రూ.4.43 లక్షల కోట్లు | NABARD releases State Focus Paper | Sakshi
Sakshi News home page

రూ.4.43 లక్షల కోట్లు

Feb 11 2026 4:07 AM | Updated on Feb 11 2026 4:07 AM

NABARD releases State Focus Paper

2026–27 సంవత్సరానికి నాబార్డ్‌ ప్రాధాన్య రంగ రుణ లక్ష్యం

గత ఏడాది రూ.3.86 లక్షల కోట్లతో పోలిస్తే 15% వృద్ధి 

రాష్ట్ర వ్యవసాయ, మౌలిక వసతులు, అనుబంధ రంగానికి రూ.1.81 లక్షల కోట్లు 

ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2.40 లక్షల కోట్లు 

స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2026–27 విడుదల చేసిన నాబార్డ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గ్రామీణ మౌలిక వసతులు, సేవారంగాల అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా 2026–27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు (నాబార్డ్‌) ప్రాధాన్య రంగ రుణ లక్ష్యాన్ని భారీగా పెంచింది. గత ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధితో మొత్తం రూ.4.43 లక్షల కోట్ల రుణ సామర్థ్యాన్ని అంచనా వేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర రుణ సదస్సు నేపథ్యంలో 2026–27కు ‘స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌’ను బ్యాంకు విడుదల చేసింది. 

‘వ్యవసాయ’ రుణంలో 11% వృద్ధి
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మొత్తం రూ.1.81 లక్షల కోట్ల రుణాన్ని లక్ష్యంగా నిర్ధారించుకుంది. గత ఏడాది రూ.1.63 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 11 శాతం ఎక్కువ. దాంతో పాటు పంట రుణాల (ఫామ్‌ క్రెడిట్‌) కోసం రూ.1.54 లక్షల కోట్లు (గతేడాదితో పోలిస్తే 11% పెరుగుదల), వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ. 0.07 లక్షల కోట్లు (8% వృద్ధి), పశుపోషణ, మత్స్య, కోళ్ల పెంపకం తదితర అనుబంధ కార్యకలాపాలకు రూ.0.19 లక్షల కోట్లు (18% వృద్ధి) ప్రతిపాదించింది. 

వ్యవసాయం కేటగిరీలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యధిక వృద్ధి నమోదవడం గమనార్హం. రైతుల ఆదాయం పెరగాలంటే పంటలకే కాకుండా విలువ ఆధారిత కార్య కలాపాలపై దృష్టి అవసరమని నాబార్డ్‌ స్పష్టం చేసింది. 

ఎంఎస్‌ఎంఈలకు భారీ ప్రాధాన్యం
తెలంగాణ ఆర్థిక వృద్ధికి ఇంజన్‌లా మారిన ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2.39 లక్షల కోట్ల రుణ సామర్థ్యాన్ని నాబార్డ్‌ అంచనా వేసింది. ఇది గత ఏడాది రూ.2.49 లక్షల కోట్ల కంటే 18 శాతం ఎక్కువ. మొత్తం ప్రాధాన్య రంగ రుణాల్లో ఎంఎస్‌ఎంఈల నుంచే అత్యధిక పరిమాణంలో వృద్ధి నమోదవుతుండటం గమనార్హం. తయారీ, సేవారంగాలు, ఎగుమతులు, ఉపాధి సృష్టిలో ఎంఎస్‌ఎంఈల పాత్ర కీలకమని నాబార్డ్‌ పేర్కొంది. 

గృహ, విద్య, సామాజిక మౌలిక వసతులు
గృహ రుణాలకు రూ.12,450 కోట్లు (19% వృద్ధి), విద్యా రుణాలకు రూ.2,670 కోట్లు (7% వృద్ధి), సామాజిక మౌలిక వసతులకు రూ. 1,770 కోట్లు (16% వృద్ధి), ఎగు మతి రుణాలకు రూ.650 కోట్లు (6% వృద్ధి), పునరుత్పా దక శక్తికి రూ.580 కోట్లు, ఇతర రంగాలకు రూ. 4,420 కోట్లు (21% వృద్ధి) అంచనా వేసింది. మొత్తంగా చూస్తే గ త ఏడాది రూ.3.86 లక్షల కోట్లుగా ఉన్న ప్రాధాన్య రంగ రు ణ సామర్థ్యం ఈ ఏడాది రూ.4.43 లక్షల కోట్లకు చేరింది.

విజన్‌–2047తో అనుసంధానం: సీఎస్‌ 
రాష్ట్రం 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల వ్యవస్థ స్థాయికి చేరుకోవాలంటే ముందుచూపుతో కూడిన సమగ్ర రుణ ప్రణాళికలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు. 

నాబార్డ్‌ నిర్వహించిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2026–27లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్‌ విజన్‌ డాక్యుమెంట్‌–2047కు నాబార్డ్‌ రూపొందించిన స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ స్పష్టంగా అనుసంధానమై ఉందంటూ ప్రశంసించారు. ఇది సకాలంలో రూపొందిన, భవిష్యత్‌ అవసరాలకు తగిన మార్గదర్శక పత్రమని అభివర్ణించారు.  

జిల్లా స్థాయిలో విస్తృత సంప్రదింపులు
నాబార్డ్‌ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ బి.ఉదయ భాస్కర్‌ మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో విస్తృత సంప్రదింపుల ద్వారా స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ను రూపొందించామని తెలిపారు. ఇది 2026–27 వార్షిక క్రెడిట్‌ ప్లాన్‌ తయారీకి ప్రాతిపదికగా పనిచేస్తుందని చెప్పారు. 

33 జిల్లాల్లో రంగాల వారీగా, ప్రాంతాల వారీగా అవకాశాలను గుర్తించడంతో పాటు మౌలిక వసతుల లోటును కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్‌ చిన్మయ్‌ కుమార్‌ తదితరులు మాట్లాడారు.   – సీజీఎం ఉదయభాస్కర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement