రూ. 60 లక్షలతో ఏటీఎం వాహన డ్రైవర్‌ పరార్‌ | ATM vehicle driver absconds with Rs 60 lakhs | Sakshi
Sakshi News home page

రూ. 60 లక్షలతో ఏటీఎం వాహన డ్రైవర్‌ పరార్‌

Feb 13 2026 4:29 AM | Updated on Feb 13 2026 4:29 AM

ATM vehicle driver absconds with Rs 60 lakhs

తెల్లాపూర్‌లో వాహనం స్వాదీనం.. నిందితుడి కోసం గాలింపు 

గచ్చిబౌలి: ఏటీఎంలలో నింపేందుకు నగదును తీసుకొచ్చిన వాహనంతో డ్రైవర్‌ ఉడాయించిన ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. నిందితుడు తెల్లాపూర్‌లో వాహనం వదిలేసి రూ. 60 లక్షల నగదుతో పరారయ్యాడు. ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు తెలిపిన ప్రకారం సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్‌ సంస్థ యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలలో క్యాష్‌ మెయింటెనెన్స్‌ సర్వీస్‌ (సీఎంఎస్‌) విధులు నిర్వహిస్తోంది. 

తిరుమలగిరి సిక్‌ రోడ్డులో నివసించే డ్రైవర్‌ బడిగేరీ అజిత్‌ కుమార్‌ అలియాస్‌ శివ, ఇద్దరు కస్టోడియన్లు ఎస్‌.రామకృష్ణ, ఎం.డి.మాలిక్, గార్డు పెరుమాల్‌.. ఏటీఎంలలో క్యాష్‌ లోడ్‌ చేసేందుకు సీఎంఎస్‌ వాహనం (టీఎస్‌ 10 యూడీ 0393)లో బయలుదేరారు. గురువారం సాయంత్రం 4:45 గంటల సమయంలో గోపన్‌పల్లిలోని యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో క్యాష్‌ లోడ్‌ చేసేందుకు ఇద్దరు కస్టోడియన్లు లోపలికి వెళ్లగా గార్డు వాష్‌రూమ్‌కు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన డ్రైవర్‌ అజిత్‌కుమార్‌ వాహనంతో పరారయ్యాడు. 

ఏటీఎం నుంచి బయటకు వచ్చిన కస్టోడియన్లకు వాహనం కనిపించకపోవడంతో డ్రైవర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది. చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోవడంతో డయల్‌ 100కు కాల్‌ చేసి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు జీపీ ఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా వాహన జాడను జల్లెడపట్టగా తెల్లాపూర్‌ వైపు వెళ్లినట్లు తేలింది. 

అక్కడకు చేరుకోగా గద్దర్‌ చౌరస్తాలోని వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో వాహనం కనిపించింది. నిందితుడు వాహనాన్ని వదిలి అందు లోని దాదాపు రూ. 60 లక్షల నగదుతో పరారైనట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. దీంతో వాహనాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు.. డ్రైవర్‌కు సిబ్బంది ఎవరైనా సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి.  

Advertisement
 
Advertisement
Advertisement