పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాల్లో ఏకంగా రూ.16,607.57 కోట్లు కోత
అమాంతం పడిపోయిన సంఘాల పరపతి
ఏపీలో తిరోగమనంలో పొదుపు సంఘాలు
2024–25 స్వయం సహాయక సంఘాలపై నాబార్డు నివేదిక
సున్నా వడ్డీ పథకాన్ని రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన బాబు
ఆ హామీ మేరకు ఒక్క సున్నా వడ్డీ బకాయిలే రూ.7,500 కోట్లు
సున్నా వడ్డీ లేదు.. ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు.. జగన్ ఇచ్చిన పథకాలూ పోయాయ్..
మహిళలను మరోసారి ముంచేసిన చంద్రబాబు సర్కారు
నాడు సున్నా వడ్డీతోపాటు వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలతో మహిళా సాధికారతకు బాటలు వేసిన జగన్
ఒక్క సున్నా వడ్డీ ద్వారానే దాదాపు రూ.5 వేల కోట్లు చెల్లించి ఆదుకున్న వైఎస్ జగన్.. అక్కచెల్లెమ్మలు తమ కాళ్ల మీద నిలబడేలా వారి వ్యాపార ఉత్పత్తులు.. ఐటీసీ, పీ అండ్ జీ, రిలయన్స్, అమూల్ లాంటి సంస్థలతో టైఅప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలను హామీలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సర్కారు మోసాలు నాబార్డు నివేదిక సాక్షిగా మరోసారి బట్టబయలయ్యాయి. ఇప్పటికే వైఎస్సార్ ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను రద్దు చేసిన బాబు సర్కారు.. ఆడబిడ్డ నిధి, సున్నా వడ్డీ హామీలను సైతం ఎగరగొట్టడం తెలిసిందే. ఈ మోసాలకు బలై పోయిన స్వయం సహాయక పొదుపు సంఘాలు నిర్వీర్యమయ్యాయి. దీంతో వైఎస్సార్ సీపీ హయాంతో పోలిస్తే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 2024–25లో పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు ఏకంగా రూ.16,607.57 కోట్లు తగ్గిపోయినట్లు తాజాగా నాబార్డు నివేదిక వెల్లడించింది.
తాము అధికారంలోకి వస్తే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలను రూ.3 లక్షల నుంచి ఏకంగా రూ.10 లక్షలకు పెంచి అమలు చేస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. హామీ మేరకు రెండేళ్లలో ఒక్క సున్నా వడ్డీ పథకం ద్వారానే సుమారు రూ.7,500 కోట్ల మేర చంద్రబాబు సర్కారు పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సి ఉంది. ఇక ఆడబిడ్డ నిధి ద్వారా ఏటా రూ.18 వేలు చొప్పున రాష్టంలో ప్రతి మహిళకూ ఇస్తామన్న హామీని కూడా చంద్రబాబు ఎగ్గొట్టారు. అటు బ్యాంకు రుణాలు భారీగా తగ్గిపోవడం, ఇటు సున్నా వడ్డీ అమలు కాకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు అప్పుల్లో కూరుకుపోతున్నట్లు నాబార్డు నివేదిక విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్‌లో పొదుపు సంఘాలకు రుణాల మంజూరు భారీగా తగ్గిపోయినట్లు నివేదిక వెల్లడించడం గమనార్హం.
డ్వాక్రా మహిళలకు బాబు మోసం..
‘ఆసరా’తో ఆదుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్
2014 ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా.. సున్నా వడ్డీ పథకాన్ని సైతం నిలిపివేశారు. ఫలితంగా పొదుపు సంఘాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్‌పీఏలు (నిరర్థక ఆస్తులు)గా మారాయి. దీంతో నాడు చంద్రబాబు హయాంలో ఒక దశలో 18.36 శాతం సంఘాలు ఎన్‌పీఏలుగా ముద్రపడ్డాయి. అనంతరం వైఎస్ జగన్ హయాంలో పొదుపు సంఘాలు పునరుజ్జీవమయ్యాయి. నాడు వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు.. 2019 పోలింగ్ నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకు ఉన్న అప్పు మొత్తం రూ.25,571 కోట్లను ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా మహిళలకు నేరుగా చెల్లించడంతో పాటు సున్నా వడ్డీ పథకాన్ని క్రమం తప్పకుండా అమలు చేశారు.

ఒక్క సున్నా వడ్డీ ద్వారానే మహిళలకు దాదాపు రూ.ఐదు వేల కోట్ల మేర చెల్లించి ఆదుకున్నారు. దీంతో పొదుపు మహిళలు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించడంతో నాడు ఎన్‌పీఏల సంఖ్య కేవలం 0.17 శాతానికి పరిమితమైంది. అప్పట్లో దేశంలోనే అత్యధిక క్రెడిట్ లింకేజీ ఉన్న పొదుపు సంఘాలుగా నిలిచాయి. ఇక చేయూత పథకం ద్వారా మహిళా సాధికారతకు వైఎస్ జగన్ ప్రభుత్వం బాటలు వేసింది. మహిళలు వివిధ వ్యాపారాల్లో రాణించి తమ కాళ్లపై నిలదొక్కుకునేలా వారి ఉత్పత్తులను అమూల్, రిలయన్స్, ఐటీసీ ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, హిందుస్థాన్ లీవర్ లాంటి ప్రముఖ సంస్థలతో అనుసంధానించి, రుణాలు అందచేసి తోడ్పాటునిచ్చింది.


