‘కిసాన్‌’ కార్డుల వ్యవస్థ ప్రక్షాళన

Agriculture Department Plan About Kisan Credit Cards - Sakshi

నిజమైన సాగుదారులకు ఇచ్చేలా ప్రణాళిక

బ్యాంకర్లు రుణగ్రహీతల జాబితా ఇస్తే అర్హుల గుర్తింపు 

ఈ ఏడాది కొత్తగా 3 లక్షల మందికి కార్డులు 

నగదు రహిత లావాదేవీలే లక్ష్యం 

రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రణాళిక

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా 25 లక్షల కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (కేసీసీ) ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో కేసీసీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. తూతూమంత్రంగా సాగుతున్న ఈ కార్డుల పంపిణీ తీరును సమీక్షించి నిజమైన సాగుదారులకు ఉపయుక్తంగా ఉండేలా వీటినిచ్చే పనికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా 3 లక్షల మందికి ఈ కార్డులివ్వాలని భావిస్తోంది.

కిసాన్‌ క్రెడిట్‌ కార్డులంటే..
బ్యాంకింగ్‌ రంగ నిపుణులు ఆర్‌వీ గుప్తా కమిటీ సిఫార్సు మేరకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) ఈ విధానాన్ని 1988 ఆగస్టు నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, ఆర్థిక సంస్థల వలలో చిక్కి రైతులు ఇబ్బంది పడకుండా బ్యాంకుల ద్వారా రుణాలను ఇప్పించడం ఈ కార్డుల లక్ష్యం. స్వల్పకాలంలోనే కిసాన్‌ క్రెడిట్‌ కార్డులకు బహుళ ప్రచారం వచ్చినా అమలులో మాత్రం పెద్దగా పురోగతి లేదన్నది వ్యవసాయాధికారుల భావన. ఇక రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయించిన ప్రకారం రైతులకు పంట ఆధారిత రుణ పరిమితి ఉంటుంది. నిజానికి ఆ మొత్తాన్ని రైతు ఖాతాకు జమచేస్తూ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ఇవ్వాలి. రైతు తనకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ఇతరత్రా వ్యవసాయ ఉత్పాదకాల కోసం ఈ కార్డును వినియోగించుకోవాలి. ఇదీ క్రెడిట్‌ కార్డుల ఉద్దేశం.

ఈ విధానం ఎలా ఉందంటే..
రాష్ట్రంలో బ్యాంకులు పంట రుణాలైతే ఇస్తున్నాయిగానీ కార్డులు ఇవ్వడంలేదు. అలాగే, రైతులూ అడగడంలేదు. పంట కాలానికి ముందు రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడమో లేదా రెన్యువల్‌ చేయించుకోవ డమో జరుగుతుంది. రెన్యువల్‌ అంటే బుక్‌ అడ్జస్ట్‌మెంట్‌ తప్ప (ఖాతా సర్దుబాట్లే) మరొకటి కాదు. ఒకవేళ కిందటి ఏడాది కన్నా పంట రుణ పరిమితి పెరిగితే ఆ వ్యత్యాస మొత్తాన్ని రైతుకు ఇస్తున్నారు. ఇలా రుణాలు తీసుకున్న వారందరికీ కార్డులు ఇచ్చినట్లేనని బ్యాంకర్లు చెబుతున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఇప్పటికి సుమారు 46 లక్షల మందికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులున్నట్లు అంచనా.

ఎలా మార్చాలనుకుంటున్నారంటే..
లోపభూయిష్టంగా ఉన్న ఈ పద్ధతిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ తలపెట్టి బ్యాంకర్లకు కొన్ని ప్రతిపాదనలను సూచించింది. అవి.. 
ఎవరికైతే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ (ఆయా పంటలకు ఇచ్చే రుణ పరిమితి) వర్తిస్తుందో వారందరికీ కార్డులు ఇవ్వాలని బ్యాంకర్లను రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరింది. 
డీ–ఫారం పట్టాలున్న వారు, కౌలు రైతులు సహా వాస్తవ సాగుదార్లందరికీ పంట రుణాలు ఇచ్చేలా ఈ క్రెడిట్‌ కార్డులను పంపిణీ చేయాలి.
వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేసేటప్పుడు నగదు రహిత లావాదేవీలు జరిపేలా చూడాలి.
ఏ ప్రయోజనం కోసమైతే రుణం ఇస్తున్నారో దాని కోసమే ఈ కార్డులను ఉపయోగించాలి. 
ఇది పక్కాగా అమలుకావాలంటే వాస్తవ సాగుదారులు ఎవరో గుర్తిం చాలి. ఏయే బ్యాంకు ఎంతెంత మందికి పంట రుణాలిచ్చిందో వారి జాబితాను వ్యవసాయ శాఖకు ఇచ్చినప్పుడే ఇది సాధ్యం. ఈ నేపథ్యంలో.. ఈ జాబితాను ఆయా గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయాధికారులతో పరిశీలన చేయించి రైతులను నిర్ధారించి అర్హులెవరో తేలుస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఇలా చేయడంవల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసే సున్నా వడ్డీకి ఎవరు అర్హులో లెక్కతేలుతుంది. అలా గుర్తించిన వారికి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులిస్తే రీ పేమెంట్స్‌కు ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. అలాగే, వ్యవసాయ ఉత్పాదకాలు ఎక్కడ కొనుగోలు చేశారో కనిపెట్టడంతో పాటు బ్యాంకులిచ్చే రుణాలకూ సార్ధకత ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top