పత్తి పండించిన రైతులు 21 లక్షలు... సీసీఐకి విక్రయించింది 8.46 లక్షలే
కపాస్ కిసాన్ యాప్ తెచ్చినా... ఆగని దళారుల దందా
కౌలు రైతుల పేరిట అమ్మకాలు
ఇప్పటివరకు 15.63 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి విక్రయం
సాక్షి, హైదరాబాద్: దళారుల పాత్రను నిరోధించి, మద్దతు ధరతో రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చేసిన కసరత్తు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. కేంద్రం తెచ్చిన కపాస్ కిసాన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, దాని ద్వారానే స్లాట్ బుక్ చేసుకొని పత్తి ని సీసీఐకి విక్రయించాలనే నిబంధనను ఏర్పాటు చేశారు. అలాగే రైతు పండించిన పత్తిని ఉమ్మడి జిల్లా పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లోనే విక్రయించేలా నిబంధనలు పెట్టారు.
అయినా చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకొని దళారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, మద్దతు ధరకు రైతుల ముసుగులో మళ్లీ సీసీఐకే విక్రయించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పత్తి పండించిన రైతులకు.. విక్రయించిన రైతులకు మధ్యనున్న భారీ వ్యత్యాసమే దానికి నిదర్శనం. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు ఖరీఫ్ సీజన్‌లో పత్తిని సాగు చేయగా, నాలుగు నెలలుగా పత్తి విక్రయాలు సాగాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా పత్తి విక్రయాలు పూర్తయ్యాయి. ఈనెల 20తో అధికారికంగా పత్తి కొనుగోళ్లను సీసీఐ నిలిపివేస్తోంది. అయితే సీసీఐ రికార్డుల ప్రకారం ఇప్పటివరకు కేవలం 8,46,820 మంది రైతులు 15.63 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని 336 సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. వీరు కాకుండా మరో 2 లక్షల మంది రైతులు 5 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి ఉండవచ్చని మార్కెటింగ్ శాఖ చెబుతోంది.
అంటే దాదాపు 10 లక్షల మంది రైతులు 20 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పత్తిని సాగు చేసిన 25 లక్షల మంది రైతుల్లో మిగతా 15 లక్షల మంది రైతులు పంటను ఎక్కడ విక్రయించారనేదే ప్రశ్న.
రైతుల ముసుగులో విక్రయాలు
రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 25 లక్షల మంది రైతులు 45.32 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తిని సాగు చేసినట్లు వ్యవసా యశాఖ చెబుతోంది. 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి వస్తుందని అంచనా వేసింది. అయితే వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదు. ఆదిలా బాద్, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో వర్షాలకు, గాలిలో తేమకు పత్తి నాని రంగు మారింది. ఈ నేపథ్యంలో సీసీఐ 8% నుంచి 12 శాతం తేమ ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని, మద్దతు ధర క్వింటాలుకు రూ. 8,111 ఇస్తామని, తగ్గిన ఒక్కో శాతానికి మద్దతు ధరలో ఒక శాతం చొప్పున తగ్గిస్తూ సీసీఐ ఆంక్షలు విధించింది.
ఈ పరిస్థితుల్లో రంగు మారిన, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రైతుల నుంచి పత్తిని దళారులు సేకరించినప్పుడే రైతుల ఫోన్ నంబర్లు తీసుకొని ఓటీపీ ఆప్షన్ ద్వారా కౌలు రైతుల పేరిట పత్తిని సీసీఐకి విక్రయించినట్లు సమాచారం. ఈ దందాలో మార్కెటింగ్, సీసీఐ అధికారులు కుమ్మక్కు అయినట్లు తెలుస్తోంది.


