భారత్‌కు బిగ్‌ షాకిచ్చిన బంగ్లాదేశ్‌ | Bangladesh seeks China support over Teesta project | Sakshi
Sakshi News home page

భారత్‌కు బిగ్‌ షాకిచ్చిన బంగ్లాదేశ్‌

May 8 2026 7:45 AM | Updated on May 8 2026 8:47 AM

Bangladesh seeks China support over Teesta project

బీజింగ్‌: తారిఖ్‌ రహ్మన్‌ సారథ్యంలోని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారత్‌తో సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం తీసుకుంది. తీస్తా నది పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా సాయం కోరింది. తీస్తా రివర్‌ కాంప్రెహెన్సివ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిస్టోరేషన్‌ ప్రాజెక్టు(టీఆర్‌సీఎంఆర్‌పీ)కి సంబంధించిన అంశాలపై బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రి కలీలుర్‌ రహ్మన్‌ బుధవారం చైనాలో ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీతో భేటీ అయి చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో సాయం అందించేందుకు వాంగ్‌ యీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించాయి. చైనా సంస్థలు తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కూడా మంత్రి రహ్మన్‌ కోరినట్లు తెలిపాయి. తూర్పు హిమాలయాల్లో పుట్టిన తీస్తా నది సిక్కిం, పశ్చిమబెంగాల్‌ గుండా ప్రవహించి, బంగ్లాదేశ్‌లో సముద్రంలో కలుస్తుంది. ఈ నది బంగ్లాదేశ్‌లో సాగుకు, కోట్లాదిమంది జీవనోపాధికి ఎంతో కీలకంగా ఉంది.  కాగా.. భారత, బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఈ నదీ జలాల పంపకం కీలకంగా మారింది. ఈ పరిణామం భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న దశాబ్దాల నాటి తీస్తా జలాల వివాదానికి మరోసారి తెరలేపింది.

చైనా బిగ్‌ ప్లాన్‌?
మరోవైపు.. భారత్-బంగ్లాదేశ్ మధ్య తీస్తా జలాల పంపిణీపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. ఇటువంటి సమయంలో చైనా జోక్యం చేసుకోవడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. అంతేకాదు దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించి, తన పట్టును పెంచుకోవాలని చూస్తున్న చైనాకు ఈ ప్రాజెక్ట్ ఒక మంచి అవకాశంగా మారే అవకాశాలున్నాయి. అయితే, తీస్తా నది సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి, నది ఎగువ భాగంలో ఉన్న దేశంగా భారత్‌కు ఈ ప్రాజెక్టుపై పూర్తి హక్కులు ఉన్నాయి. బంగ్లాదేశ్ ప్రభుత్వం చైనా సహాయం కోరడం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.

భారత్‌ భద్రతకు ముప్పు.. 
ఇదిలా ఉండగా.. తీస్తా నది బంగ్లాదేశ్‌లోని ఉత్తర ప్రాంతాలకు ప్రధాన నీటి వనరు. వేసవిలో నీటి ఎద్దడి, వర్షాకాలంలో వరదల సమస్యను పరిష్కరించడానికి బంగ్లాదేశ్ ఈ భారీ ప్రాజెక్టును తలపెట్టింది. దీనికోసం చైనా నుండి సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని బంగ్లాదేశ్ ఆశిస్తోంది. ఇందులో భాగంగా తీస్తా ప్రాజెక్టులో చైనా పెట్టుబడులు పెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టులో చైనా భాగస్వామ్యం కావడం భారత్‌కు వ్యూహాత్మకంగా, భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. తీస్తా నది ప్రవహించే ప్రాంతం భారత్‌లోని అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్‌కు అతి సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, అధికారుల కదలికలు పెరిగితే, అది భారత రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఈ పరిణామాన్ని భారత్‌ నిశితంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement