చీకట్లోనూ వాహనాలు వెలగాలి! | Reflective tapes are mandatory for transport vehicles | Sakshi
Sakshi News home page

చీకట్లోనూ వాహనాలు వెలగాలి!

Feb 13 2026 4:15 AM | Updated on Feb 13 2026 4:15 AM

Reflective tapes are mandatory for transport vehicles

రవాణా వాహనాలకు రిఫ్లెక్టివ్‌ టేప్‌లు తప్పనిసరి

రియర్‌ మార్కింగ్‌ ప్లేట్‌లు కూడా..

ఈ నెల 20 నుంచి అమల్లోకి నిబంధన: రవాణా శాఖ

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రివేళల్లో వాహనాలు కనిపించక జరిగే ప్రమాదాలను నివారించేందుకు అన్ని రకాల రవాణా వాహనాలకు ఈ నెల 20 నుంచి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్‌లను తప్పనిసరి చేసింది. కేంద్ర మోటారు వాహన చట్టం–1989లోని నిబంధనల ప్రకారం ప్రతి రవాణా వాహనానికి రిఫ్లెక్టివ్‌ టేప్‌లు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్‌లు అతికించుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రవాణా శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

నిర్ణీత నాణ్యతా ప్రమాణాల ప్రకారం రిఫ్లెక్టివ్‌ టేప్‌లు, రియర్‌ మార్కింగ్‌ ప్లేట్‌లను తయారు చేస్తున్న ఐదు సంస్థలను ఎంపిక చేశామని.. రవాణా వాహనాలకు కేవలం ఆ సంస్థలు తయారు చేసిన వాటినే అతికించాలని స్పష్టం చేసింది. ఇతర సంస్థలు లేదా వ్యక్తులు తయారు చేసిన వాటిని అతికించుకోవడానికి అనుమతించబోమని రవాణా శాఖ తేల్చిచెప్పింది. ఆయా వాహనాలకు అతికించే టేప్‌లు, ప్లేట్‌ల నాణ్యతా ప్రమాణాలను క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఐఎస్‌) ద్వారా ధ్రువీకరించే విధానాన్ని అమలు చేస్తామని పేర్కొంది. 

క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత ధ్రువీకరణ కలిగిన రిఫ్లెక్టివ్‌ టేప్‌లు ఉన్న వాహనాలకే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను జారీ చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే రిఫ్లెక్టివ్‌ టేప్‌లను రవాణా వాహనాలకు అతికించి ఉంటే 3 నెలల వరకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. తాము నిర్ణయించిన ధరలకు మించి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా ఆయా తయారీ సంస్థలకు చెందిన డీలర్ల ఎంప్యానెల్‌మెంట్‌ను రద్దు చేయడంతోపాటు బ్యాంక్‌ గ్యారంటీని స్వాధీనం చేసుకుంటామని రవాణా శాఖ హెచ్చరించింది.

అమలు విధానం ఇలా...
» రవాణా శాఖ ఎంపిక చేసిన ఐదు కంపెనీలు, వాటి అధీకృత డీలర్లు, అప్లికేటర్ల ద్వారా రవాణా వాహనాలకు టేప్‌లు అతికించాలి.
» ఈ టేప్‌లపై తెలంగాణ రవాణా శాఖ లోగోతో కూడిన హోలోగ్రామ్, ప్రత్యేక సీరియల్‌ నంబర్‌గల క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది.
»  టేప్‌లు అతికించాక ‘అఫిక్సేషన్‌ సర్టిఫికెట్‌’ జారీ చేయాలి. సర్టిఫికెట్‌లో వాహన వివరాలు, ఓఈఎం వివరాలు, ఫొటోలతోపాటు, కనీసం రెండేళ్ల వారంటీ ఉండాలి.

ధరలు ఇవీ..
»   హై విజిబిలిటీ ఉన్న 20 ఎంఎం (ఒక మీటర్‌కు) రిఫ్లెక్టివ్‌ టేప్‌ ధర రూ. 79 నుంచి రూ. 85 వరకు.
» 50 ఎంఎం (ఒక మీటర్‌కు) టేప్‌ ధర రూ. 145 నుంచి రూ. 151.80 వరకు.
»  సీ–3 (ఒక జత)కు రూ. 2,500 నుంచి రూ. 2,650, సీ–4 (జత)కు రూ. 2,800 నుంచి రూ. 2,900.
»విడిగా ఒక 40 ఎంఎం రిఫ్లెక్టర్‌ ధర రూ. 35. 80 ఎంఎం రిఫ్లెక్టర్‌ ధర రూ. 60. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement