తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలో అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ నాలుగు రోజుల అంతర్గత చర్చల తర్వాత మొత్తం 92 అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. చివరగా 37 మంది పేర్లను గురువారం రాత్రి ప్రకటించింది. దీంతో, సీటు దక్కని నేతలు అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టు సమాచారం. నేమోం, కన్నూర్, పెరుంబవూర్ వంటి కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే, కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో భాగంగా కన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి కేపీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ కే.సుధాకరన్‌కు టికెట్ ఇవ్వలేదు. ఆయన సూచించిన అభ్యర్థి కూడా తిరస్కరించబడ్డారు. బదులుగా కన్నూర్ మేయర్ మోహనన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఎంపీ సుధాకరన్ స్పందిస్తూ.. పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు. అలాగే, స్వతంత్రంగా పోటీ చేయను అని కూడా వెల్లడించారు. అయితే, ఆయన అనుచరులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారని సమాచారం.
ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎల్దోస్ కున్నాపిల్లిల్ పెరుంబపూర్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడి అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎల్దోస్ మాట్లాడుతూ.. పార్టీ కింద స్థాయి కార్యకర్త వరకు నన్ను అభ్యర్థిగా కోరుకుంటున్నారు. మేము మా నియోజకవర్గంలో దాదాపు 9,000 కొత్త ఓటర్లను జమ చేశాం. 15,000 ఇళ్లను సందర్శించాం. కానీ నా కృషిని హైకమాండ్ పట్టించుకోలేదు. అయినప్పటికీ, పార్టీని వదిలిపెట్టను. ఇది కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, పెరుంబవూర్‌లో ఎల్డోస్ స్థానంలో మనోజ్ మూథేదన్‌ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది.
మరోవైపు.. నేమోం నియోజకవర్గంలో కాంగ్రెస్ కేఎస్ సబరీనాథన్‌ను బరిలో నిలిపింది. ఇక్కడి నుంచే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ పోటీలో ఉన్నారు. ఇక, సీపీఎం నుంచి శివంకుట్ట పోటీ చేస్తున్నారు. నేమోం నియోజకవర్గం గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీని ప్రతిబింబిస్తున్నాయి. 2016లో బీజేపీ నుంచి రాజగోపాల్ మొదటిసారి విజయం సాధించగా, 2021లో సీపీఎం తిరిగి సీటు గెలుచుకుంది. 2021లో సీపీఎం నుంచి శివంకుట్టి విజయం సాధించారు. 2006లో కాంగ్రెస్ విజయం సాధించింది.
అయితే, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తంగా కాంగ్రెస్ జాబితాపై పలువురు అభ్యర్థులు అసంతృప్తితో ఉన్నట్టు కార్యకర్తలు బహరంగంగానే చెబుతున్నారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ, పార్టీ హైకమాండ్ నిర్ణయాన్ని అంగీకరించి, నేతలు చివరికి విధేయత చూపుతున్నారు.


