పిల్లలూ.. నాన్ననురా.. | Father writes to authorities to recover property from daughters | Sakshi
Sakshi News home page

పిల్లలూ.. నాన్ననురా..

Feb 13 2026 4:25 AM | Updated on Feb 13 2026 4:25 AM

Father writes to authorities to recover property from daughters

ఆస్తి తీసుకుని.. సంరక్షణ మరిచిన కూతుళ్ల తీరుపై ఓ వృద్ధ తండ్రి ఆవేదన 

కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): ముదిమి వయసులో భార్య మరణించగా ఒంటరైన ఆ వ్యక్తి, తన ఇద్దరు కూతుళ్లే సర్వస్వంగా భావించి ఉన్న ఆస్తినంతా వారికి ఇచ్చేశాడు. అయితే 70 ఏళ్లు పైబడిన ఆ వృద్ధ తండ్రిని ఆదరించాల్సిన కూతుళ్లు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆవేదనకు గురైన తండ్రి, కూతుళ్ల నుంచి తన ఆస్తిని తిరిగి ఇప్పించాల్సిందిగా అధికారులకు లేఖ రాయడం గమనార్హం. మారేడుపల్లి సెకండ్‌ లక్ష్మీనగర్‌కు చెందిన 70 ఏళ్ల రాజలింగం భార్య 2020లో మరణించింది. 

రాజలింగంకు ముగ్గురు కూతుళ్లు కాగా, తన పేరిట ఉన్న 130 గజాల ఇంటిని ఆయన ఇద్దరు పెద్ద కూతుళ్లు భాగ్యలక్ష్మి, ఝాన్సీలకు చెరిసగం పంచుతూ రిజి స్ట్రేషన్‌ చేశారు. తన భార్యకు చెందిన 15 తులాల బంగారు ఆభరణాలను సైతం ఇద్దరు కూతుళ్లకు పంచారు. అయితే కొంతకాలంగా ఆ ఇద్దరు కూతుళ్లు తండ్రి పోషణ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. పెద్ద కూతురు భాగ్యలక్ష్మి తన ఇంట్లోని బాత్రూమ్‌ సమీపంలోని స్థలాన్ని తనకు కేటాయించిందని ఆయన వాపోయారు. 

ప్రభుత్వ ఉద్యోగి అయిన రెండో కూతురు తాను పంచి ఇచ్చిన ఇంటిని విక్రయించే ప్రయత్నంలో ఉందన్నారు. వీరిపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, తాను పంచి ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాలని కోరుతూ ఆర్‌డీఓకు లేఖ రాశానని రాజ లింగం చెప్పారు. ఇందుకు స్పందించిన రెవెన్యూ అధికారులు రాజలింగం ఇద్దరు కూతుళ్లకు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ ఆర్‌డీఓ కార్యాలయంలో విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement