ధాన్యం దిగుబడిలో ఏపీకి రెండో స్థానం | AP ranks second in grain yield | Sakshi
Sakshi News home page

ధాన్యం దిగుబడిలో ఏపీకి రెండో స్థానం

Dec 14 2023 5:23 AM | Updated on Dec 14 2023 6:02 AM

AP ranks second in grain yield - Sakshi

సాక్షి, అమరావతి: హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. మొదటి స్థానంలో పంజాబ్‌ ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 2022–23లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హెక్టార్‌కు ధాన్యం దిగుబడిపై నాబార్డు నివేదికను విడుదల చేసింది. జాతీయ స్థాయిని మించి రాష్ట్రంలో హెక్టార్‌కు ధాన్యం దిగుబడి అత్యధికంగా ఉందని నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన సమగ్ర సస్య రక్షణ చర్యలపై ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలిస్తోంది.

పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పైర్లపై వచ్చే వివిధ చీడపీడలను ఎప్పటికప్పుడు అంచనాలు వేసి, వాటి వలన పంటలకు ఏ విధమైన నష్టమూ వాటిల్లకుండా.. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు ఆర్‌బీకేలు తోడుగా నిలుస్తున్నాయి. నిరోధక శక్తిగల వరి రకాలను ఎంచుకునేలాగ రైతులను ఆర్‌బీకేల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. విత్తన శుద్ధి పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. నారు మడిలో సస్యరక్షణను పాటింపజేయడంతో పాటు నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు.

అలాగే నత్రజని ఎరువును సిఫారసుకు తగినట్టే వినియోగించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఏ తెగుళ్లు సోకితే ఎంత మోతాదులో క్రిమిసంహారక మందులు వాడాలో కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.  మెరుగైన వ్యవసాయ పద్ధతులు, దిగుబడిని పెంచే ఇన్‌పుట్‌లు మొదలైనవి రైతులకు ప్రభుత్వం సూచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో విత్తనం నుంచి పంట కోసి, విక్రయం వరకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా నిలుస్తోంది. దీంతో హెక్టార్‌కు ధాన్యం దిగుబడిలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement