హైదరాబాద్ సిటీలో రహదారి భద్రతని మెరుగుపరిచే దిశగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్చి 1 నుంచి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై నిరంతరం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
లైసెన్స్ తప్పనిసరి: వాహనదారులు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ కచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. లైసెన్స్ లేకపోతే వెంటనే సంబంధిత ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం నుంచి దాన్ని పొందండి.
ప్రమాదాల విశ్లేషణ: నగరంలో జరుగుతున్న మెజారిటీ రోడ్డు ప్రమాదాల్లో, వాహనం నడుపుతున్న వ్యక్తికి సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడమే ప్రధాన కారణం.
వాహన యజమానులకు హెచ్చరిక: తమ వాహనాలను డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు ఇచ్చే యజమానులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీన్ని నేరంగా పరిగణిస్తాం.
భీమా వర్తించదు: లైసెన్స్ లేని వ్యక్తి వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదం జరిగితే, సదరు వాహనానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వర్తించదు. దీనివల్ల తీవ్రమైన ఆర్థిక, చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
హైదరాబాద్ నగర వాసులందరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోరారు.


