ఇరాన్‌ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన | Netanyahu Says War With Iran Could End Faster Than People Think | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ యుద్ధం ముగింపు.. నెతన్యాహు సంచలన ప్రకటన

Mar 20 2026 8:03 AM | Updated on Mar 20 2026 8:53 AM

Netanyahu Says War With Iran Could End Faster Than People Think

జెరూసలేం: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌-అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు యుద్ధం విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్ సైనిక శక్తి ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిందని నెతన్యాహు తెలిపారు. ప్రజలు అనుకున్న దాని కంటే ముందే ఇరాన్‌ యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు గురువారం జెరూసలేంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నెతన్యాహు..‘ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్ 20 రోజులు పూర్తి చేసుకుంది. ఇరాన్ పాలకుల అణ్వాయుధ కలలను, క్షిపణి సామర్థ్యాన్ని నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ చేపట్టిన 'ఆపరేషన్ రైజింగ్ లయన్' అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. మేము విజయం సాధిస్తున్నాం. ఇరాన్‌పై యుద్ధం ప్రజలు అనుకుంటున్న దానికంటే త్వరగానే ముగిసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం ఇరాన్‌ను ఎవరు నడుపుతున్నారో నాకు ఖచ్చితంగా తెలియదు. మొజ్తబా ఖమేనీ కనిపించలేదు. అగ్రస్థానం కోసం పాకులాడుతున్న వారిలో అంతర్గతంగా చాలా ఉద్రిక్తతలు ఉన్నాయని మనం చూస్తున్నాం.

యురేనియం శుద్ధి చేయలేరు.. 
ఇరాన్ సైనిక యంత్రాంగం ప్రస్తుతం అతలాకుతలమైంది. ఇరాన్‌ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి. ఇరాన్ దశాబ్దాలుగా నిర్మించుకున్న క్షిపణి, డ్రోన్ వ్యవస్థలను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి. కేవలం ఆయుధాలను ధ్వంసం చేయడమే కాకుండా, వాటిని తయారు చేసే పారిశ్రామిక పునాదులను కూడా ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంది. ఇరాన్ గర్వపడే బాలిస్టిక్ క్షిపణి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో, ఇరాన్‌ అణ్వాయుధ దేశంగా ఎదగకుండా అడ్డుకోగలిగాం. ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయలేని స్థితిలో ఉంది. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేయలేదు’ అని చెప్పుకొచ్చారు.

దాడుల వెనుక మూడు లక్ష్యాలు.. 
అలాగే, ఇరాన్‌పై సైనిక చర్య వెనుక మూడు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయని నెతన్యాహు వివరించారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడం, బాలిస్టిక్ క్షిపణి ముప్పును సమూలంగా నిర్మూలించడం, 47 ఏళ్లుగా అణిచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునేలా పరిస్థితులను కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ఇదే సమయంలో ఇరాన్ ఆకాశాన్ని రక్షించే వైమానిక రక్షణ వ్యవస్థలు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని చెప్పారు. ఇరాన్ నౌకాదళం సముద్ర గర్భంలో కలిసిపోయిందన్నారు. కాస్పియన్ సముద్రంలో ఉన్న వారి నౌకాదళ విభాగంపై కూడా ఇజ్రాయెల్ విరుచుకుపడిందని ఆయన వెల్లడించారు. ఇరాన్ సైనిక నాయకత్వం మధ్య సమన్వయం దెబ్బతిన్నదని తెలిపారు.

ట్రంప్‌పై ప్రశంసలు.. 
అమెరికాతో సంబంధాలపై నెతన్యాహు స్పందిస్తూ..‘ట్రంప్ నాయకత్వంలో అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సమన్వయం అమోఘం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రెండు వైమానిక దళాలు, అత్యుత్తమ నిఘా సంస్థలు కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి’ అని చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ అమెరికాను యుద్ధంలోకి లాగుతోందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ట్రంప్ ఎప్పుడూ అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని, ఆయనను ఎవరూ ప్రభావితం చేయలేరని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement