NABARD
-
వరి విత్తనాలు వేసే డ్రోన్ వచ్చేసింది!
డ్రోన్లతో వరి సహా అనేక పంటలపై పురుగుమందులు, ఎరువులు చల్లటం ద్వారా కూలీల ఖర్చును, సమయాన్ని రైతులు ఆదా చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. వరి విత్తనాలను వెద పెట్టడానికి ఉపయోగపడే డ్రోన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఇతర రంగాల్లో డ్రోన్ల వినియోగంతో పాటు వ్యవసాయంలో డ్రోన్ సేవలపైనా విశేషమైన ప్రగతి సాధించింది.తాజాగా వరి విత్తనాలు వేసే డ్రోన్‌ను రూపొందించింది. పేటెంట్ హక్కులు కూడా పొందింది. పిజెటిఎస్ఎయు, నాబార్డ్ తోడ్పాటుతో క్షేత్రస్థాయి ప్రయోగాలను పూర్తి చేసుకొని వెద పద్ధతిలో వరి విత్తనాలను వరుసల్లో విత్తే డ్రోన్లను ఇఫ్కో తోడ్పాటుతో రైతులకు అందుబాటులోకి తెస్తోంది. డిజిసిఎ ధృవీకరణ పొందిన ఈ డ్రోన్ల కొనుగోలుకు బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ ఉండటం విశేషం.గాలిలో ఎగిరే చిన్న యంత్రం డ్రోన్. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్. అంటే, మనిషి పొలంలోకి దిగకుండా గట్టుమీదే ఉండి వ్యవసాయ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి ఉపయోగపడే అధునాతన యంత్రం. ఇప్పుడు వ్యవసాయంలోని అనేక పంటల సాగులో, ముఖ్యంగా వరి సాగులో, కీలకమైన అనేక పనులకు డ్రోన్ ఉపయోగపడుతోంది. రైతులకు ఖర్చులు తగ్గించటం, కూలీల అవసరాన్ని తగ్గించటం వంటి పనుల ద్వారా ఉత్పాదకతను, నికరాదాయాన్ని పెంపొందించేందుకు డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి.దోమల నిర్మూలన, ఔషధాల రవాణా వంటి అనేక ఇతర రంగాలతో పాటు వ్యవసాయంలో ఉపయోగపడే ప్రత్యేక డ్రోన్లను అభివృద్ధి చేయటంలో మారుత్ డ్రోన్స్ విశేష కృషి చేస్తోంది. ప్రేమ్ కుమార్ విస్లావత్, సాయి కుమార్ చింతల, ఐఐటి గౌహతి పూర్వవిద్యార్థి సూరజ్ పెద్ది అనే ముగ్గురు తెలుగు యువకులు 2019లో మారుత్ డ్రోన్స్ స్టార్టప్‌ను ్రపారంభించారు. డేటా ఎనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతికతలతో వ్యవసాయ డ్రోన్లను రూపొందించటంపై ఈ కంపెనీ దృష్టి సారించింది.ప్రొ. జయశకంర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పిజెటిఎస్ఎయు), అగ్రిహబ్, నాబార్డ్ తోడ్పాటుతో రైతుల కోసం ప్రత్యేక డ్రోన్లను రూపుకల్పన చేస్తోంది. నల్గొండ జిల్లా కంపసాగర్‌లోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో 50 ఎకరాల్లో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో గత రెండున్నరేళ్లుగా మారుత్ డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. స్థానిక రైతులు పండించే పంటలకు అనువైన రీతిలో ఉండేలా ఈ డ్రోన్లను అభివృద్ధి చేశారు. వరి పంటపై డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్స్(ఎస్.ఓ.పి.ల)ను గతంలోనే ఖరారు చేశారు.వరి పంటపై పురుగుల మందు పిచికారీ..ప్రస్తుతం వెద వరి పద్ధతిలో ఆరుతడి పంటగా వరి విత్తనాలను నేరుగా బురద పదును నేలలో విత్తుకోవడానికి ఉపయోగపడేలా డ్రోన్‌ను రూపొందించారు. ఇప్పటికే నాలుగైదు డ్రోన్ ప్రొటోటైప్‌ల ద్వారా వరి విత్తనాలను వరుసల్లో వెద పెట్టడానికి సంబంధించిన ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఒకటి, రెండు నెలల్లో దీనికి సంబంధించిన ఎస్.ఓ.పి.లు పూర్తవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.డ్రోన్ల సేద్యానిదే భవిష్యత్తు!తక్కువ నీరు ఖర్చయ్యే వెద పద్ధతిలోనే భవిష్యత్తులో వరి సాగు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. వెద వరిలో విత్తనాలు వేయటం, ఎరువులు చల్లటం, చీడపీడలను ముందుగానే గుర్తించటం, పురుగుమందులు చల్లటం వంటి అనేక పనులకు డ్రోన్లు ఉపయోగపడతాయి. డ్రోన్ ధర రూ. పది లక్షలు. ఒక్క డ్రోన్‌తోనే పంట వివిధ దశల్లో ఈ పనులన్నీ చేసుకోవచ్చు.డిజిసిఎ ధృవీకరణ ఉండటం వల్ల డ్రోన్ కొనుగోలుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద 6% వడ్డీకే అనేక పథకాల కింద బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. రైతుకు 50% సబ్సిడీ వస్తుంది. ఎఫ్పిఓ లేదా కస్టమ్ హైరింగ్ సెంటర్లకైతే 75% వరకు సబ్సిడీ వస్తుంది. పది డ్రోన్లు కొని అద్దె సేవలందించే వ్యాపారవేత్తలకైతే రూ. 2 కోట్ల వరకు రుణం కూడా దొరుకుతోంది. గ్రామీణ యువతకు డ్రోన్ సేవలు ఏడాది పొడవునా మంచి ఉపాధి మార్గం చూపనున్నాయి.– ప్రేమ్ కుమార్ విస్లావత్, వ్యవస్థాపకుడు, సీఈఓ, మారుత్ డ్రోన్స్డ్రోన్ విత్తనాలు వెద పెట్టేది ఇలా..వరి నారు పోసి, నాట్లు వేసే సంప్రదాయ పద్ధతితో పోల్చితే విత్తనాలు వెదజల్లే పద్ధతి అనేక విధాలుగా మెరుగైన ఫలితాలను ఇస్తున్న విషయం తెలిసిందే. వెద వరిలో అనేక పద్ధతులు ఉన్నాయి. పొలాన్ని దుక్కి చేసిన తర్వాత పొడి దుక్కిలోనే ట్రాక్టర్ సహాయంతో సీడ్ డ్రిల్‌తో విత్తనాలు వేసుకోవటం ఒక పద్ధతి.బురద పదును నేలలో ఎక్కువ నీరు లేకుండా డ్రమ్ సీడర్‌ను లాగుతూ మండ కట్టిన వరి విత్తనాలను చేనంతా వేసుకోవటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతుల కన్నా.. బురద పదును నేలలో డ్రోన్ ద్వారా వరి విత్తనాలను జారవిడవటం మరింత మేలైన పద్ధతి. తక్కువ శ్రమ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పని పూర్తవుతుందని మారుత్ డ్రోన్స్ వ్యవస్థాపకులు చెబుతున్నారు.ఎకరంలో వరి విత్తటానికి 20 నిమిషాలు..ఈ విధానంలో వరి నారుకు బదులు దమ్ము చేసిన పొలంలో డ్రోన్ సాయంతో వరి విత్తనాలను క్రమ పద్ధతిలో జారవిడుస్తారు. ఇందుకోసం ఆ డ్రోన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన పైప్లాంటి సీడ్ డిస్పెన్సింగ్ డివైస్‌ను అమర్చుతారు. ఆ డివైస్‌కు డ్రోన్‌కు నడుమ వరి విత్తనాలు నిల్వ వుండేలా బాక్స్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా 5 వరుసల్లో వరి విత్తనాలు బురద పదునుగా దమ్ము చేసిన పొలంలో విత్తుతారు. వరి మొక్కల మధ్య 10 సెం.మీ.లు, వరుసల మధ్య 15 సెం.మీ.ల దూరంలో విత్తుతారు.సాధారణంగా నాట్లు వేసే పద్ధతిలో ఎకరానికి 20–25 కిలో విత్తనం అవసరమైతే ఈ పద్ధతిలో 8–12 కిలోల విత్తనం సరిపోతుంది. సన్న రకాలైతే 10–11 కిలోల విత్తనం చాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 20 నిమిషాలకు ఒక ఎకరం చొప్పున రోజుకు ఒక డ్రోన్ ద్వారా 20 ఎకరాల్లో విత్తనాలు వెదపెట్టవచ్చు. సాళ్లు వంకర్లు లేకుండా ఉండటం వల్ల కలుపు నివారణ సులువు అవుతుందని, గాలి బాగా సోకటం వల్ల చీడపీడల ఉధృతి కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వెదపద్ధతి వల్ల తక్కువ నీటితోనే వరి సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.హెక్టారుకు రూ.5 వేలు ఆదా..వెద వరి (డైరెక్ట్ సీడిండ్ రైస్– డిఎస్ఆర్) సాగు పద్ధతిలో డ్రోన్లను వాడటం ద్వారా కూలీల బాధ లేకుండా చప్పున పని పూర్తవ్వటమే కాకుండా సాగు ఖర్చు సీజన్‌కు హెక్టారుకు రూ. 5 వేలు తగ్గుతుందని మారుత్ డ్రోన్స్ సీఈవో ప్రేమ్ కుమార్ విస్లావత్ అంచనా. డ్రోన్ సాయంతో సకాలంలో పురుగుమందులు సకాలంలో చల్లటం వల్ల చీడపీడల నియంత్రణ జరిగి హెక్టారుకు 880 కిలోల ధాన్యం అధిక దిగుబడి వస్తుందన్నారు. రైతుకు హెక్టారుకు రూ.21,720 ఆదనపు ఆదాయం వస్తుందని ఆయన చెబుతున్నారు.700 మందికి డ్రోన్ పైలట్ శిక్షణ..మారుత్ డ్రోన్స్ పిజెటిఎస్ఎయుతో కలసి ఏర్పాటు చేసిన అకాడమీ ద్వారా డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తోంది. రైతులు, స్వయం సహాయక బృందాల మహిళలకు, ఎఫ్పిఓ సభ్యులకు, వ్యవసాయ పట్టభద్రులకు, పదో తరగతి పాసైన యువతీ యువకులు ఈ శిక్షణకు అర్హులు. ఈ అకాడమీ ద్వారా ఇప్పటికే 700 మంది శిక్షణ పొందారు. అందులో 150 మంది స్వయం సహాయక బృందాల మహిళలు కూడా ఉన్నారు.డిజిసిఎ ఆమోదం వున్న ఈ వారం రోజుల శిక్షణ పొందిన వారికి పదేళ్ల పైలట్ లైసెన్స్ వస్తుంది. వ్యవసాయ సీజన్లో డ్రోన్ పైలట్‌కు కనీసం రూ. 60–70 వేల ఆదాయం వస్తుందని ప్రేమ్ వివరించారు. ఈ డ్రోన్ పైలట్ శిక్షణ పొందిన వారు వ్యవసాయంతో పాటు మరో 9 రంగాల్లో డ్రోన్లను వినియోగించవచ్చు. ఏడాది పొడవునా ఉపాధి పొందడానికి అవకాశం ఉంది.– నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పేదల ఇళ్లకు పెద్దపీట
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 2024–25 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున 30.20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు మహిళల పేరిట ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలను కూడా చేపట్టిందని నాబార్డు ప్రముఖంగా ప్రస్తావించింది. గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించింది. 17,005 లేఔట్లలో వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మూడు దశల్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని తెలిపింది.పేదల ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన మెటీరియల్‌ను తక్కువ ధరకే సమకూర్చడంతోపాటు కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని నాబార్డు పేర్కొంది. 2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత ఉందని జిల్లాల వారీగా రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. -
ఏపీలో పంట సాగుదారుల హక్కు చట్టం భేష్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పంటసాగు హక్కుదారుల చట్టం–2019 బాగుందని నాబార్డు ఉన్నతాధికారుల బృందం కితాబిచ్చింది. భూ యజమాని హక్కులకు ఏలాంటి నష్టం వాటిల్లకుండా, వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు ఈ చట్టం దోహదపడతోందని పేర్కొంది. భూ యజమాని అనుమతితో పంటసాగు హక్కు పత్రాలు(సీసీఆర్సీ) జారీ చేసి కౌలుదారులకు పంట రుణాలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అమలు చేస్తుండటం హర్షణీయమంది. రాష్ట్రంలో సీసీఆర్సీ చట్టం అమలు తీరును అధ్యయనం చేసేందుకు ముంబైలోని నాబార్డు మేనేజర్లు బెంజమిన్ థామస్, అరవింద్‌కుమార్, నాబార్డు కన్సల్టెంట్ ప్రణవ్ఖాత్రిల సారథ్యంలోని ఉన్నతాధికారుల బృందం రాష్ట్రంలో మూడురోజుల పర్యటనకు శ్రీకారం చుట్టింది. తొలిరోజు గుంటూరు, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి భూ యజమానులు, కౌలు రైతులతో ముఖాముఖిలో పాల్గొంది. చట్టం అమలు తీరుపై అధ్యయనం చేసింది. పకడ్బందీగా అమలు చేస్తే మరింత మేలు సీసీఆర్సీ కార్డుల జారీ, రుణాలతో పాటు సంక్షేమ ఫలాల అమల్లో ఎదురయ్యే ఇబ్బందులను బృందం సభ్యులు తెలుసుకున్నారు. ఈ చట్టం వల్ల తమకెన్నో ప్రయోజనాలున్నాయని, అయితే అంగీకార పత్రాలపై సంతకాలు చేయడానికి భూయజమానులు వెనుకంజవేస్తున్నారని కౌలు రైతులు నాబార్డు బృందం దృష్టికి తెచ్చారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి పంట రుణాల మంజూరులో కొంత మంది బ్యాంకర్లు ఇబ్బందిపెడుతున్నారని తెలిపారు. మరోవైపు, ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తే భవిష్యత్‌లో లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళన తమకుందని భూ యజమానులు చెప్పారు. సీసీఆర్సీ చట్టం రూపకల్పన చాలా బాగుందంటూ నాబార్డు బృందం సభ్యులు ప్రశంసించారు. చట్టాన్ని పగడ్బందీగా అమలు చేస్తే మెజార్టీ కౌలు రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. చట్టంపై కౌలు రైతులతో పాటు భూ యజమానులకూ అర్థమయ్యే రీతిలో మరింత అవగాహన కచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే రీతిలో కౌలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉండే రాష్ట్రాల్లోనూ ప్రత్యేక చట్టాలు తీసుకొస్తే మంచి ఫలితాలొస్తాయని అభిప్రాయపడ్డారు. 25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు చట్టం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో దాదాపు 25.93 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులిచ్చామని అధికారులు వివరించారు. 14.13 లక్షల మందికి బ్యాంకర్ల ద్వారా రూ.8,346 కోట్ల వ్యవసాయ రుణాలు మంజూరు చేయించగలిగినట్టు తెలిపారు. అత్యధికంగా ఈ ఏడాది 8.31 లక్షల మందికి సీసీఆర్సీలు జారీ చేయగా, వీరిలో 5.48 లక్షల మందికి రూ.1908 కోట్ల రుణాలు మంజూరైనట్టు తెలిపారు. పంట రుణాలే కాదు, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులతో పాటు వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా పరిహారం, పంట నష్టపరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) వంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. రుణాల మంజూరులో లక్ష్యాలను నిర్దేశిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొంతమంది బ్యాంకర్లు చూపే సాంకేతిక కారణాలతో నూరు శాతం కార్డుదారులకు రుణాలు మంజూరు చేయలేకపోతున్నామని వివరించారు. పర్యటనలో నాబార్డు ఏపీ ఏజీఎం స్మారక్ మోహంతి, డీడీఎం అనిల్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్‌ను అభినందిస్తున్నానన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్‌బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్ఎల్బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయానికి రూ.1.33 లక్షల కోట్ల రుణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ. 1.33 లక్షల కోట్ల రుణాలు ఇచ్చేలా జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) రుణ ప్రణాళికను ఖరారు చేసింది. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాలు సహా మొత్తంగా రూ.2.80 లక్షల కోట్ల రుణాలకు పచ్చజెండా ఊపింది. ఇది గతేడాది రుణ ప్రణాళికతో పోలిస్తే రూ.94 వేల కోట్లు అదనం కావటం విశేషం. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రుణ ప్రణాళికతో కూడిన ఫోకస్ పేపర్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకే పెద్దపీట వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు వచ్చే ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి భారీ చేయూతనే లభించే అవకాశం ఉంది. రూ.133587.86 కోట్ల రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. మొత్తం రుణ ప్రణాళికలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట వేయటం విశేషం. నడుస్తున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికలో నాబార్డు ఖరారు చేసిన మొత్తం రూ.1,12,762 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖరారైన వ్యవసాయ రుణాల్లో.. పంటల సాగు, మార్కెటింగ్ కోసం రూ.81,478.02 కోట్లు, టర్మ్లోన్ల కింద రూ.27,664.91 కోట్లు, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు రూ.5197.26 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.19,247.67 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. వ్యవసాయ రంగం తర్వాత సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణాలను ఖరారు చేసింది. ఈ రంగానికి రూ.1,29,635.83 కోట్ల వరకు రుణాల రూపంలో ఇవ్వవచ్చని బ్యాంకర్లకు సూచించింది. బ్యాంకర్లు మరింత సాయానికి ముందుకు రావాలి: తుమ్మల దేశ వ్యవసాయ రంగంలో తెలంగాణకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా బ్యాంకర్లు మరింత ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వ్యవసాయంపై ఫోకస్ చేస్తుండటాన్ని నాబార్డు, బ్యాంకర్లు గుర్తించాలని కోరారు. పాడిపరిశ్రమను ప్రోత్సహించేందుకు వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సూచించారు. ఆ రంగంలో గేదెలపైనే ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని, కానీ ఆవు పాల వృద్ధిని కోరుకుందామని, దీని వల్ల ఆరోగ్యంతోపాటు, మన సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించినట్టవుతుందని మంత్రి తుమ్మల సూచించారు. పామాయిల్ సాగుకు కూడా మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. వరి సాగు విస్తృతంగా సాగుతోందని, కానీ సంప్రదాయ తృణ ధాన్యాల వృద్ధిపై రైతులు దృష్టిసారించాలని మంత్రి కోరారు. నాగార్జున గ్రామీణ బ్యాంకు రుణంతోనే నా తొలి నామినేషన్ తనకు వ్యవసాయం రంగం, అందుకు రుణాలిచ్చే గ్రామీణ బ్యాంకులతో మంచి అనుబంధం ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. తాను సాగు కోసం నాగార్జున గ్రామీణ బ్యాంకు నుంచి రుణం తీసుకునేవాడినని, 1983 తొలి నామినేషన్ కోసం కూడా ఆ బ్యాంకు నుంచే రుణం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు బంధు నిధులను పెంచుతాం: రఘునందన్‌రావు రాష్ట్రంలో ప్రతి రెండున్నర వేల మంది రైతులకు ఒకటి చొప్పున ఉన్న రైతు వేదికలను ఆధునికీకరించటం ద్వారా వాటి వినియోగాన్ని పెంచి రైతులకు మరింత ఉపయోగకరంగా మారుస్తామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావు వెల్లడించారు. వాటిల్లో టూ వే ఆడియో విజువల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో క్రాప్ ఇన్‌స్రూెన్స్ పథకాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతు భరోసా ద్వారా ప్రస్తుతం అందుతున్న రైతు బంధు నిధులను పెంచుతున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో వీలైనన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు నాబార్డు తీవ్రంగా కృషి చేస్తోందని, వాటి అవసరాలకు తగ్గట్టుగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటోందని ఆ సంస్థ సీజీఎం సుశీల చింతల పేర్కొన్నారు. ఆర్బీ డీజీఎం రాజేంద్రప్రసాద్, ఎస్బీఐ జీఎం, ఎస్ఎల్బీసీ కన్వీనర్ దేబాశీష్ మిత్ర తదితరులు పాల్గొన్నారు. 2024–25 సంవత్సరానికి వివిధ రంగాలకు నాబార్డు ఖరారు చేసిన రుణ ప్రణాళిక వ్యవసాయం, అనుబంధ రంగాల రూ.133587.86 కోట్లు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు రూ. 129635.83 కోట్లు ఎగుమతుల కోసం రుణాలు రూ. 451.67 కోట్లు విద్య రూ.2706.50 కోట్లు గృహనిర్మాణం రూ.10768.58 కోట్లు పునరుత్పాదక విద్యుత్తు రూ.566.61కోట్లు ఇతర రంగాలు రూ.2283.51 -
రూ.242 కోట్లతో కొత్తగా 16 వంతెనలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వంతెనల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. మొత్తం రూ.242.73 కోట్లతో 16 కొత్త వంతెనల నిర్మాణ ప్రణాళికను ఆమోదించింది. ఇప్పటికే మొదలైన వంతెనల పనులను పూర్తి చేయడంతోపాటు ఇంకా పనులు మొదలు పెట్టాల్సిన వంతెనల నిర్మాణానికి నిధుల సమస్య తలెత్తకుండా ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. కోస్తా జిల్లాల పరిధిలోని ఏడు వంతెనలను ఎన్డీఆర్ఎఫ్ నిధులు రూ.137.03 కోట్లతోనూ, రాయలసీమ పరిధిలోని 9 వంతెనలను నాబార్డ్ నిధులు రూ.105.70 కోట్లతోనూ నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్అండ్బీ శాఖ ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదించడంతో వంతెనల నిర్మాణం వేగవంతం కానుంది. -
ధాన్యం దిగుబడిలో ఏపీకి రెండో స్థానం
సాక్షి, అమరావతి: హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. మొదటి స్థానంలో పంజాబ్ ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2022–23లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హెక్టార్‌కు ధాన్యం దిగుబడిపై నాబార్డు నివేదికను విడుదల చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో హెక్టార్‌కు ధాన్యం దిగుబడి అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సమగ్ర సస్య రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తోంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పైర్లపై వచ్చే వివిధ చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనాలు వేసి, వాటి వలన పంటలకు ఏ విధమైన నష్టమూ వాటిల్లకుండా.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు ఆర్బీకేలు తోడుగా నిలుస్తున్నాయి. నిరోధక శక్తిగల వరి రకాలను ఎంచుకునేలాగ రైతులను ఆర్బీకేల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విత్తన శుద్ధి పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. నారు మడిలో సస్యరక్షణను పాటింపజేయడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. అలాగే నత్రజని ఎరువును సిఫారసుకు తగినట్టే వినియోగించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఏ తెగుళ్లు సోకితే ఎంత మోతాదులో క్రిమిసంహారక మందులు వాడాలో కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, దిగుబడిని పెంచే ఇన్పుట్లు మొదలైనవి రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో విత్తనం నుంచి పంట కోసి, విక్రయం వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తోంది. దీంతో హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. -
మన మహిళ పొదుపులో అగ్రగామి
సాక్షి, అమరావతి: మహిళా పొదుపు సంఘాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తు.చ. తప్పకుండా అమలు చేయడం వల్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా నాలుగేళ్లుగా అద్భుతమైన ఫలితాలను రాబట్టారు. మన స్వయం సహాయక సంఘాలు పొదుపు విషయంలో, క్రెడిట్ లింకేజీలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ కార్యక్రమం, పొదుపు సంఘాల పనితీరుపై నాబార్డు 2022 – 23 వార్షిక నివేదికను శుక్రవారం విడుదల చేసింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు నమోదైందని, ఈ విషయంలో రాష్ట్ర పొదుపు సంఘాలు అగ్రగామిగా నిలిచాయని నివేదిక వెల్లడించింది. అంతకు ముందు మూడు ఆర్థిక సంవత్సరాల పాటు కూడా ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గాడిన పడ్డ సంఘాలు చంద్రబాబు హయాంలో నిర్వీర్యమైన స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో గత నాలుగేళ్లుగా ఆర్థికంగా గాడిన పడటమే కాకుండా దేశంలోనే ఉత్తమ పనితీరును కనపరుస్తున్నాయి. దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి పొదుపు సంఘాల సొమ్ము (2022 – 23 మార్చి నాటికి) రూ.58,892.68 కోట్లుగా ఉంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా పొదుపు సంఘాల పొదుపు రూ.28,968.44 కోట్లు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాల పొదుపు రూ.18,606.18 కోట్లు ఉందని నివేదిక పేర్కొంది. దేశంలో అన్ని రాష్ట్రాల సంఘాల పొదుపులో ఏపీ స్వయం సహాయక సంఘాల పొదుపే 31 శాతం కావడం విశేషం. 2021–22తో పోలిస్తే 2022–23లో ఏపీ పొదుపు సంఘాల పొదుపు రూ.6,938 కోట్లు పెరగడం గమనార్హం. 2021–22 నాటికి రాష్ట్ర పొదుపు సంఘాల పొదుపు రూ.11,668 కోట్లు కాగా ఇప్పుడు రూ.18,606 కోట్లకు పెరిగింది. పరపతి పెరిగింది చంద్రబాబు పాలనలో రుణమాఫీ దగాతో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరపతి క్షీణించింది. స్వయం సహాయక సంఘాల అప్పులు పెరిగిపోవడంతో రుణాల మంజూరుకు బ్యాంకులు వెనకాడాయి. దీంతో సంఘాలు సి, డి గ్రేడ్లకు పడిపోయాయి. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల తేదీ నాటికి పొదుపు సంఘాలకు ఉన్న అప్పులను నాలుగు విడతల్లో తిరిగి ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికే వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు విడతల్లో రూ.19,178.17 కోట్లు చెల్లించారు. అంతేకాకుండా చంద్రబాబు ఎగనామం పెట్టిన సున్నా వడ్డీని కూడా పునరుద్ధరించారు. దీంతో రాష్ట్రంలో పొదుపు సంఘాల పరపతి పెరిగింది. ఆసరా, సున్నా వడ్డీతో పొదుపు సంఘాల మహిళల్లో ఆర్థిక క్రమశిక్షణ పెరిగి ఇప్పుడు దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ గల పొదుపు సంఘాలుగా నిలిచాయి. చంద్రబాబు హయాంలో పొదుపు సంఘాల క్రెడిట్ లింకేజీ 43.6 శాతం ఉండగా ఇప్పుడు 89 శాతం సాధించడం గమనార్హం. వరుసగా నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల మంజూరు పెరుగుతూనే ఉంది. 2022–23లో వాణిజ్య, రీజనల్ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కలిపి ఏపీ పొదుపు సంఘాలకు దేశంలోనే అత్యధికంగా రూ.40,230.63 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. సగటు పొదుపు ఏపీలోనే అత్యధికం 2022–23లో దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల సగటు పొదుపులో కూడా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో సంఘం సగటు పొదుపు అత్యధికంగా రూ.1,72,124 కాగా తెలంగాణలో రూ.85 వేలుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలుగు రాష్ట్రాలను మినహాయిస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2022–23లో ఒక్కో సంఘం సగటు పొదుపు రూ.43,940 నుంచి రూ.30 వేలకు పడిపోయిందని నివేదిక స్పష్టం చేసింది. భారీగా తగ్గిన నిరర్థక ఆస్తులు నాడు చంద్రబాబు రుణమాఫీ చేస్తానని మోసగించడంతో స్వయం సహాయక సంఘాలు అప్పుల్లో కూరుకుపోవడమే కాకుండా వాటి నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగిపోయాయి. ఇప్పుడు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నిరర్థక ఆస్తులు గణనీయంగా తగ్గాయి. పొదుపు సంఘాలకు సంబంధించి చంద్రబాబు హయాంలో 5.86 శాతం నిరర్థక ఆస్తులుండగా 2022 – 23 నాటికి ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకుల రుణాల్లో నిరర్ధక ఆస్తులు 0.41 శాతానికి, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల్లో 0.25 శాతానికే పరిమితమైనట్లు నివేదిక తెలిపింది. సున్నా వడ్డీతో సంఘాలు బలోపేతం సకాలంలో రుణాలను చెల్లించే పొదుపు సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ (వడ్డీ లేని రుణాలు) రుణాలను అమలు చేస్తోందని నాబార్డు నివేదిక తెలిపింది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీని రీయింబర్స్మెంట్ చేయడంతో పొదుపు సంఘాలు బలోపేతం కావడమే కాకుండా గ్రామీణ కుటీర పరిశ్రమలు పరిపుష్టి సాధించాయని పేర్కొంది. పొదుపు మహిళల జీవనోపాధిని పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ప్రస్తావించింది. ఆసరా ద్వారా అందిస్తున్న డబ్బులతో వ్యాపారాలు నిర్వహిస్తూ పొదుపు సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు వీలుగా ప్రముఖ సంస్థలతో ఒప్పందాలను చేసుకుని బ్యాంకు రుణాలతో తోడ్పాటు అందిస్తోంది. -
వ్యవసాయ రంగ అభివృద్ధికి వెన్నెముక నాబార్డ్
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి నాబార్డు వెన్నెముకగా నిలుస్తోందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. విజయవాడలో మంగళవారం నాబార్డు ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు సులభంగా రుణ సౌకర్యం అందుబాటులోకి తేవడం నాబార్డు సాధించిన అతి పెద్ద విజయమన్నారు. వ్యవసాయ పరపతి స్వరూపాన్ని సమూలంగా మార్చేసి రైతులకు ప్రయోజనకారిగా నిలిచిందని చెప్పారు. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎం.ఆర్.గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.2.86 లక్షల కోట్ల పరపతి సౌకర్యం కల్పించాలని నిర్ణయించామన్నారు. 1982లో కేవలం రూ.4,500 కోట్ల మూలధనంతో ఏర్పడిన నాబార్డు 2022–23 నాటికి రూ.8.01 లక్షల కోట్ల స్థాయికి చేరుకుందని వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను గవర్నర్ సందర్శించి నాబార్డు కార్యకలాపాలపై రూపొందించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు. -
దేశంలో పెరిగిన పాల ధర
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిపోయాయి. పాల సగటు రిటైల్ ధర లీటర్‌కు ఏడాదిలోనే 12 శాతం పెరుగుదలతో రూ.57.15కు పెరిగిందని నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. ఇటీవల పాడి పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పాల ఉత్పత్తిలో స్తబ్ధత, దాణా ధరల పెరుగుదల ఇందుకు కారణమని తెలిపింది. లంపి స్కిన్ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా పాడి పశువులు భారీ సంఖ్యలో మరణించినట్లు పేర్కొంది. 30 లక్షలకుపైగా పశువులకు ఈ వ్యాధి సోకగా వాటిలో 1.68 లక్షలకు పైగా పశువులు మరణించాయని వెల్లడించింది. దీంతో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని తెలిపింది. 2023లో పశువుల దాణాలో వాడే తృణధాన్యాలు బియ్యం నూక వంటి ధరలు భారీగా పెరిగి, దాణా ఖర్చు పెరిగిపోయిందని, రవాణా వ్యయం కూడా పెరిగిందని, ఇవన్నీ పాల ధర పెరగడానికి కారణాలని వివరించింది.లంపి స్కిన్ వ్యాధి నివారణకు టీకా డ్రైవ్ నిర్వహించడంతో పరిస్థితి మెరుగుపడిందని నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు 6,68,93,290 పశువులకు టీకా వేసినట్లు ఆ నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో సకాలంలో టీకాలు లంపి స్కిన్ వ్యాధి వ్యాప్తి మొదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పశువులకు సకాలంలో టీకాలు వేసింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని అన్ని పశువులకు టీకాలను వేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని నాబార్డు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో కేవలం 767 పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకగా 58 పశువులు మాత్రమే మరణించాయని, 709 పశువులు రికవరీ అయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో మొత్తం 1,17,300 పశువులకు టీకాలు వేసినట్లు పేర్కొంది. రాజస్థాన్‌లో అత్యధికంగా 75,820 పశువులు మరణించాయని నివేదిక పేర్కొంది. -
రైతు కుటుంబాల సగటు ఆదాయం రూ. 10,084
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.10,084 అని నాబార్డు తేల్చింది. 2012–13లో ఇది రూ.6,426 కాగా, 2018–19 నాటికి రూ.10,084కు పెరిగిందని తెలిపింది. అయితే సన్న చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయం మాత్రం అంతగా లేదని పేర్కొంది. ఈ మేరకు పరిశోధనాత్మక అధ్యయన నివేదికను తాజాగా విడుదల చేసింది. పంటలు, పశు సంపద, వ్యవసాయేతర వ్యాపారం వంటి అంశాలను కూడా అధ్యయనంలో పరిశీలించారు. ‘మొత్తంగా పంటల సాగు ద్వారా వచ్చే ఆదాయం వాటా 38 శాతం కాగా, పశు సంపద ద్వారా వచ్చే ఆదాయం వాటా 16 శాతంగా ఉంది. వ్యవసాయేతర రంగాల ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. కాగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన పంజాబ్, హరియాణాతో పాటు జార్ఖండ్, బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైతుల నెలవారీ ఆదాయం అత్యధికంగా ఉంది. భూ పరిమాణం పెరిగినప్పుడు, వ్యవసాయ కార్యకలాపాల (పంటల ఉత్పత్తి, జంతువుల పెంపకం) ద్వారా రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. పెద్ద రైతులకు అంటే 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు వ్యవసాయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 91 శాతం, కాగా చిన్న సన్నకారు రైతులకు ఇలా వచ్చే ఆదాయం కేవలం 28 శాతమే. ఈ విధంగా రైతు భూ పరిమాణాన్ని బట్టి ఆదాయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. ఓబీసీ, ఇతర వర్గాల ఆదాయంతో పోలిస్తే, ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబాల ఆదాయం తక్కువగా ఉంది..’అని నాబార్డు నివేదిక వెల్లడించింది. భవిష్యత్ తరాలు వ్యవసాయానికి దూరం ‘భవిష్యత్ తరాలు వ్యవసాయం వైపు మొగ్గు చూపడం లేదు. 63 శాతం మంది రైతులు తమ భవిష్యత్ తరం వ్యవసాయంలో ఉండాలని కోరుకోవడం లేదు. వ్యవసాయం లాభసాటి వృత్తి కాదని భావిస్తున్నారు. అందుకే కొత్త తరం వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యవసాయం చేయడం రిస్‌్కగా వారు భావిస్తున్నారు. వ్యవసాయ భూపరిమాణం తగ్గడం, పెట్టుబడి ఖర్చులు పెరగ డం వంటివి ఇందుకు కారణాలుగా ఉన్నాయి. అలాగే వ్యవసాయానికి కీలకమైన కూలీల కొరత కూడా అనాసక్తికి కారణంగా ఉంది. మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి కూడా భవిష్యత్ తరం వ్యవసాయానికి దూరంగా ఉండటానికి కారణంగా కన్పిస్తోంది. వ్యవసాయంలో సరైన ఆదాయం రాకపోవడంతో, మెరుగైన భవిష్యత్తు కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతేకాదు గౌరవం, సామాజిక హోదా కూడా ఉండటం లేదు..’అని పేర్కొంది. లాభదాయకం కాదనే భావన.. ‘వ్యవసాయం లాభదాయకం కాదని రైతులు భావిస్తున్నారు. మార్కెటింగ్ సహా పటిష్టమైన సేకరణ వ్యవస్థ లేకపోవడం, మద్దతు ధరలు సరిగా లేకపోవడంతో వ్యవసాయంపై అనాసక్తి చూపిస్తున్నారు. 62 శాతం మంది రైతులు ఇప్పటికీ తక్కువ ధరకు స్థానిక విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. 50 ఏళ్ల వయస్సున్న రైతుల్లో 70 శాతం మంది వరి సాగును కొనసాగిస్తున్నందున పంటల సాగులో వైవిధ్యం ఉండటం లేదు. కూరగాయలు, పండ్ల సాగు ద్వారా రైతుల్లో ఆదాయ ఉత్పత్తి గత 30 సంవత్సరాలలో తక్కువగా ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది..’అని నాబార్డు తెలిపింది. -
‘సూక్ష్మ’సాగే బాగు
సాక్షి, అమరావతి: సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) రైతన్నలకు ఎంతో లాభదాయకమని నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ నాబ్కాన్స్ అధ్యయన నివేదిక వెల్లడించింది. అవసరమైన చోట్ల మాత్రమే మొక్కలకు నీరు అందడం వల్ల కలుపు, చీడపీడల సమస్యను సమర్థంగా నియంత్రించవచ్చు. సూక్ష్మ సేద్యం ద్వారా కేవలం నీరు మాత్రమే కాకుండా విద్యుత్తు, కూలీల వ్యయంలో పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. తద్వారా అన్నదాతలకు సాగు వ్యయం, అనవసర ఖర్చులు తగ్గిపోయి అదనపు ఆదాయం సమకూరుతుందని నాబ్కాన్స్ అధ్యయనంతో తేలిందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. సూక్ష్మ సేద్యం విధానంలో హెక్టార్‌కు గంటకు 1,553 కిలోవాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. యూనిట్ విద్యుత్‌కు రూ.4 చొప్పున ఆదా అవుతుందని నాబ్కాన్స్ నివేదిక తెలిపింది. హెక్టార్‌కు 52 పనిదినాల కూలీల వ్యయం తగ్గుతుంది. రోజు కూలీ రూ.245 చొప్పున ఆదా అవుతుంది. హెక్టార్‌కు సాగు వ్యయం రూ.21,500 తగ్గుతుండగా అదనపు ఆదాయం రూ.1,15,000 సమకూరుతుంది. సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు రైతులకు బహుళ ప్రయోజనాలను అందించే కేంద్ర ప్రాయోజిత పథకమైన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన (పీఎం కేఎస్‌వై) ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తోందని సామాజిక ఆర్థిక సర్వే పేర్కొంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలతో పాటు మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తూ సబ్సిడీపై బిందు, తుంపర్ల సేద్యం పరికరాలను సమకూరుస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో 11.91 లక్షల మంది రైతులు 13.41 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అనుసరిస్తున్నారు. ఈ ఆర్థిక ఏడాది 75,000 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటివరకు 60,500 హెక్టార్లకుపైగా ఈ పరిధిలోకి తెచ్చినట్లు వెల్లడించింది. మరో 2,38,070 హెక్టార్లను సూక్ష్మ సేద్యం కిందకు తెచ్చేందుకు రైతు భరోసా కేంద్రాల్లో 2.02 లక్షల రైతులు నమోదు చేసుకున్నట్లు సర్వే పేర్కొంది. ఐదు రాష్ట్రాల్లో 70 శాతం సూక్ష్మ సేద్యం చేయడం ద్వారా ఎంత మేరకు నీరు, విద్యుత్, కూలీల వ్యయం తగ్గుతుంది? సాగు ఖర్చులు ఎంత తగ్గుతాయి? రైతులకు అదనపు ఆదాయం ఎంత లభిస్తుందనే అంశాలపై నాబ్కాన్స్ గణాంకాలు రూపొందించినట్లు సామాజిక ఆర్థిక సర్వే తెలిపింది. నీటి కొరతను అధిగమించేందుకు సూక్ష్మ సేద్యాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని నాబ్కాన్స్ నివేదిక సూచించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సూక్ష్మ సేద్యం విస్తీర్ణంలో 70 శాతం ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల్లోనే ఉందని వెల్లడించింది. మిగతా రాష్ట్రాల్లోనూ సూక్ష్మ సేద్యాన్ని విస్తరించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. -
కూరగాయలకు భారీ డిమాండ్
సాక్షి, అమరావతి: దేశంలో కూరగాయలకు డిమాండ్ భారీగా పెరగనుంది. 2030 నాటికి దేశంలో కూరగాయల కొరత ఏర్పడుతుందని, దేశంలో అవసరాలకు తగినంతగా ఉత్పత్తి ఉండదని జాతీయ వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అధ్యయన నివేదిక వెల్లడించింది. అలాగే మాంసం, పండ్లకు కూడా స్వల్పంగా కొరత ఏర్పడుతుందని పేర్కొంది. 2030 నాటికి దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లు కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తి పెరుగుతుందా లేదా అనే అంశంపై నాబార్డు అంచనా వేసింది. పంట తరువాత వృథాను కూడా తీసివేసిన తరువాత డిమాండ్, లభ్యతను లెక్కగట్టింది. 2030వ సంవత్సరానికి దేశంలో కూరగాయల డిమాండ్ 192 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, అయితే లభ్యత 160 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. అంటే ఏకంగా 32 మిలియన్ టన్నుల కూరగాయల కొరత ఉంటుంది. అప్పటికి దేశంలో 103 మిలియన్ టన్నుల పండ్లు అవసరమైతే 93.1 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతాయని తెలిపింది. 9.9 మిలియన్ టన్నుల పండ్ల కొరత ఏర్పడుతుందని పేర్కొంది. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో 5.54 శాతం వాటాతో భారతదేశం రెండో స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ఎగుమతులు చేసినప్పటికీ, చేపల ఉత్పత్తిలో దేశం స్వయం సమృద్ధిని సాధిస్తుందని చెప్పింది. 2030 నాటికి చేపల డిమాండ్ 11.1 మిలియన్ టన్నులు ఉంటుందని, ఉత్పత్తి అంతకంటే కొంచెం ఎక్కువగా 11.9 మిలియన్ టన్నులు ఉంటుందని వెల్లడించింది. గుడ్లు 5.8 మిలియన్ టన్నులు డిమాండ్ ఉండగా లభ్యత 5.9 మిలియన్ టన్నులు ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా పాలకు కొరత ఉండదని, అవసరానికంటే పాల ఉత్పత్తి ఎక్కువే ఉంటుందని వివరించింది. మాంసం అవసరానికంటే లభ్యత 1.2 మిలియన్ టన్నులు తక్కువ ఉంటుందని నివేదిక తెలిపింది. రైతులు పండించిన పంటలకు రవాణా వ్యయం తగ్గించేందుకు మార్కెటింగ్‌లో సమష్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. సన్న, చిన్న కారు రైతులతో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచించింది. కాంట్రాక్టు వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రైతులకు మంచి ధరలకు హామీ లభిస్తుందని నివేదిక పేర్కొంది. వివిధ సమస్యలను అధిగమించేలా ఒప్పంద వ్యవసాయం ద్వారా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని నివేదిక సూచించింది. -
మిల్లెట్స్ వాల్ క్యాలెండర్
2023ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో చిరుధాన్యాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సహజ సమృద్ధ’ మిల్లెట్స్‌పై ఓ వాల్ క్యాలెండర్‌ను ప్రచురించింది. నాబార్డ్ సహాయంతో ఆర్.ఆర్.ఎ. నెట్‌వర్క్‌తో కలసి సహజ సమృద్ధ ఈ క్యాలెండర్‌ను ఆంగ్లం, తెలుగు, కన్నడ తదితరప్రాంతీయ భాషల్లోనూ రూపొందించింది. ఈ క్యాలెండర్లో వర్షాధార వ్యవసాయ పరంగా చిరుధాన్యాలప్రాధాన్యాన్ని వివరించడంతో పాటు.. పౌష్టికాహార లోపాన్ని పారదోలే అద్భుత చిరుధాన్య వంటకాలను తయారు చేసుకునే పద్ధతులను,ప్రాసెసింగ్ యంత్రాల సమాచారాన్ని సైతం ఇందులో సచిత్రంగా వివరించారు. మిల్లెట్లను పునరుద్ధరించడంలో, సాంప్రదాయ మిల్లెట్ ఆహార వ్యవస్థను సజీవంగా ఉంచడంలో రైతులు, గిరిజనులు, భూమిలేని వ్యవసాయ కార్మికులు నిర్వహిస్తున్న పాత్రను ఈ క్యాలెండర్ గుర్తు చేస్తుంది. ఈ 24 పేజీల క్యాలెండర్. క్యాలెండర్ ధర రూ.150 (కొరియర్ ఖర్చుతో సహా). ఇతర వివరాల కోసం... 99720 77998 నంబరుకు కాల్ చేయవచ్చు. -
Andhra Pradesh కోవిడ్‌లో దున్నేసింది!
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారిని అధిగ మించి మరీ వ్యవపాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా 2019–20తో పోల్చితే 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీగా 20.75 శాతం మేర వృద్ధి నమోదైనట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో దేశంలో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపింది. ఏపీ నుంచి 2020–21లో భారీగా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి జరిగినట్లు పేర్కొంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తరువాత వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. కోవిడ్ విసిరిన సవాళ్ల మధ్య కూడా 2020–21లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వృద్ధి నమోదు కావటాన్ని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. 2019–20లో దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు రూ.2.53 లక్షల కోట్లు ఉండగా కోవిడ్ మహమ్మారిని అధిగమించి 2020–21లో రూ.3.05 లక్షల కోట్ల మేర ఎగుమతులు జరిగాయి. పది దేశాలకే అత్యధికం భారత్ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వియత్నాం, సౌదీ ఆరేబియా, ఇండోనేషియా, నేపాల్, ఇరాన్, మలేషియా అది పెద్ద మార్కెట్‌గా నిలిచాయని, మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఈ దేశాలదే 52.2 శాతం వాటా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2020–21లో దేశం నుంచి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో బాస్మతి, నాన్ బాస్మతి బియ్యం ఎగుమతుల వాటా 21.4 శాతంగా ఉంది. తరువాత సముద్ర ఉత్పత్తులు 14.5 శాతం, సుగంధ ద్రవ్యాలు 9.7 శాతం, గేదె మాంసం 7.7 శాతం, చక్కెర 6.8 శాతంగా ఉంది. ప్రధానంగా ఈ ఐదు ఎగుమతుల వాటా 60.10 శాతంగా ఉన్నట్లు నివేదిక విశ్లేషించింది. తొలిసారిగా రాష్ట్రానికి 4వ స్థానం వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్ర విభజన అనంతరం 2020–21లో రూ.23,505.2 కోట్ల విలువైన ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. అయితే గత సర్కారు హయాంలో ఏ ఒక్క ఆర్థిక ఏడాదిలోనూ రూ.9,000 కోట్ల మేర కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు జరగలేదు. టీడీపీ హయాంలో 2028–19లో ఏపీ నుంచి రూ.8,929.5 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి అయినట్లు నివేదిక పేర్కొంది. ప్రధాన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏడు రాష్ట్రాల వాటా 88 శాతం ఉన్నట్లు తెలిపింది. -
ఇండియా అవుతోంది‘డిజిటల్’
సాక్షి, అమరావతి: భారతదేశంలో డిజిటలైజేషన్ వేగంగా జరుగుతోందని, ఇది కొత్త తరహా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాబార్డు వెల్లడించింది. డిజటలైజేషన్ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయన్నది అపోహ మాత్రమేనని స్పష్టంచేసింది. ‘భవిష్యత్తులో ఇండియాలో ఉద్యోగ అవకాశాలు’ పేరిట నాబార్డు విడుదల చేసిన అధ్యయన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా 10 కోట్ల మందికిపైగా డిజిటలైజేషన్ వైపు అడుగులు వేశారని, భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేసింది. వివిధ రంగాల్లో డిజటలైజేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని తెలిపింది. 2021లో పలు స్టార్టప్‌లలో ప్రైవేటు ఈక్విటీ, వెంచర్ క్యాపిటలిస్టులు రూ.3.53 లక్షలకుపైగా పెట్టుబడులు పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొంది. 2025 నాటికి దేశీయ డిజిటల్ ఎకానమీ విలువ రూ.80 లక్షల కోట్లకు చేరడమే కాకుండా 5.5 కోట్ల నుంచి 6 కోట్ల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం మూడో తరం టెక్నాలజీతో బ్యాంకింగ్, బీమా వంటి ఆర్థిక సేవలతో పాటు ఈ కామర్స్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజింగ్, సాఫ్ట్వేర్ రంగాల్లో భారీ మార్పులు తెచ్చిందని తెలిపింది. నాలుగో తరం టెక్నాలజీ అయిన బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ కూడా వస్తే తయారీ రంగంతో పాటు వ్యవసాయంలో పెద్ద ఎత్తున ఆటోమేషన్ జరుగుతుందని పేర్కొంది. స్వయం ఉపాధి కోవిడ్ లాక్‌డౌన్‌తో భారీగా పెరిగిన నిరుద్యోగ సమస్యను డిజిటలైజేషన్ పరిష్కరించినట్లు నాబార్డు పేర్కొంది. 2020 జనవరి నాటికి దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఖ్య 41 కోట్లు ఉండగా కోవిడ్ దెబ్బతో 2021 జూన్ నాటికి 38.6 కోట్లకు పడిపోయిందని తెలిపింది. కోవిడ్ తర్వాత దేశీయ యువత ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందని, ఒకరి కింద పని చేయడం కాకుండా నచ్చిన సమయంలో స్వతంత్రంగా పని చేసుకునే ‘గిగ్’ విధానానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది. ఫుడ్ డెలివరీ సంస్థలైన జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలతో పాటు ఓలా, ఉబర్ వంటి ట్రావెల్ సంస్థల్లో గిగ్ వర్కర్లుగా పనిచేయడానికి యువత మొగ్గు చూపుతున్నట్లు పేర్కొంది. ఉదాహరణకు లక్ష కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన జొమాటోలో ప్రత్యక్షంగా 5,000 మంది పనిచేస్తుంటే, పరోక్షంగా 3.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పిస్తోంది. వీరంతా పని చేసిన సమయాన్ని బట్టి నెలకు రూ.10,000 నుంచి రూ. 30,000 వరకు ఆదాయం పొందుతున్నారు. అయితే, ఈ గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని నాబార్డు చెప్పింది. వీరికి పీఎఫ్, గ్రాట్యుటీ, అనారోగ్యానికి గురైతే సెలవులు, ఎర్న్ లీవులు వంటి సామాజిక భద్రత లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపేలా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలంది. పెరుగుతున్న ఆటోమేషన్, రోబోటిక్ విధానానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంచుకోవాలని సూచించింది. ఏటా దాదాపు 1.2 కోట్ల మంది యువత డిగ్రీలు చేత పట్టుకొని వస్తున్నారని, వీరందరికీ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యం కల్పించడం అతిపెద్ద సవాల్ అని ఆ నివేదిక పేర్కొంది. -
విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో ఏపీ కార్యక్రమాలు అద్భుతం
సాక్షి, అమరావతి: నాబార్డ్ సాయంతో విద్యారంగంలో చేపడుతున్న మనబడి నాడు–నేడు కార్యక్రమం, కొత్త మెడికల్ కళాశాలల నిర్మాణంతో పాటు వ్యవసాయ రంగంలో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నాయని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్వహిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ ప్రశంసించారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో నాబార్డ్ చైర్మన్‌తో పాటు.. ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా నాబార్డ్ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై చర్చించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాబార్డ్ సాయంతో చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు నడుస్తున్నాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లోనూ, మహిళా సంక్షేమంలోనూ చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపర్చడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తున్నాయని సీఎం వివరించారు. ఏపీలో 3 ఏళ్లలో మూడురెట్లు పెరిగిన వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్ల ఏపీలో సహకార బ్యాంకింగ్ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోందని నాబార్డు చైర్మన్ షాజీ కేవీ చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడేళ్లలో మూడు రెట్లు వ్యాపారం పెరగడం నిజంగా గొప్ప విషయమన్నారు. మారుమూల పల్లెలకు సైతం బ్యాంకింగ్ సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. విజయవాడలో జరిగిన బ్యాంకర్ల సమ్మేళనం(బ్యాంకర్స్ కాంక్లేవ్)కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే రూ.10 వేల కోట్ల టర్నోవర్ దాటిన తొలి బ్యాంక్‌గా కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ బ్యాంక్‌ను స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన బ్యాంకులు కూడా మారుమూల ప్రజలకు బ్యాంకింగ్ సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలకు ఇచ్చే రుణాల్లో కనీసం 40 శాతం సహకార బ్యాంకుల ద్వారా ఇవ్వాలని లక్ష్యంగా పనిచేయాలని చెప్పారు. పాడి, పశుపోషణ, మత్స్య అనుబంధ కార్యకలాపాలకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రెండు గ్రామాలకొకటి చొప్పున ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఎసీఎస్)ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. నాబార్డ్ నిబంధనలు పాటిస్తూ ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తే ఎలాంటి పెనాల్టీలు పడవని, బ్యాంకింగ్ లావాదేవీలకు కూడా అంతరాయం ఏర్పడదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ఏపీలో సహకార బ్యాంకులు సీడీ రేషియో 140 శాతం సాధించడం పట్ల ఎంపీ బాలశౌరి బ్యాంకర్స్‌కు అభినందనలు తెలిపారు. వ్యవసాయ మార్కెటింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి చిరంజీవిచౌదరి, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీరాణి, నాబార్డు సీజీఎం ఎంఆర్ గోపాల్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్‌కుమార్, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం: నాబార్డ్ చైర్మన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోందని, ఇందుకు కారణం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజి పేర్కొన్నారు. విజయవాడకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘ఇక్కడకి రావడానికి ముందు మచిలీపట్నం వెళ్లాను. ఆప్కాబ్ ఈ ఏడాదిలో మూడు రెట్లు పెంచుకోవడం అభినందనీయం. ఏపీ జీడీపీలో వ్యవసాయం రంగం నుంచి 33 శాతం వస్తోంది. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. సహకార రంగాల బలోపేతం ద్వారా రైతులకు మేలు జరుగుతుంది. ఏపీలో ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను డీడీటీ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది బ్యాంకింగ్ రంగానికి ఎంతో మేలు చేస్తోంది’ అని అన్నారు. సీఎం జగన్‌ను కలిసిన నాబార్డ్ ప్రతినిధుల బృందం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని నాబార్డ్ చైర్మన్ కేవీ షాజితో పాటు నాబార్డ్ ప్రతినిధుల బృందం కూడా కలిసింది. సీఎం జగన్‌తో నాబార్డ్ బృందం సమావేశంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా పాల్గొన్నారు. నాబార్డ్ చైర్మన్ కీవీ షాజిని శాలువా కప్పి సత్కరించిన సీఎం జగన్.. వెంకటేశ్వరుని ప్రతిమను కూడా అందజేశారు. -
నాగలి పడుతున్న నారీమణులు..దేశంలో పెరుగుతున్న మహిళా రైతులు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వ్యవసాయంలో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) వెల్లడించింది. మహిళా రైతుల సంఖ్య పెరుగుతున్నందున వారికి అనువైన వ్యవసాయ యంత్రాలను తయారు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2010–11 గణాంకాల ప్రకారం వ్యవసాయం చేసే మహిళలు దేశంలో 12.79 శాతం ఉండగా 2015–16లో 13.87 శాతానికి పెరిగినట్లు తెలిపింది. ఇదే సమయంలో మహిళా రైతులు వ్యవసాయ చేసే విస్తీర్ణం కూడా 10.36 శాతం నుంచి 11.57 శాతానికి పెరిగింది. అందువల్లమహిళలకు అనుకూలమైన యంత్ర పరికరాలు అందుబాటులోకి రావాల్సి ఉందని దేశంలో వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణపై నాబార్డు అధ్యయన నివేదికలో తెలిపింది. వ్యవసాయ రంగం అభివృద్ధికి పలు సూచనలు చేసింది. యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాలి ప్రస్తుతం దేశంలో వ్యవసాయ యాంత్రీకరణ ప్రారంభ దశలోనే ఉందని, యాంత్రీకరణను మరింతగా ప్రోత్సహించాల్సి ఉందని స్పష్టంచేసింది. దేశంలో మొత్తం వ్యవసాయ భూకమతాల్లో 85 శాతం చిన్నవేనని, వీటిలో యంత్రాల వాడకం ప్రధాన సవాలుగా ఉందని నివేదిక తెలిపింది. కిరాయి, అద్దె మార్కెట్లు ఉన్నప్పటికీ చిన్న కమతాలకు పరిమితులు, సంక్లిష్టతలున్నాయని తెలిపింది. 2014–15లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ ఉపమిషన్ ప్రారంభించినప్పటికీ, చిన్న కమతాలకు ఉపయోగకరంగా లేదని తెలిపింది. వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు పెద్ద కమతాలకు అనువైనవే ఉన్నాయని తెలిపింది. చిన్న భూకమతాలకు అనువైన యంత్రాలను, పనిముట్లను ప్రోత్సహించాలని పేర్కొంది. యాంత్రీకరణతో రైతులకు లాభం యాంత్రీకరణతో రైతులకు లాభమని నాబార్డు పేర్కొంది. ట్రాక్టర్లు, సీడ్ డ్రిల్స్, హార్వెస్టర్లు, కంబైన్లు వంటి యంత్రాలు కార్మికులకయ్యే ఖర్చును ఆదా చేస్తాయని నివేదిక తెలిపింది. యంత్రాలు, సాంకేతికతతో వ్యవసాయ ఉత్పాదకత సామర్థ్యాన్ని 30 శాతం వరకు పెంచడంతోపాటు సాగు ఖర్చును 20 శాతం మేర తగ్గిస్తుందని, తద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని అధ్యయనంలో వెల్లడైనట్లు స్పష్టం చేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత వినియోగంతో కారి్మకులు వ్యవసాయేతర రంగాల్లో పనిచేసేందుకు అందుబాటులో ఉంటారని తెలిపింది. కారి్మకులకు వ్యవసాయంలోకంటే వ్యవసాయేతర రంగాల్లో ఎక్కువ వేతనాలు లభిస్తాయని వెల్లడించింది. నాబార్డు సిఫార్సులు మరికొన్ని.. ► రైతుల సముదాయంతో రైతుల ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేసి వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను ఉపయోగించుకొనేలా చేయాలి ► చిన్న, సన్నకారు రైతులకు రుణ పరిమితులను సడలించాలి ► అందుబాటులో ఉన్న వ్యవ వినియోగంలో కొండ ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఉన్న భూభాగం, స్థలాకృతికి సరిపోవు. కొండ ప్రాంతాలలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక పనిముట్లు అవసరం. ఆ భూభాగం, పంట వ్యవస్థలకు సరిపోయే విధంగా పనిముట్లు రూపొందించాలి. ► ప్రస్తుతం ఉన్న యంత్రాలు, పనిముట్లు స్త్రీలకు అనుకూలమైనవి కావు. వ్యవసాయంలో మహిళల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్త్రీలకు అనుకూలమైన కొత్త యంత్రాలు, పనిముట్లను అందుబాటులోకి తేవాలి. ట్రాక్టర్ల కొనుగోలులోనూ వెనుకబాటు దేశంలో 14.6 కోట్ల మంది రైతుల్లో గత 15 సంవత్సరాల్లో ట్రాక్టర్లు కొనగలిగిన వారు అతి తక్కువని పేర్కొంది. 2004–05 ఆరి్థక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రైతులు 2.48 లక్షల ట్రాక్టర్లు కొనగా, 2019–20లో 8.80 లక్షల ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. ట్రాక్టర్ల కొనుగోలులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయని చెప్పింది. 2019–20లో ఆంధ్రప్రదేశ్‌లో 18,335 ట్రాక్టర్ల కొనుగోళ్లు జరగ్గా 2021–22 లో 33,876 ట్రాక్టర్లు కొన్నట్లు తెలిపింది. 2021–22లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1,17,563, మహారాష్ట్ర 1,04,301, మధ్యప్రదేశ్‌లో 1,00,551 ట్రాక్టర్లు కొన్నట్లు పేర్కొంది. చదవండి: అంతరిస్తున్న తోడేళ్లు! ఉమ్మడి అనంతపురంలో భారీగా తగ్గిన వన్యప్రాణులు -
తెలంగాణ రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1.85 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.85 లక్షల కోట్ల రుణ లక్ష్యాన్ని నాబార్డు ప్రకటించింది. ఈ మేరకు 2023–24కు సంబంధించిన ఫోకస్ పేపర్‌ను గురువారం విడుదల చేసింది. మొత్తం ప్రాధాన్యత రంగాల్లో రూ. 1,85,327 కోట్ల రుణ లక్ష్యం కాగా అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల రుణ లక్ష్యం రూ. 1,12,762 కోట్లుగా లెక్కగట్టింది. వ్యవసాయ రుణాల్లో కీలకమైన పంట రుణాలకు రూ. 73,436 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు నాబార్డు సూచించింది. రుణ లక్ష్య ఫోకస్ పేపర్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విడుదల చేశారు. 2022–23 రాష్ట్ర రుణ లక్ష్యం రూ. 1,66,257 కోట్లు కాగా, అందులో వ్యవసాయ, అనుబంధాల రుణ లక్ష్యం రూ. 1.01 లక్షల కోట్లు. ప్రస్తుత ఏడాది కంటే వచ్చే ఏడాదికి రాష్ట్ర రుణ ప్రణాళిక రూ. 19,070 కోట్లు ఎక్కువగా ఉంది. సాగులో దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ: మంత్రి హరీశ్ రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి రోల్ మోడల్‌గా మారిందని, దేశం యావత్తూ రాష్ట్రం వైపు చూస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. నాబార్డు వార్షిక రుణ ప్రణాళిక విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశవ్యాప్తంగా అమలు చేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయ పథకాన్ని అమృత్ సరోవర్ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్ పేరుతో అమలు చేస్తోందని గుర్తుచేశారు. ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో సాగుభూమి, పంటల దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 19 శాతంగా ఉందన్నారు. అదే దేశ జీడీపీలో వ్యవసాయరంగ వాటా కేవలం 3.5 శాతమేనని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు 10 శాతంగా నమోదైతే దేశంలో కేవలం 3 శాతంగానే ఉందని వివరించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, ధాన్యం దిగుబడి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణ భారీగా నిధులను వెచ్చించిందన్నారు. ఆయిల్‌పాం సాగుకు చేయుత ఇవ్వాలి... నాబార్డు మూడు అంశాలపై దృష్టిపెట్టి అధిక రుణాలు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగు చేస్తోందని, ఈ పంట సాగు చేసే రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వరిసాగులో నాట్లకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలు అందించాలన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డును కోరారు. సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి త్వరగా అనుమతి ఇవ్వా లని నాబార్డు సీజీఎం సుశీల చింతలను కోరారు. తలసరి ఆదాయం రూ. 2.75 లక్షలు: సీఎస్ రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2.75 లక్షలుగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రం ఏర్పాటు సమయానికి ఇప్పటికీ ఇది రెట్టింపు అయిందన్నారు. జీఎస్డీపీ దేశంలోకెల్లా అత్యధికంగా రాష్ట్రంలోనే ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు రామకృష్ణారావు, రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నాబార్డ్ చైర్మన్‌గా షాజి కేవీ బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ: నాబార్డ్ చైర్మన్‌గా షాజి కేవీ ఈ నెల 7న బాధ్యతలు స్వీకరించినట్టు కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌కు తెలియజేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి సుచీంద్ర మిశ్రా అదనపు బాధ్యతల కింద చూస్తుండగా, ఆయన నుంచి స్వీకరించినట్టు తెలిపింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవంత్ కరాడ్ లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు ఇచ్చారు. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) కరోనా తర్వాత, 2020 ఏప్రిల్ నుంచి 2022 నవంబర్ మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారాల ఏర్పాటుకు బ్యాంకులు రూ.12 లక్షల కోట్ల రుణాలను మంజూరు చేసినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 86,996 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నట్టు మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏటీఎంలలో మోసాలు 2019-20లో రూ.116 కోట్ల మేర ఉంటే, 2020-21లో రూ.76 కోట్లకు తగ్గినట్టు చెప్పారు. ఇవీ చదవండి: టెక్ మహీంద్రా నుంచి క్లౌడ్ బ్లేజ్‌టెక్ ప్లాట్‌ఫాం వింటర్ జోరు: హీటింగ్ ఉత్పతుల హాట్ సేల్! ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి -
చిరుధాన్యాలతోనే విరుగుడు
సాక్షి, అమరావతి: ప్రజల సంపూర్ణారోగ్యానికి దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిరుధాన్యాలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని, సరఫరా చేయడం సాధ్యంకావడంలేదని నివేదిక తెలిపింది. ఇటీవల రాయచూర్‌లోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం, నాబార్డు సంయుక్తంగా మిల్లెట్ సదస్సును నిర్వహించాయి. ఇందులో మిల్లెట్స్–సవాళ్లు స్టార్టప్‌ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాయచూర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని సిఫార్సులు చేశాయి. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రపంచమంతా సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కూడా వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించేందుకు సిద్ధపడుతోందని నివేదిక పేర్కొంది. చిరుధాన్యాలతోనే పోషకాహార లోపం నివారణ దేశంలో 59 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో సతమతమవుతున్నారని, అలాంటి వారికి చిరుధాన్యాలను ఆహారంగా అందించాల్సి ఉందని నివేదిక తెలిపింది. చిరుధాన్యాల్లో 7–12 శాతం ప్రొటీన్లు, 2–5 శాతం కొవ్వు, 65–75 శాతం కార్బోహైడ్రేట్లు, 15–20 శాతం ఫైబర్, ఐరన్, జింక్, కాల్షియం ఉన్నాయని వివరించింది. ఊబకాయం, మధుమేహం, జీవనశైలి జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిరుధాన్యాల వినియోగమే పరిష్కారమని తేల్చింది. మరోవైపు.. 1970 నుంచి దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని.. ఇందుకు ప్రధాన కారణం బియ్యం, గోధుమల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడమేనని నివేదిక స్పష్టం చేసింది. 1962లో చిరుధాన్యాల తలసరి వినియోగం 32.9 కిలోలుండగా ఇప్పుడది 4.2 కిలోలకు తగ్గిపోయిందని నివేదిక వివరించింది. రైతులకు లాభసాటిగా చేయాలి చిరుధాన్యాల సాగుతో రైతులకు పెద్దగా లాభసాటి కావడంలేదని, మరోవైపు.. వరి, గోధుమల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. చిరుధాన్యాలకే ఎక్కువ మద్దతు ధర ఉన్నప్పటికీ ఉత్పాదకత, రాబడి తక్కువగా ఉండటంతో రైతులు వరి, గోధుమల సాగుపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు నగదు రూపంలో రాయితీలు ఇవ్వడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలని నాబార్డు నివేదిక సూచించింది. విజయనగరంలో మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిల్లెట్స్ ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించవచ్చునని నిరూపించిన విజయగాథలున్నాయని నివేదిక పేర్కొంది. విజయనగరం జిల్లాలో 35 గ్రామాలకు చెందిన 300 మంది మహిళా సభ్యులు ఆరోగ్య మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌ను 2019–20లో స్థాపించినట్లు తెలిపింది. మహిళా రైతులకు ఆహార భద్రత, పోషకాహారం, జీవవైవిధ్యంతో పాటు భూసారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఎఫ్పీఓగా ఏర్పాటై ఆరోగ్య మిల్లెట్స్ అనే బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు విజయవంతంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎఫ్పీఓతో కలిసి మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోందని, రేగా గ్రామంలో రూ.4.1 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయడం ద్వారా 240 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొంది. చిరుధాన్యాల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలివే.. ► సెలబ్రిటీలతో పాటు ఇతరుల ద్వారా చిరుధాన్యాల వినియోగంపై అవగాహన ప్రచారాలు కల్పించాలి. ► ప్రతీ సోమవారం తృణధాన్యాల వినియోగం అలవాటు చేయాలి. ► విమానాలతో పాటు రైళ్లల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. ► అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినియోగించాలి. ► ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అమలుచేస్తోంది. ► తయారుచేసి సిద్ధంగా ఉండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రాసెసింగ్, విలువ జోడింపు, సాంకేతిక సౌకర్యాలను కల్పించాలి. ► పట్టణ వినియోగదారులే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ► చిరుధాన్యాలను పండించే రైతులకు నగదు ప్రోత్సాహకాలను అందించాలి. ► సాంకేతికత సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన మిల్లింగ్ పరికరాలను ఏర్పాటుచేయాలి. -
పంజాబ్‌ను మించి ఏపీ.. నాబార్డు అధ్యయన నివేదిక ఏం చెప్పిందంటే?
సాక్షి, అమరావతి: గత దశాబ్ద కాలంలో దేశంలో వ్యవసాయ రుణాల పంపిణీ మూడు రెట్లు పెరిగినట్లు నాబార్డు నివేదిక వెల్లడించింది. 2011–12లో దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణాల పంపిణీ రూ.5.11 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి మూడు రెట్లు పెరిగి రూ.15.58 లక్షల కోట్లకు చేరుకున్నాయి. పదేళ్లలో 11.9 శాతం వృద్ధి నమోదైంది. పంజాబ్‌ను మించి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణ లభ్యత మెరుగ్గా ఉండటం గమనార్హం. నాబార్డు నివేదికలో ముఖ్యాంశాలు ఇవీ.. చదవండి: ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు.. వారికి సచివాలయాల్లో ఉద్యోగాలు.. ♦2011–12 నుంచి స్వల్పకాలిక పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక టర్మ్ రుణాలు పెరిగాయి. 2017–18లో దీర్ఘకాలిక టర్మ్ రుణాల పంపిణీలో వృద్ధి 9.9 శాతం ఉండగా 2020–21 నాటికి 43.17 శాతానికిచేరింది. ♦వ్యవసాయ యాంత్రీకరణ, పంపు సెట్లు, నీటి పారుదల నిర్మాణాలు, తోటల అభివృద్ధి, ఫామ్ పాండ్లు, మైక్రో ఇరిగేషన్, పొలంలో ఉత్పాదక సామర్థ్యం పెంపు తదితరాలకు నాబార్డు, బ్యాంకులు దీర్ఘకాలిక టర్మ్ రుణాలను మంజూరు చేస్తున్నాయి. ♦బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంతో వడ్డీ వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి లభించినా బ్యాంకు రుణాల మంజూరులో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలున్నాయి. ♦దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధికంగా వ్యవసాయ రుణాల పంపిణీ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో హెక్టార్‌కు రుణ లభ్యత మెరుగ్గా ఉంది. మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల హెక్టార్‌కు రుణ లభ్యత రూ.లక్ష లోపే ఉంది. ♦2019 – 20లో ఆంధ్రప్రదేశ్‌లో హెక్టార్‌కు రూ.1.29 లక్షలు, పంజాబ్‌లో రూ.లక్షకు పైగా రుణ లభ్యత ఉంది. ♦వ్యవసాయ రుణాల పంపిణీ పెరగడంలో కిసాన్ క్రెడిట్ కార్డులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. 2019 మార్చి 31 నాటికి 1,896 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులు మంజూరయ్యాయి. ♦2011–12లో స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు రూ.3.96 లక్షల కోట్లు ఉండగా 2020–21 నాటికి రూ.8.85 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీర్ఘకాలిక టర్మ్ రుణాలు ఇదే సమయంలో రూ.1.14 లక్షల కోట్ల నుంచి రూ.6.73 లక్షల కోట్లకు పెరిగాయి. -
భారత్‌లో పాలు, మాంసానికి భారీ డిమాండ్.. నివేదికలో కీలక అంశాలు!
సాక్షి, అమరావతి: పాలు, మాంసం, గుడ్లు, చేపలు.. దేశంలో వినియోగం భారీగా పెరుగుతున్న ఆహారం. జనాభా పెరుగుదల, సంపన్నులు పెరుగుతుండటంతో ఈ డిమాండ్ ఇంకా భారీగా పెరుగుతుందని నాబార్డు అంచనా వేస్తోంది. 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు దాటే అవకాశం ఉందని, వీరిలో సగం మంది నగరాలు, పట్టణాల్లో నివసిస్తారని, సంపన్నుల సంఖ్యా పెరుగుతున్నందున వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని ‘పశువులు, వ్యవసాయ వృద్ధి – పేదరిక నిర్మూలన’పై నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోందని, గుడ్ల వాడకం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. భారతదేశం పశు సంవర్ధక రంగంలో డిమాండ్‌కు తగినట్లుగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. 2010–11 నుంచి 2019–20 మధ్య పశు సంవర్ధక రంగం రికార్డు స్థాయిలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి సాధించిందని వెల్లడించింది. వ్యవసాయ వృద్ధి కంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపింది. వ్యవసాయ వృద్ధిలో పశువుల రంగం వాటా 30 శాతం ఉందని పేర్కొంది. పేదరికాన్ని తగ్గిస్తున్న పశు సంవర్థక రంగం దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో పశు సంవర్ధక రంగం ప్రభావం ఎక్కువ ఉంది. పశు పోషణ రంగంలో దేశంలో 70 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారతకు పశు పోషణ దోహదపడుతోంది. పశువుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే మహిళలు ఇంటి బడ్జెట్‌కు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆదాయాన్ని పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలనకు దోహదపడే పశు సంవర్ధక రంగాన్ని, పశు పోషణను మరింతగా ప్రోత్సహించాలని నాబార్డు నివేదిక సూచించింది. ఆహార అలవాట్లలో మార్పు 1990–91 నుంచి మొత్తం జనాభా వృద్ధి రేటు 1.57 శాతంతో పోల్చితే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగింది. గుడ్లు వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం చాలా వేగంగా 45.5 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతం, మాంసం డిమాండ్ 75.5 శాతం, గుడ్లకు డిమాండ్ 65.7 శాతం, చేపల డిమాండ్ 75.0 శాతం మేర పెరుగుతుందని నాబార్డు నివేదిక అంచనా వేసింది. -
నాబార్డు తెలంగాణ సీజీఎంగా సుశీల
సాక్షి, హైదరాబాద్: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రి కల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డు) చీఫ్ జనరల్ మేనేజర్‌గా సుశీల చింతల నియమితులయ్యారు. గురు వారం తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆమె కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ కార్యా లయాల్లో పని చేశారు. తమిళనాడులో పని చేసిన సమయంలో ఆ రాష్ట్ర ఉమెన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డులోనూ సుశీల ఉన్నారు. నాబార్డ్ మద్దతు ఇచ్చే ఇంక్యుబేషన్ సెంటర్లతోపాటు అగ్రి స్టార్టప్‌లతో చురుకుగా పనిచేసిన ఆమెకు.. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులు, క్రెడిట్ ప్లానింగ్, పర్యవేక్షణ, ఫైనాన్స్, మైక్రో క్రెడిట్, సహకార సంఘాలు, ఆర్ఆర్బీల పర్యవేక్షణలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది.