ఆస్తి దక్కకుండా చేసిందన్న అక్కసుతో.. | Son in law assassinated mother in law in Mahabubabad district | Sakshi
Sakshi News home page

ఆస్తి దక్కకుండా చేసిందన్న అక్కసుతో..

Feb 11 2026 4:17 AM | Updated on Feb 11 2026 4:17 AM

Son in law assassinated mother in law in Mahabubabad district

విద్యుత్‌ వైరు అమర్చిన ఇనుప కడ్డీలు (ఇన్‌సెట్‌లో) ధరావత్‌ కౌసల్య

అత్తకు విద్యుత్‌షాక్‌ పెట్టి చంపిన అల్లుడు 

మామకు గాయాలు.. భార్య, వదినపై కత్తితో దాడి.. 

మహబూబాబాద్‌ జిల్లాలో ఘటన 

గార్ల: అన్నకు రెండో పెళ్లి చేసి మొత్తం ఆస్తి తనకు దక్కకుండా చేసిందన్న కోపంతో నిద్రమత్తులో ఉన్న అత్తకు ఓ అల్లుడు విద్యుత్‌షాక్‌ పెట్టి చంపాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం సీతంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై బి.సాయికుమార్‌ కథనం ప్రకారం.. సీతంపేట పంచాయతీ మంగళితండాకు చెందిన బానోత్‌ రాజేశ్‌ అన్న రమేశ్‌కు మూడు రోజుల క్రితం సీతంపేటలో రెండో వివాహం జరిగింది. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన ధరావత్‌ కౌసల్య (50) అలియాస్‌ కంసాలి తన కూతురును బానోత్‌ రాజేశ్‌కు పదేళ్ల క్రితం ఇచ్చి వివాహం చేసింది. వీరి కుటుంబం సజావుగానే సాగుతోంది. రమేశ్‌కు సైతం 15 ఏళ్ల క్రితం వివాహం జరగగా అతని భార్య ఏడేళ్ల క్రితం అతన్ని వదిలి వెళ్లిపోయింది. రమేశ్‌కు రెండో పెళ్లి సంబంధంగా కౌసల్య ఇటీవల తన అన్న కూతురు అంజలితో సంబంధం కుదిర్చింది. రమేశ్, అంజలి వివాహం మూడు రోజుల క్రితం సీతంపేటలో జరిగింది. 

అంతా నిద్రలో ఉండగా.. 
రమేశ్‌కు పెళ్లికాకపోతే ఆస్తిమొత్తం రాజేశ్‌కు దక్కేది. దీన్ని మనసులో పెట్టుకున్న రాజేశ్‌ తన అన్నకు రెండో పెళ్లి చేసి తనకు ఆస్తి దక్కకుండా చేసిందనే అక్కసుతో అత్త కౌసల్యను చంపేందుకు ప్లాన్‌ వేశాడు. మంగళవారం తెల్లవారుజామున అందరూ గాఢనిద్రలో ఉండగా అత్తమామను చంపేందుకు ఇనుప కడ్డీలకు విద్యుత్‌ వైరు కట్టి వారు పడుకున్న మంచం తలదిండు కింద పెట్టి స్విచ్‌ ఆన్‌ చేశాడు. కౌసల్యకు మెలకువ వచ్చి కదలడంతో ఇనుపకడ్డీ తాకి విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే మృతిచెందింది. 

మామ వెంటనే నిద్రలేచి తనభార్యను పట్టుకోగా అతనికి సైతం విద్యుత్‌షాక్‌ తగలడంతో కేకలు వేశాడు. ఇంట్లోని అందరూ లేచే సరికి అత్త మృతిచెందగా, మామ స్పృహ కోల్పోయి ఉన్నాడు. వెంటనే రాజేశ్‌ తండ్రి వచ్చి విద్యుత్‌ బోర్డు ప్లగ్‌ తీశాడు. రాజేశ్‌ భార్య ఎందుకు ఇలా చేశావని నిలదీయగా మద్యం మత్తులో కత్తితో ఆమెపై దాడి చేశాడు. అడ్డువచ్చిన అంజలిపైనా కత్తితో దాడి చేశాడు. 

ఇరువురికి గాయాలు కాగా, ఇరుగుపొరుగు వారు వచ్చి వారిని గార్ల ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి రాజేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దివ్యాంగుడైన రాజేశ్‌కు కొంత ఎలక్ట్రీíÙయన్‌ పని కూడా వస్తుంది. దీంతో కరెంటుపై కొంత అవగాహన ఉండడంతో ఇనుప కడ్డీలకు విద్యుత్‌ వైర్లు పెట్టడం, దానిని మంచంలో ఎవరికీ కనిపించకుండా అమర్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement