వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సైతం ప్రతిదాడులు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు ఇరాన్ గట్టి షాకులే ఇస్తోంది. తాజాగా ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికా ఐదోతరం ఎఫ్-35 లైట్నింగ్2 యుద్ధ విమానంపై దాడి చేశామని ఇరాన్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఇరాన్ ప్రకటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందిస్తూ దాడి నిజమేనని అంగీకరించారు. దీంతో, అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది.
వివరాల మేరకు.. అమెరికాను టార్గెట్‌ను చేసిన ఇరాన్ గురువారం (మార్చి 19న) ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌పై ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)దాడులు చేసింది. తెల్లవారుజామున 2.50 గంటలకు సెంట్రల్ ఇరాన్ ప్రాంతంలో ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్‌పై అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ ద్వారా దాడి చేశామని ఐఆర్‌జీసీ వెల్లడించింది. ఈ సందర్భంగా సదరు యుద్ధ విమానం కూలిపోయే అవకాశాలే చాలా ఎక్కువని, కానీ దాడి తర్వాత దానికి ఏం జరిగిందనే విషయం తమకు తెలియదని పేర్కొంది. ప్రస్తుతం దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. ఇక, ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ డ్రోన్లను సైతం 125కుపైగా కూల్చామని చెప్పింది. ఈ వివరాలను ఐఆర్‌జీసీ తమ అధికారిక వెబ్‌సైట్ వేదికగా గురువారం విడుదల చేసింది.
అమెరికా రియాక్షన్..
ఇరాన్ ప్రకటనను అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ అంగీకరించారు. ఈ సందర్బంగా తమ ఎఫ్-35 యుద్ధ విమానం ఒకటి పశ్చిమాసియాలోని ఓ వైమానిక స్థావరంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిందని వెల్లడించారు. అయితే యుద్ధ విమానంతో పాటు పైలట్ సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సైన్యం ఉపరితలం నుంచి గగనతలం దిశగా వరుస మిస్సైళ్లను సంధించాకే, ఎఫ్-35 యుద్ధ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. అమెరికా నిర్ణయాత్మక శక్తి ఎఫ్-35 యుద్ధ విమానాలే అంటూ వైట్‌హౌస్ మార్చి 17న ఒక ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే ఒక ఎఫ్-35 ఫైటర్ జెట్‌పై ఇరాన్ దాడి చేయడం గమనార్హం. దీన్నిబట్టి ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ వ్యవస్థలలో కొత్త అప్‌గ్రేడ్‌లు జరిగి ఉండొచ్చని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు.
ట్రంప్‌నకు వరుస షాక్‌లు
పశ్చిమాసియా యుద్ధంలో ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. వీటిని కొన్ని ఇరాన్ వల్ల జరగుగా.. మరికొన్ని సాంకేతిక పొరపాట్లు కారణమయ్యాయి. కువైట్ దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలు పొరపాటున జరిపిన ఫైరింగ్‌లో ఏకంగా మూడు ఎఫ్-15 ఈగల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి. కానీ ఆ విమానాల్లోని ఆరుగురు అమెరికన్ సిబ్బంది సేఫ్‌గా బయటపడ్డారు. గత వారమే ఇరాక్‌లోని పశ్చిమ ప్రాంతంలో కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అమెరికన్ సిబ్బంది చనిపోయారు. అయితే, ట్యాంకర్ విమానం ఎందుకు కూలిపోయింది అనేది ఇప్పటికీ గుర్తించలేకపోయారు.


