చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్‌.. సర్కార్‌ స్వాధీనం! | Telangana Govt Will Take Over Hyderabad Metro Soon | Sakshi
Sakshi News home page

చివరి అంకానికి ‘మెట్రో’ టేకోవర్‌.. సర్కార్‌ స్వాధీనం!

Mar 20 2026 12:19 PM | Updated on Mar 20 2026 12:19 PM

Telangana Govt Will Take Over Hyderabad Metro Soon

సాక్షి, సిటీబ్యూరో: మెట్రో మొదటి దశ స్వా«దీన ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటి వరకు వివిధ స్థాయిల్లో చర్చలు, సమీక్షలు, కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసిన  హైదరాబాద్‌ మెట్రోరైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) ఈ ప్రక్రియను ఎలాంటి జాప్యానికి తావు లేకుండా మరో 10 రోజుల్లో పూర్తిచేసే విధంగా ముందుకు సాగుతోంది. మరోవైపు మెట్రో టోకోవర్‌తో పాటు రెండోదశ నిర్మాణం కోసం భూసేకరణ, మౌలికసదుపాయాలు, తదితర అవసరాల కోసం ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం  నిధులు కేటాయించే అవకాశం ఉంది.

రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మెట్రో టేకోవర్‌ పురోగతిని సమీక్షించారు. బకాయీల చెల్లింపుతో పాటు, వివిధ  అంశాల్లో  ఎలాంటి ఆటంకాలు  లేకుండా టేకోవర్‌ ప్రక్రియ సాఫీగా సాగేందుకు అవసరమైన దిశానిర్దేశాన్ని సూచించారు.మరోసారి  మంత్రి మండలిలోనూ టేకోవర్‌  పైన  విస్తృతమైన చర్చ జరిగే  అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో స్వాధీనం దృష్ట్యా చెల్లించవలసిన రూ.13000 కోట్ల రుణాల కోసం  3 శాతం వడ్డీపైన నిధులను అందజేసేందుకు ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎఫ్‌సీ)ఇప్పటికే  ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు  హెచ్‌ఎంఆర్‌ఎల్‌తో ఒప్పందం కూడా ఖరారైంది.ఎల్‌అండ్‌టీకి  ఇవ్వాల్సిన రూ.2000 కోట్ల బకాయీలను  మాత్రం  ప్రభుత్వమే చెల్లించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వం కేటాయించనున్న నిధులతో ఇది స్పష్టం కానుంది. ఈ రెండు ఆరి్ధక అంశాలు ఒక కొలిక్కి వస్తే ఎల్‌అండ్‌టీ వైదొలగడంతో పాటు మూడు కారిడార్‌లలోని 69.2 కి.మీ.మెట్రో మొదటి దశ ప్రాజెక్టు సర్కార్‌ స్వాధీనంలోకి రానుంది.అలాగే  మెట్రో రైళ్ల నిర్వహణపై  ఫ్రాన్స్‌కు చెందిన  కియోలిస్‌ సంస్థతో  ఏర్పాటు చేసుకొన్న ఒప్పందం ఈ ఏడాది  నవంబర్‌తో ముగియనున్న దృష్ట్యా మరో ఏడాది పాటు  ఒప్పందాన్ని పొడిగించే  అవకాశం ఉన్నట్లు  అధికారులు  తెలిపారు. ప్రాజెక్టు నుంచి  ఎల్‌అండ్‌టీ వైదొలగనున్నప్పటికీ రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సదుపాయాలు, సమయపాలన, తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు  తలెత్తకుండా పటిష్టమైన చర్యలు  తీసుకున్నట్లు పేర్కొన్నారు.

దశలవారీగా టేకోవర్‌...

  • మెట్రో రెండో దశ డీపీఆర్‌లపై  కేంద్రం  పలు సందేహాలు  లేవనెత్తడంతో మొదటి దశ చర్చనీయాంశమైంది. మొదటి దశ కారిడార్‌లలోంచి రెండోదశ కారిడార్‌లకు ప్రయాణికుల రాకపోకలు  కొనసాగనున్న దృష్ట్యా టిక్కెట్‌లపైన ఆదాయం పంపకాలు, విద్యుత్‌ ఖర్చులు, తదితర అంశాలపై ఎల్‌అండ్‌టీ నుంచి స్పష్టత రావలసి ఉందని కేంద్రం  సూచించింది.

  • ఈ క్రమంలోనే  పీపీపీ పద్ధతిలో నిర్మించి, నిర్వహిస్తున్న ఈ ప్రాజెక్టు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, సుమారు రూ.6000 కోట్ల నష్టాలతో ప్రాజెక్టును నడిపించవలసి వస్తుందని ఎల్‌అండ్‌టీ కేంద్రానికి తెలిపింది.అదే సమయంలో ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగనున్నట్లు  వెల్లడించింది.

  • గతేడాది సెప్టెంబర్‌లో  ఎల్‌అండ్‌టీ  తన వైఖరిని  వెల్లడించడంతో  ప్రభుత్వం ఆ సంస్థతో చర్చలు జరిపింది. ప్రాజెక్టు నుంచి తప్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఎల్‌అండ్‌టీ మరోసారి స్పష్టం చేసింది.

  • దీంతో  మెట్రో మొదటిదశను స్వా«దీనం చేసుకొనేందుకు ప్రభుత్వం  సంసిద్ధతను వ్యక్తం చేయడమే కాకుండా కార్యాచరణ చేపట్టింది. ఎల్‌అండ్‌టీతో వివిధ స్థాయిల్లో చర్చలు జరిపిన అనంతరం  మొత్తం  రూ.15000 కోట్ల రుణాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది.  

కన్సల్టెన్సీల ఏర్పాటు... 

  • అనంతరం ఆర్ధిక అంశాలపైన ఐడీబీఐ క్యాపిటల్, సాంకేతిక అంశాలపైన  ఢిల్లీ మెట్రోరైల్‌ మూడు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలను అందజేశాయి.

  • ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవడం వల్ల రెండో దశకు ఉన్న ఆటంకాలు తొలగడంతో పాటు ఎల్‌అండ్‌టీ సంస్థకు  ప్రభుత్వం లీజుకు ఇచ్చిన 269 ఎకరాల భూమి  తిరిగి ప్రభుత్వం చేతికి రానుంది.

  • అలాగే  5 మెట్రో స్టేషన్‌ల వద్ద ఉన్న మాల్స్‌ను  కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది.

  • ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి హైదరాబాద్‌ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) నిర్వహణలో కొనసాగనుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement