సాగిపోదాం.. సాఫీగా

NDB and AP government jointly develop roads with Rs 6400 crore - Sakshi

రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులు

రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. రోడ్లు, వంతెనల మరమ్మతులు

రూ.303 కోట్లతో మూడునెలల్లో మూడువేల కి.మీ. గుంతల్లేని రహదారులు

రూ.6,400 కోట్లతో ఎన్‌డీబీ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రోడ్ల అభివృద్ధి

నాబార్డు సాయానికి రూ.1,089 కోట్లతో ప్రతిపాదనలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రహదారుల రూపు మారుతోంది. వేలకోట్ల రూపాయలతో విస్తరణ, మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇందులో రూ.4,316 కోట్లతో రహదారుల విస్తరణ, రూ.684 కోట్లతో రోడ్ల నిర్వహణ, ప్రత్యేక మరమ్మతులు చేపట్టారు. ఇవికాకుండా రూ.2,168 కోట్లతో 7,116 కి.మీ. మేర రోడ్లు, వంతెనలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని ఇటీవల ఆర్‌ అండ్‌ బీ శాఖ సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదని సూచించారు. ఇందుకు మూడువేల కిలోమీటర్ల రోడ్లకు రూ.303 కోట్లు అవసరమని ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదించింది. డిసెంబరు నాటికల్లా వర్షాలకు దెబ్బతిన్న రోడ్లపై గుంతల్ని పూడ్చేందుకు ఆర్‌ అండ్‌ బీ శాఖ ప్రణాళిక రూపొందించింది. రోడ్ల మరమ్మతుల పర్యవేక్షణకు ప్రభుత్వం సీఈలు, ఎస్‌ఈలను నియమించింది. గ్రామీణ రహదారుల కోసం రూ.1,089 కోట్ల మేర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ పథకం కింద సాయమందించాలని నాబార్డును కోరారు. మరోపక్క రూ.6,400 కోట్లతో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఎన్‌డీబీ) రుణ సాయంతో రహదారుల ప్రాజెక్టులు చేపడుతున్న విషయం తెలిసిందే.

జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం
► జిల్లా ప్రధాన రహదారులకు ప్రాధాన్యం దక్కనుంది. మొత్తం మరమ్మతులు చేసే మూడువేల కి.మీ.లలో 2,060 కి.మీ. మేర జిల్లా ప్రధాన రహదారులకు రూ.197 కోట్లు కేటాయించేందుకు ప్రతిపాదించారు. 940 కి.మీ. రాష్ట్ర రహదారులకు రూ.106 కోట్లు కేటాయించనున్నారు. 
► రాష్ట్ర రహదారులపై ప్యాసింజర్‌ కార్‌ యూనిట్‌లు (పీసీయూ) రోజుకు 6 వేలు దాటిన వాటిని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని రోడ్ల నిర్వహణ చేపట్టనున్నారు. 
► గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల కాలంలో రోడ్లు విస్తరణ, మరమ్మతులకు రూ.4,150 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు.
► 2014 నుంచి 2019 వరకు ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ.2,748.21 కోట్ల బడ్జెట్‌ కేటాయించినా రూ.2,103.34 కోట్లు మాత్రమే ఖర్చుచేశారు.
► ఆర్‌ అండ్‌ బీకి కేటాయించిన నిధుల్ని వేరే పథకాలకు మళ్లించారు. 

రోడ్ల మరమ్మతులకు రూ.122 కోట్లు
ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న గ్రామీణ రోడ్లకు రూ.122.15 కోట్లతో మరమ్మతులు చేయడానికి పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్‌ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సెప్టెంబర్, అంతకు ముందు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్లు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. 28 చోట్ల రాకపోకలకు అంతరాయం కలిగే రీతిలో ఆ రోడ్లకు గండ్లు పడ్డాయి. అన్ని జిల్లాల ఎస్‌ఈలు దెబ్బతిన్న రోడ్ల వివరాలు పంపినట్టు ఈఎన్‌సీ సుబ్బారెడ్డి తెలిపారు. 
► గండ్లు పూడ్చివేతతోపాటు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నచోట అత్యవసరంగా రూ.10.25 కోట్లతోను, ఆయా రోడ్లకు  రూ.111.90 కోట్లతో పూర్తిస్థాయిలోను మరమ్మతులు చేయాలని ప్రతిపాదించారు.
► కర్నూలు జిల్లాలో ఏడుచోట్ల  పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్‌ విభాగం పరిధిలోని భవనాలు, వైఎస్సార్‌ కడప జిల్లాలో ఐదు పాఠశాలల ప్రహరీలు వర్షాలకు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.1.55 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

విశాఖ జిల్లాలో పాడేరు నుంచి సుజనాకోట వరకు రూ.20 కోట్లతో రహదారి పనులు జరుగుతున్నాయి. పెదబయలు మండలం దూడకోట పంచాయతీ కేంద్రం నుంచి అత్యంత మారుమూల జాముగూడ వరకు రూ.13.21 కోట్లతో రోడ్డు నిర్మిస్తున్నారు. ఒడిశా సరిహద్దులో కెందుగూడ వరకు, ముంచంగిపుట్టు మండలం మారుమూల లబ్బూరు జంక్షన్‌ నుంచి మారుమూల గ్రామం బుంగాపుట్టు వరకు రూ.14 కోట్లతో రోడ్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట–దోన్‌బాయి–వీరఘట్టం వరకు 25 కి.మీ. రోడ్డు నిర్మాణాన్ని రూ.24 కోట్లతో చేపట్టారు. 

డిసెంబర్‌కల్లా రాష్ట్రంలో గుంతల్లేని రహదారులు
వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ప్రాధాన్యత క్రమంలో రోడ్లను నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే రోడ్లు గుర్తించి వాటి మరమ్మతులు, నిర్వహణ చేపడుతున్నాం. డిసెంబర్‌ నాటికల్లా రోడ్ల నిర్వహణ మెరుగ్గా ఉంటుంది. గ్రామీణ రహదారులను విస్తరించడం, నిర్వహణ కోసం నాబార్డుకు ప్రతిపాదనలు పంపించాం. రూ.1,089 కోట్ల ప్రతిపాదనల్లో రూ.440 కోట్లతో రోడ్ల నిర్వహణ చేపట్టే ప్రణాళికలున్నాయి. 
    – వేణుగోపాల్‌ రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top