అప్పు.. ముప్పు! | NABARD warns on Telanganas financial mobilization | Sakshi
Sakshi News home page

అప్పు.. ముప్పు!

Feb 13 2026 4:33 AM | Updated on Feb 13 2026 4:33 AM

NABARD warns on Telanganas financial mobilization

తెలంగాణ ఆర్థిక సమీకరణపై నాబార్డ్‌ హెచ్చరిక

ఆదాయం వృద్ధి గణాంకాలు మెరుగ్గా కనిపిస్తున్నా అదే వేగంతో అప్పుల పెరుగుదల

పదేళ్లలో రూ.72,658 కోట్ల నుంచి రూ.7,38,707 కోట్లకు రుణభారం

అప్పులపై అధికంగా ఆధారపడితే భవిష్యత్‌ తరాలకు భారమన్న స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 

సబ్సిడీలు, సంక్షేమ పథకాలు భారంగా మారుతున్నాయని వెల్లడి

ఆర్థిక సంస్కరణలు అవసరమని స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ వృద్ధి గణాంకాలు మెరుగ్గా కనిపిస్తున్నా, అప్పుల పెరుగుదల అదే వేగంతో దూసుకెళ్తోందని నాబార్డ్‌ తాజా స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ స్పష్టం చేసింది. 2014–15లో తలసరి ఆదాయం రూ.1.24 లక్షలుగా ఉండగా, 2024–25 నాటికి అది రూ.3.79 లక్షలకు పెరిగింది. ఇదే సమయంలో ప్రభుత్వ రుణభారం రూ.72,658 కోట్ల నుంచి రూ.7,38,707 కోట్లకు చేరింది. ఆదాయం పెరిగినంత వేగంగా అప్పులు సైతం పెరగడం ఆర్థిక స్థిరత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతోందని నాబార్డ్‌ పేర్కొంది. 

2024–25 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ ప్రస్తుత ధరల వద్ద రూ.16.41 లక్షల కోట్లు కాగా నిరంతర ధరల వద్ద వృద్ధి 8 శాతం దాటింది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.9 శాతం ఉంటే, సేవల రంగం జీఎస్‌వీఏ (గ్రాస్‌ స్టేట్‌ వాల్యూ యాడ్‌)లో 66 శాతం వాటా కలిగి ఉంది. ఈ గణాంకాలు రాష్ట్రాన్ని వేగంగా ఎదుగుతున్న రాష్ట్రాల సరసన నిలుపుతున్నాయి.

అయితే అదే సమయంలో రుణభారం దాదాపు పది రెట్లు పెరిగి రూ.7.38 లక్షల కోట్ల స్థాయికి చేరడం ఆందోళనకరమని నాబార్డ్‌ పేర్కొంది. ఆదాయం పెరిగినా, అప్పులపై అధికంగా ఆధారపడితే భవిష్యత్‌ తరాలకు భారం పెరుగుతుందని హెచ్చరించింది. ఈ అప్పులు తీర్చేందుకు గల అవకాశాలపై అనుమానాలు వ్యక్తం చేసింది. 

భారీ పెట్టుబడులు–ఆలస్యంగా రాబడులు
మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, సాగు నీటి ప్రాజెక్టులు, రహదారులు, వంతెనలు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం వంటి మౌలిక వసతుల కోసం గత పదేళ్లలో నాబార్డ్‌ ద్వారా భారీగా నిధులు ప్రవహించాయి. పలు పథకాల కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఇవి ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచే పెట్టుబడులే అయినప్పటికీ, ప్రభుత్వ ఖజానాకు వెంటనే రాబడి ఇవ్వడం లేదు. ఫలితంగా రెవెన్యూ ప్రవాహం – అప్పు మధ్య అంతరం పెరుగుతోందని నాబార్డ్‌ పేపర్‌ పేర్కొంది. 

తడిసి మోపెడవుతున్న పథకాల భారం
రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మద్దతు ధర, సన్నాలకు బోనస్, మహాలక్ష్మి వంటి పథకాలు గ్రామీణ ఆదాయాన్ని పెంచడంలో పాత్ర వహించినా, ఇవి రెవెన్యూ వ్యయాన్ని పెంచుతున్నాయని నాబార్డ్‌ అభిప్రాయపడింది. మూలధన వ్యయాలకు అవసరమైన నిధులు తగ్గుతుండటం ఆర్థిక సమతౌల్యంపై ప్రభావం చూపుతోందని విశ్లేషించింది. సబ్సిడీలు, సంక్షేమ పథకాల భారం  ఏటా తడిసి మోపెడవుతుందని పేర్కొంది. సంక్షేమ పథకాలకు వెచ్చించే మొత్తానికి, రెవెన్యూ రాబడికి మధ్య అంతరం పెరుగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. 

జీఐ ఉత్పత్తుల విస్తరణకు అవకాశాలు
తెలంగాణలో భౌగోళిక సూచిక (జీఐ) ఉత్పత్తుల విస్తరణకు విస్తృత అవకాశాలున్నట్లు నాబార్డ్‌ పేపర్‌ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 జీఐ ఉత్పత్తులు నమోదు కాగా, మరో 9 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో చెరుకు రసం, పెద్ద రసం మామిడిపండ్లు, వరంగల్‌ పసుపు, ఖమ్మం మిరప, నల్లగొండ స్వీట్‌ ఆరెంజ్, సంప్రదాయ సన్నబియ్యం రకాలు రాష్ట్ర ప్రత్యేకతను ప్రతిబింబిస్తున్నాయని గుర్తించింది. 

హస్తకళల రంగంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల్‌ చీరలు, కరీంనగర్‌ సిల్వర్‌ ఫిలిగ్రీ, నిర్మల్‌ బొమ్మలు–చిత్రాలు ఇప్పటికే జీఐ హోదా పొందగా, నారాయణపేట చీరలు, గిరిజన కళలు తదితరాలు గుర్తింపునకు అర్హత కలిగినవిగా పేర్కొంది. ఆహార వారసత్వంలో హైదరాబాద్‌ హలీం జీఐ గుర్తింపు పొందిందని ప్రస్తావిస్తూ, మెదక్‌–నిజామాబాద్‌ బెల్లం, స్థానిక మసాలా మిశ్రమాలు, ఊరగాయలు, డెక్కానీ గొర్రె బొచ్చు వంటి ఉత్పత్తులు కూడా జీఐ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.

ఆర్థిక స్థిరత్వంపై అప్పుల ప్రభావం
రాష్ట్ర ఏర్పాటు దశలో ఉన్న రుణం ఇప్పుడు రూ.7.38 లక్షల కోట్లకు చేరిందని, ఇది ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపే స్థాయికి వెళ్లిందని నాబార్డ్‌ పేర్కొంది. వృద్ధి రేట్లు, పెరిగిన తలసరి ఆదాయం తెలంగాణకు బలమైన పునాది అని, అప్పులు కూడా అదే వేగంతో కొనసాగితే భవిష్యత్‌ ఆర్థిక అవకాశాలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆదాయ సృష్టి, ఖర్చు నియంత్రణ, పెట్టుబడులకు తగిన స్పష్టమైన రాబడి నమూనాలు అవసరమని సూచించింది. వృద్ధి– అప్పు మధ్య సమతౌల్యం సాధించే విధానాలే రాష్ట్ర ఆర్థిక దిశను నిర్ణయిస్తాయని స్పష్టం చేసింది.  

ఆశావహ జిల్లాలు, బ్లాకులు
ప్రాంతీయ అసమానతలు తగ్గించి సమగ్రాభి వృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆశావహ జిల్లాల కార్యక్రమం (ఏడీపీ), ఆశావహ బ్లాకుల కార్యక్రమం (ఏబీపీ) గురించి స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ ప్రత్యేకంగా ప్రస్తావించింది. తెలంగాణలో కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఆశావహ జిల్లాలుగా గుర్తించబడ్డాయని, అదనంగా నార్నూర్, గుండాల, ముత్తారం, పాలిమేళ, గట్టు, తిర్యాణి, గంగారం, కన్నాయిగూడెం, నర్వ, పెంబి తదితర 10 బ్లాకులు ఇందుకోసం ఎంపికైనట్లు తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement