టీ20 వరల్డ్‌కప్-2026ను గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. కీలకమైన సూపర్-8 మ్యాచ్‌తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
సంజూ కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 80.25 సగటు 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంజూను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంతో సత్కరించిందని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై కేరళ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది.
ఇవన్ని అసత్య ప్రచారాలని, కేరళ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఏఐ ద్వారా సృష్టించినవి మాత్రమే. కాగా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం తిరువనంతపురంలో శాంసన్‌ను కేరళ సర్కార్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గోన్నారు. అంతేతప్ప అతడికి నగదు బహుమతి కానీ, ఉద్యోగం కానీ ప్రకటించలేదు.
చదవండి: T20 WC Final: ’అర్ష్‌దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’


