చిలకలగూడ : యువతిని అనుమానంతో వేధించి ఆత్మహత్యకు కారణమైన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితకృష్ణమూర్తి తెలిపిన మేరకు.. కోటేశ్వరరావు కుటుంబం సికింద్రాబాద్ శ్రీనివాసనగర్‌లో నివాసముంటోంది. ఈయన కూతురు జెనిమా (19) ఇంటర్ చదువుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జగదీష్ (22) రాంనగర్‌లోని ఓ బుక్‌షాప్‌లో పనిచేస్తున్నాడు.సోషల్ మీడియా ద్వారా యువతికి పరిచయమయ్యాడు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల జెనిమా ప్రవర్తనపై అనుమానం పెంచుకొని మానసికంగా వేధించసాగాడు.
బెదిరించేందుకు యువకుడి ఆత్మహత్యాయత్నం
యువతిని బెదిరించేందుకు జగదీష్ ఈనెల 14న కొద్ది మోతాదులో పురుగుల మందు తాగి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. మార్చి 17న ఉదయం జెనిమా ఇంటికి వెళ్లి తీవ్ర వాగ్వాదానికి దిగి వెళ్లిపోయాడు. దీంతో జెనిమా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఉరి వేసుకునేందుకు సీలింగ్ ఫ్యానుకు కట్టిన చున్నీ ఫొటోను జగదీష్ స్నేహితుడు శ్యామ్‌కు వాట్సప్ ద్వారా పంపించింది. శ్యామ్ అందించిన సమాచారం మేరకు జగదీష్‌తోపాటు కుటుంబసభ్యులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది.గాంధీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ క్రమంలో జగదీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం నిందితుడు జగదీష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మృతురాలి కాళ్లకు అయితే గాయాలు ఆస్పత్రికి తరలిస్తుండగా అయ్యాయని పోలీసులు తెలిపారు.
యువతి ఆత్మహత్య కేసులో నిందితుడి అరెస్ట్


