చంద్రహాస్‌పై మరో కేసు
బంజారాహిల్స్: బుల్లితెర నటుడు ప్రభాకర్ కుమారుడు సినీహీరో చంద్రహాస్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ కె.వెంకటేశ్వరరెడ్డి తెలిపిన మేరకు.. చంద్రహాస్ హీరోగా నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వారం క్రితం జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్‌లో నిర్వహించారు. వేడుకల్లో చంద్రహాస్ అసభ్య పదజాలంతో పాటపాడాడు. దీంతో చంద్రహాస్ ఉపయోగించిన భాష సరికాదని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ నితీష్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని చంద్రహాస్ కోసం గాలింపు చేపట్టారు. మాదాపూర్ పీఎస్‌లో కూడా ఇతనిపై కేసు నమోదైంది.
12.7 తులాల బంగారు నగలు చోరీ
విజయనగర్‌కాలనీ: ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు 12.7 తులాల బంగారు నగలు చోరీచేశారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆసిఫ్‌నగర్ హుడా కాలనీలో నివాసముండే ప్రభాకర్ రెడ్డి (58) గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్థానిక విజయ డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లాడు. ఓ గంట తరువాత తిరిగి ఇంటికి రాగా 2వ ఫ్లోర్‌లోని ఇంటి తాళం ధ్వంసమై ఉంది. లోపలకు వెళ్లి చూడగా అల్మార పగులగొట్టి అందులోని 12.7 తులాల బంగారును దొంగలు చోరీ చేసినట్లు గుర్తించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సాంకేతిక సమస్య.. విమానం ఆలస్యం
శంషాబాద్: బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ విమానం సాంకేతిక కారణాలవల్ల రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయలుదేరేందుకు లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణికులు ఎక్కికూర్చున్నారు. గురువారం తెల్లవారు జామున 3.40 గంటలకు టేకాఫ్ తీసుకునే సమయంలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. మరమ్మతుల అనంతరం రెండుగంటలు ఆలస్యంగా బయలుదేరింది.
మత్తులో ఉన్న ప్రయాణికుడి దించివేత
శంషాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడిని విమానంలోంచి దించివేసిన సంఘటన ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానం ఢిల్లీకి వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడు మద్యం మత్తులో స్పృహ లేకుండా ఉండిపోయాడు. దీంతో ఎయిర్‌లైన్స్ అధికారులు కిందికి దించివేశారు.
లిఫ్ట్ అడిగి చోరీకి యత్నం
లంగర్‌హౌస్: ఓ యువకుడు ద్విచక్రవాహనదారుడిని లిఫ్ట్ అడిగి చోరీకి యత్నించాడు.ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్‌లో నివాసముందే రాము గురువారం ఉదయం గుడిమల్కాపూర్ నుంచి ఇంటికి బయల్దేరాడు. సంగం వద్ద బీహార్‌కు చెందిన యువకుడు లిఫ్ట్ ఇవ్వాలని ఆపాడు. ట్రాఫిక్ పోలీసులు తన ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నారని, తాను అత్యవసరంగా వెళ్లాలని రామును కోరాడు.దీంతో రాము అతనికి లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తరువాత వెనుక కూర్చున్న యువకుడు రాము జేబు కట్ చేసి డబ్బు చోరీచేయబోయాడు.గమనించిన రాము రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించబోయాడు. ఈ క్రమంలో ఆ దొంగ.. రాము కాళ్లు , చేతులు రక్తం వచ్చేలా కొరికి పరారయ్యాడు. దీంతో స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీ కొట్టిన టిప్పర్
● ఆటోలో ఏడుగురు విద్యార్థులు ● పాఠశాలకు వెళుతుండగా ప్రమాదం
జియాగూడ: విద్యార్థులను పాఠశాలను తీసుకెళుతున్న ఓ ఆటోను ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ రాములు తెలిపిన మేరకు.. జియాగూడకు చెందిన సందీప్ (35) గురువారం ఉదయం జియాగూడ నుండి అత్తాపూర్‌లోని శ్రీ చైతన్య స్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులను ఆటోలో తీసుకువెళుతున్నాడు. ఈ క్రమంలో పాత బస్తీకి చెందిన షఫీ వేగంగా టిప్పర్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఆటోను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థితోపాటు, డ్రైవర్ సందీప్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అధిక పనిగంటలతో అధ్యాపకుల్లో ఒత్తిడి
సాక్షి,సిటీ బ్యూరో: ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాలలో బోధన, మానిటరింగ్ పేరుతో అధిక పని గంటల విధానం తొలగించాలని తెలంగాణ రెసిడెన్నియల్ డిగ్రీ కాలేజ్ ఎంపవరింగ్ అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ తట్ల సాంబలక్ష్మి, డాక్టర్ రమాదేవి డిమాండ్ చేశారు. ఉదయం 8.45 నుండి సాయంత్రం 5 గంటలు విధులు నిర్వహించడంతోపాటు పాటు వారానికి రెండు నుండి మూడు నైట్ డ్యూటీలు చేయాల్సి వస్తోందన్నారు. రాత్రి డ్యూటీ చేసిన రోజు అధ్యాపకులు ఉదయం నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా కళాశాలలోనే ఉంటున్నారన్నారు. దీంతో 28 గంటలు ఏకధాటిగా కళాశాలలో పనిచేయడం వల్ల మానసిక ఒత్తిడితో అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమన్నారు.


