నేనే రాజు.. నేనే మంత్రి! | CM Revanth Comments in a chat with the media in Delhi | Sakshi
Sakshi News home page

నేనే రాజు.. నేనే మంత్రి!

Feb 13 2026 2:29 AM | Updated on Feb 13 2026 2:29 AM

CM Revanth Comments in a chat with the media in Delhi

ఢిల్లీలో రాహుల్‌తో సీఎం రేవంత్‌

మొత్తంగా పదిన్నరేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా.. 

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌ 

2029 ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు ఉంటాయి

సీఎంగా నాకు మరో 6 నెలల సమయం అదనంగా లభిస్తుంది  

ఇలా ఐదున్నరేళ్లు.. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్లు సీఎంగా ఉంటా 

నేను నా ఊరు దాట.. జాతీయ రాజకీయాల్లోకి రాను

కాళేశ్వరంపై సీబీఐ విచారణకు జాప్యం ఎందుకో కిషన్‌రెడ్డి చెప్పాలి 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌తో బుల్లెట్‌ రైళ్ల అనుసంధానం 

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: ‘జనగణన 2027కు పూర్తి అవుతుంది...2029 కల్లా మహిళా రిజర్వేషన్లు, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతాయి. అదే ఏడాది ఏప్రిల్‌లో జమిలి ఎన్నికలు ఉంటాయి. సీఎంగా నాకు మరో 6 నెలల సమయం అదనంగా లభిస్తుంది. ఇలా ఐదున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటా. మొత్తం పదిన్నరేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా. నేనే రాజు.. నేనే మంత్రిని. నేను ఎవరితోనూ పోల్చుకోను. జాతీయ రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదు. నేను నా ఊరు దాట..’ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కుంగుబాటులో ప్రధాన దోషి అప్పటి సీఎం కె.చంద్రశేఖర్‌రావు అని దానిపై విచారణ జరిపిన కమిషన్‌ స్పష్టంగా చెప్పినప్పటికీ దీనిపై సీబీఐ విచారణలో కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జాతీయ నేత అని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని అన్నారు. కేంద్ర మంత్రులు, పార్టీ అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 

కేసీఆర్‌ను జైల్లో ఎందుకు వేయడంలేదు? 
‘కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 24 గంటల్లో కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని గతంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. అలాంటిది రెండేళ్లుగా కేసీఆర్‌ను జైల్లో ఎందుకు వేయడంలేదు? ఆయన కోరారు కాబట్టే కాళేశ్వరంపై విచారణ చేయమని సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రాష్ట్ర ప్రతిపాదనను సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోం శాఖ కార్యదర్శికి అందజేశాం. ప్రధాని కార్యాలయం వరకు విషయం వెళ్లింది. అయినప్పటికీ అతీగతీ లేదు. ఇంతవరకు విచారణ జరపలేదు.. కేసీఆర్‌ను జైల్లోనూ వేయలేదు. దీనికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.  

కేటీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదు? 
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌గాంధీ, సోనియా గాం«దీలను విచారించారు. ఈ–ఫార్ములా కేసును కూడా ఈడీకి ఇచ్చాం. కానీ మాజీమంత్రి కేటీఆర్‌ను ఈడీ ఎందుకు అరెస్టు చేయడం లేదు? ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్‌రావును విదేశాల నుంచి తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి ఆయనను తీసుకొచ్చేందుకు 20 నెలలు పట్టింది. ఆయన చెప్పిన సమాచారం ఆధారంగా మిగతావాళ్లకు నోటీసులు ఇచ్చాం ఇందులో రాజకీయం ఏమీలేదు. నేను ఇందులో జోక్యం చేసుకుంటే ఎవరూ బయట ఉండరు. 

‘నైనీ’పై అసెంబ్లీలో ఆధారాలు వెల్లడిస్తా.. 
నైనీ కోల్‌ బ్లాక్‌లో సైట్‌ విజిట్‌ అనే నిబంధన కేంద్రమే పెట్టింది. ఒక్క సింగరేణిలోనే ఆ రూల్‌ ఉందని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. నేను చెప్పింది నిజమైతే కిషన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి. లేదంటే నేను చెబుతా. వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అన్ని ఆధారాలను వెల్లడిస్తా. కిషన్‌రెడ్డి లేఖ రాస్తే విద్యుత్‌ కొనుగోళ్లు సహా అన్ని కేసులూ సీబీఐకి అప్పగించేందుకు సిద్ధం. రాష్ట్ర పోలీసులపై కిషన్‌రెడ్డికి విశ్వాసం లేదంటే బీజేపీ కౌన్సిలర్‌ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య కేసును కూడా సీబీఐకి అప్పగిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.  

గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలా? 
‘పాలమూరు, నెట్టెంపాడు తదితర ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో ఉన్నవే. వీటిపై ఏపీవాళ్లు పిటిషన్లు వేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టుకోకుండా మాకు అవాంతరాలు సృష్టిస్తున్నారు. గోదావరిలో వాళ్లకు కావాల్సింది వాళ్లు అడుగుతున్నారు. కృష్ణాలో మాకు కావాల్సింది కూడా ఇవ్వాలి కదా. మా ప్రాజెక్టులు అడ్డుకుంటే ఊరుకుంటామా? వాళ్లకు ఏది నచ్చితే అది తీసుకుంటామంటే ఎలా? గోదావరికి ఒక రూలు, కృష్ణాకు ఒక రూలు అంటే కుదరదు. వాళ్ల ప్రాజెక్టులకు ఏ రూలు వర్తిస్తుందో అదే రూలు మాకూ వర్తిసుంది. ఇక్కడ ప్రధాన సమస్య కృష్ణా జలాలే. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ఎన్‌ఓసీ ఇస్తే.. వాళ్లు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు..’ అని రేవంత్‌ స్పష్టం చేశారు.  

బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌గా హైదరాబాద్‌ 
‘రాష్ట్రంలో కేంద్రం మూడు బుల్లెట్‌ ట్రైన్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌గా మారబోతుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పరిసరాల్లో, ఫ్యూచర్‌ సిటీకి దగ్గర్లో బుల్లెట్‌ ట్రైన్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందుకోసం భూమిని కూడా పూలింగ్‌ చేస్తున్నాం. ఎయిర్ట్‌పోర్ట్‌ని బుల్లెట్‌ రైళ్లకు అనుసంధానం చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చూస్తాం. 2034 లోపు బుల్లెట్‌ రైళ్లు అందుబాటులోకి వస్తాయి. మెట్రో ఫేజ్‌–2కు మార్చి 31 డెడ్‌లైన్‌గా పెట్టుకుని పని చేస్తున్నాం. జూన్‌ 2కు మామునూరు, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలనుకుంటున్నాం..’ అని సీఎం తెలిపారు.   

ఎఫ్‌ఎస్‌ఎల్‌పై విపక్షాల విష ప్రచారం 
‘ఎఫ్‌ఎస్‌ఎల్‌లో కీలక కేసులకు సంబంధించిన రికార్డులు కాలిపోయాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కావాలని విష ప్రచారం చేస్తున్నాయి. అసలు విషయం వాళ్లకు తెలియదు. ఒక కేసుకు సబంధించిన వివరాలను పరిశీలించిన తర్వాత.. అవి తిరిగి దర్యాప్తు సంస్థకే అప్పగిస్తారు. 2021లో ‘ఓటుకు నోటు’ కేసు రిపోర్టు కూడా అలాగే తిరిగి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ రికార్డులు కూడా అందులో ఉన్నాయంటే ఎలా?..’ రేవంత్‌ అని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్‌కు భాష, రాష్ట్రాల సరిహద్దులు లేవు. ఆయన ఏ ఒక్కరి సొత్తూ కాదు.. జాతీయ సొత్తు. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. అందుకు నేను మద్దతిస్తా. ఇది నా వ్యక్తగత అభిప్రాయం, డిమాండ్‌. త్వరలో హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా..’ అని రేవంత్‌ చెప్పారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement