలిస్తే నలుగురు ఉన్న ఇంటికి పావుతులం బంగారం ఇస్తామని హామీ ఇస్తుండటం స్థానికంగా చర్చనీ యాంశంగా మారింది. నగరానికి ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీతోపాటు, ఇంద్రేశం మున్సిపాలిటీలో భూముల ధరలు చుక్కలనంటుతున్నాయి.
రియల్ వ్యాపారాలు, బిల్డర్లుగా వ్యవహరించే నేతలే ఈ ఎన్నికల్లో అభ్య ర్థులుగా బరిలోకి దిగడంతో పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరలేచింది. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ అభ్యర్థుల ఎన్నికల వ్యయం రూ.కోట్లలో ఉంది. ఉద్యోగాల నిమిత్తం చెన్నై, బెంగళూరులో ఉండే ఓటర్లకు ఈ మున్సిపాలి టీలోని కొందరు అభ్యర్థులు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేస్తు న్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాల్లో నివాసముండే వారికోసం క్యాబ్‌లు సైతం బుక్ చేస్తున్నారు.
డబ్బు..చీరల పంపిణీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 12 మున్సిపాలిటీల్లో ఒక్కో ఓటరకు రూ.1,000ల నుంచి రూ.3,000 వరకు నగదు పంపిణీ చేశారు. వీటికి తోడు అదనంగా మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నట్టు ప్రచారం ఉంది. మహిళా ఓటర్లను చీరల పంపిణీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.


