పోలవరానికి రూ.1,850 కోట్లు | Sakshi
Sakshi News home page

పోలవరానికి రూ.1,850 కోట్లు

Published Thu, Nov 28 2019 5:16 AM

Central Finance Department mandate for NABARD to release Rs1850 crores for Polavaram Project Works - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.1,850 కోట్లను రీయింబర్స్‌ చేయడానికి అనుమతిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. ఆ నిధులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేయాలని నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు)కు కేంద్ర ఆర్థిక శాఖ అండర్‌ సెక్రటరీ గౌతమ్‌ ఫలిత్‌ ప్రతిపాదనలు పంపారు. బాండ్లను జారీ చేయడం ద్వారా బహిరంగ మార్కెట్‌ నుంచి నిధులు సేకరించి పోలవరం ప్రాజెక్టుకు విడుదల చేయాలని నాబార్డుకు దిశానిర్దేశం చేశారు. దీంతో సెబీ(సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) పరిధిలో ఈ–ఆక్షన్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.1,850 కోట్లను నాబార్డు సేకరించనుంది.

ఐదారు రోజుల్లోనే పీపీఏ ద్వారా ఆ నిధులు ప్రాజెక్టుకు అందనున్నాయి. జూలై 24, 2018 అనంతరం పోలవరానికి కేంద్రం నిధులు మంజూరు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా, పోలవరం పనులను ప్రక్షాళన చేసి.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ రూ.841.33 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశారని, పనుల్లో పారదర్శకతకు పెద్దపీట వేయడంతో నిధుల విడుదలకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని అధికారవర్గాలు వెల్లడించాయి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement