మహా నగరంపై ‘కోట్ల’ జల్లు కురిసింది. బహుశా.. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని గ్రేటర్‌పై రాష్ట్ర ప్రభుత్వం కరుణ చూపించినట్లుగా కనిపించింది శుక్రవారం నాటి పద్దు. ఉపముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో ‘రాజధాని’ నగరానికి ప్రాధాన్యమిచ్చారనే చెప్పవచ్చు. అన్ని శాఖలకూ నిధులు నిరాశపర్చని రీతిలోనే పద్దులో పొందుపర్చినట్లు కనిపిస్తోంది. కాకపోతే.. మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడం గమనించదగిన అంశం. కాగా.. అటు మూసీ నుంచి మొదలుకొంటే.. ఇటు ఫోర్త్ సిటీ.. జలమండలి, మెట్రో, ఎంఎంటీఎస్ రెండో దశ, జలమండలి, ఉస్మానియా, టిమ్స్ ఆస్పత్రులు, నాలుగు పోలీస్ కమిషనరేట్లు, హెచ్‌ఎండీఏ తదితర శాఖలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కినట్లుగానే అర్థమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
టీ క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్) వరకు మూడు కార్పొరేషన్లు ఏర్పాటైనా.. అందుకునుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. పూర్వ జీహెచ్‌ఎంసీ 650 చదరపు కిలోమీటర్ల పరిధితో 150 వార్డులుగా ఉన్నప్పుడు క్యూర్ వరకు కేటాయించిన రూ. 2,654 కోట్లనే ఒక్క రూపాయి కూడా పెంచకుండా.. తగ్గించకుండా పద్దులో ప్రతిపాదించారు. అవే నిధుల కేటాయింపులు వరుసగా ఇది మూడో సంవత్సరం. వాస్తవానికి ఆ మేరకు పనులు కూడా జరగలేదు. బహుశా, అందుకే ఈసారి కూడా అన్ని నిధుల్నే కేటాయించారు. కొత్తగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఏర్పాటు కావడంతో ప్రభుత్వం వాటికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుందని కార్పొరేషన్లు భావించాయి. వాటికి కానీ, జీహెచ్‌ఎంసీకి కానీ ప్రత్యేకంగా ఎలాంటి కేటాయింపులు చేయలేదు. క్యూర్ పరిధి వరకు హెచ్–సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)కింద మొత్తం రూ.2,654 కోట్లు కేటాయించారు. అంటే జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలన్నింటికీ కలిపిన కేటాయింపులు. హెచ్–సిటీ కింద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లతో పాటు నాలాల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ, తదితర పనులుంటాయి. గత సంవత్సరం బడ్జెట్‌లో హెచ్–సిటీ పనుల కింద రూ.2,654 కోట్లతోపాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లుగా రూ.419 కోట్లు కేటాయించారు. ఈసారి ఎలాంటి గ్రాంట్లు లేవు.
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు రూ.500 కోట్లను రుణాల రూపంలో కేటాయించింది. వివిధ అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ పనులు కొనసాగుతున్నాయి. జేబీఎస్– శామీర్‌పేట్ వరకు త్వరలో ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్– 12 నుంచి శిల్పా లేఅవుట్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేశారు. పలు చోట్ల రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వీటి కోసం ఈ నిధులను విని యోగించనున్నారు. మరోవైపు ఓఆర్‌ఆర్ కోసం జైకా సంస్థ నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల దృష్ట్యా మరో రూ.200 కోట్లు కేటాయించారు.
మూసీ మురిసేలా..
సీఎం రేవంత్ కలల ప్రాజెక్ట్ మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం రూ.1,500 కోట్ల పద్దును ప్రతిపాదించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.400 కోట్లు ఎక్కువ. కొత్త బడ్జెట్‌లో కేటాయింపులను భూ సమీకరణ, నది చుట్టూ మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించనున్నారు. తొలి దశలో నగరంలో మూసీ ప్రవహించే 55 కి.మీ. మేర నదిని సుందరీకరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో జోన్–1 కింద మొత్తం 21 కి.మీ. మేర సుందరీకరించనున్నారు. జోన్–1ఏలో హిమాయత్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ 9.8 కి.మీ., జోన్–1బీ కింద ఉస్మాన్‌సాగర్ నుంచి గాంధీ సరోవర్ 11.2 కి.మీ వరకు నదికి పునరుజ్జీవం కల్పించనున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ.. నాలుగు పోలీసు కమిషనరేట్లకు కలిపి రూ.387 కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీసు విభాగానికి రూ.310 కోట్లు కేటాయించగా.. ఆ తర్వాత ఇటీవల కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు రూ.40 కోట్ల పద్దును ప్రతిపాదించారు. ఇక, సైబరాబాద్‌కు రూ.20 కోట్లు, మల్కాజిగిరికి రూ.17 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. కాగా.. గ్రేటర్‌లో హైదరాబాద్, సైబరాబాద్‌లకు శాశ్వత కమిషనరేట్ భవనాలు ఉండగా.. మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీలకు లేవు. మల్కాజిగిరి కమిషనరేట్ భవనానికి ప్రభుత్వం కేవలం రూ.లక్ష కేటాయించి చేతులు దులుపుకొంది. ఫోర్త్ సిటీ కమిషనరేట్ బిల్డింగ్‌కు రూ.25 కోట్లను ప్రతిపాదించారు. ‘క్యూర్’ పరిధిలో పోలీసులకు ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను సమకూర్చేందుకు ఈ– వెహికిల్స్ కోసం రూ.25 కోట్లు కేటాయించడం గమనార్హం
ఎల్‌బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్‌లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్) ఆస్పత్రులను ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించి 5 వేల బెడ్స్ అందుబాటులోకి తెస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫలితంగా లక్షలాది మంది సామాన్య, పేద కుటుంబాలకు ప్రభుత్వ వైద్యం చేరువకానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా పథకంతో హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అత్యధిక శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మేలు జరగనుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, ఆసుపత్రి నిర్వహణకు భారీగా నిధులు కేటాయించారు. ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి రూ.100 కోట్లు కేటార్చుుంచింది.
హైదరాబాద్ మెట్రో రెండో దశ కోసం రూ.600 కోట్లు అందజేయనున్నారు. రైళ్ల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర అవసరాల కోసం హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్)కు మరో రూ,500 కోట్లు రుణాల రూపంలో ఇవ్వనున్నారు. ప్రస్తుతం మెట్రో రెండో దశలో భాగంగా పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కి.మీ.మార్గంలో రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ చేపట్టారు. 850 ఆస్తులకు రూ.600 కోట్లలో మరి కొంతమందికి పరిహారం అందజేయనున్నారు. మెట్రో టేకోవర్ చెల్లింపులపై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
ఎంఎంటీఎస్ రెండో దశ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. రెండో దశలో నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టారు. అప్పట్లో రూ.850 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టు జాప్యంతో ఇది రూ.1,150 కోట్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 1/3, రైల్వేశాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. ఈ మేరకు ఏటా బడ్జెట్‌లో ఎంఎంటీఎస్ కోసం కేటాయిస్తున్నారు.
నగర శివారులో నిర్మించనున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.300 కోట్లు కేటాయించింది. రేడియల్ రోడ్ల నిర్మాణం, ఫ్యూచర్‌సిటీని నేరుగా ఏపీలోని మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించే గ్రీన్ పీల్డ్ జాతీయ రహదారి, భూగర్భ విద్యుత్ లైన్లు, పర్యవరణ అనుకూల స్మార్ట్ గ్రిడ్లతో ఈ నగరం సుస్థిర అభివృద్ధికి నిదర్శనంగా నిలవనుందని ప్రకటించింది.
జలమండలి అభివద్ధి పనులు, సుంకిశాల ప్రాజెక్టుకు రూ.3,305 కోట్లు కేటాయించారు. అభివృద్ధి పనులకు తీసుకున్న రుణాల చెల్లింపునకు రూ.1,450 కోట్లు, సుంకిశాల ప్రాజెక్టు రుణం కింద రూ.1000 కోట్లు, నీటి రీయింబర్స్‌మెంట్‌కు రూ. 300 కోట్లు కేటాయించింది. రెండేళ్లుగా బడ్జెట్‌లో రూ.3,385 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.380 కోట్లు తగ్గించింది. నిధుల కొరతతో సతమతమవుతున్న జలమండలికి కేటాయింపులు నిరాశ కలిగించగా.. మూసీ పునరుజ్జీవానికి కేటాయించిన రూ.1,500 కోట్లు పరోక్షంగా జలమండలి పరిధిలోని సివరేజ్ పనులకు తోడ్పడనుండటం కొంత ఉపశమనం.
గ్రేటర్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుళ్ల ప్రస్తావన తీసుకురాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన రహదారుల వెంట గజిబిజిగా, ప్రమాదకరంగా మారిన ఓవర్ హెడ్‌లైన్ల స్థానంలో కొత్తగా భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని భావించింది. ఆ మేరకు రూ.1,5000 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచాన వేసింది. మూడు దశల్లో ఈ పనులు చేపట్టాలని భావించినప్పటికీ.. తాజా బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించకపోవడం విస్మయం కలిగిస్తోంది. కాగా.. గృహజ్యోతి పథకానికి రూ.2080 కోట్లు కేటాయించడంతో గ్రేటర్ జిల్లాల్లో 11.5 లక్షల మంది లబ్ధి పొందే అవకాశం ఉంది.
3 కార్పొరేషన్లకు రూ.2,654 కోట్లు
‘హెచ్–సిటీ’ సహా క్యూర్ వరకూ..
గత రెండేళ్లుగా ఇదే మాదిరిగా..
మూసీ ః రూ.1,500 కోట్లు
మెట్రో రెండో దశకు రూ.600 కోట్లు
రుణాల రూపంలో మరో రూ.500 కోట్లు
హెచ్‌ఎండీఏకు రూ.500 కోట్లు
పోలీసులకు రూ.387 కోట్లు
ఎంఎంటీఎస్ రెండో దశకు రూ.50 కోట్లు
ఉస్మానియా ఆస్పత్రి భవనానికి రూ.100 కోట్లు
జలమండలికి రూ.3,305 కోట్లు
ఎఫ్‌సీడీఏకు రూ.300 కోట్లు


