చిన్నారుల ఇంటికే పోషకాహారం! | Mobile Anganwadi centers coming soon | Sakshi
Sakshi News home page

చిన్నారుల ఇంటికే పోషకాహారం!

Feb 13 2026 4:09 AM | Updated on Feb 13 2026 4:09 AM

Mobile Anganwadi centers coming soon

త్వరలో మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలు

హెచ్‌ఎండీఏ పరిధిలోని 274 మురికివాడలను కవర్‌ చేసేలా ప్రణాళిక

25 వేల మందికి పైగా అర్హులకు పాలు, కోడిగుడ్లు ఇతర పదార్థాలు

ప్రభుత్వానికి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రతిపాదనలు

సాక్షి, హైదరాబాద్‌: మహానగరంలోని ప్రతి చిన్నారికి పోషకాహారం అందేలా రాష్ట్ర మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా వలస కార్మిక కుటుంబాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని చేరువ చేసే లక్ష్యంతో మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలను తీసుకొస్తోంది. అత్యధిక సంఖ్యలో వలస కార్మికులుంటున్న హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో వీటిని నిర్వహించాలని నిర్ణయించింది. 

చిన్నారులు ఎక్కువగా ఉండే చోటుకు ఈ కేంద్రాలను తీసుకెళ్లి ఆహారాన్ని పంపిణీ చేసేందుకు కసరత్తు చేపట్టింది. భవనాల కొరత, సాంకేతిక సమస్యలు తదితర కారణాలతో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటికి తోడు కొత్త అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలతో సంఖ్య పెంచే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే మొబైల్‌ అంగన్‌వాడీ కేంద్రాలవైపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.

25 వేల మందికి మొబైల్‌ కేంద్రాల ద్వారా...
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది. ఈ నాలుగు జిల్లాల్లో ప్రస్తుతం 2,364 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అయితే ఈ కేంద్రాల పరిధిలోని 25,310 మంది అర్హులైన చిన్నారులు, గర్భిణిలు, బాలింతలు  ఆహారం అందుకోలేకపోతున్నట్లు శిశు సంక్షేమ శాఖ పరిశీలనలో తేలింది. అంగన్‌వాడీ కేంద్రాలు సమీపంలో లేకపోవడమే ఇందుకు కారణమని అధికారులు గుర్తించారు. దీంతో అర్హులందరికీ అంగన్‌వాడీ సేవలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. 

ఈ క్రమంలో టేక్‌ హోం రేషన్‌ (ఇంటికే రేషన్‌) విధానంలో అర్హుల నివాసాలకే పోషక పదార్థాలను అందించే విధంగా మొబైల్‌ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల ద్వారా బాలామృతం, పాలు, చిరుతిండ్లు (స్నాక్స్‌), కోడి గుడ్లు, బియ్యం తదితర పోషకాహార పదార్థా టలను నేరుగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. 274 మురికివాడలను కవర్‌ చేసేందుకు 37 వాహనాలను అద్దెకు తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 

హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 7 వాహనాలు, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 15, సంగారెడ్డిలో 1, రంగారెడ్డిలో 14 వాహనాలను వినియోగించనున్నారు. ఈ మొబైల్‌ కేంద్రాలను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు అనుబంధంగా నిర్వహిస్తారు. ఈ కేంద్రాల నిర్వహణకు ఏటా రూ.4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement