రాజధాని నిర్మాణ పనుల్లో నిబం‘ధన’ల లూటీ | Looting of funds earmarked for capital construction work | Sakshi
Sakshi News home page

రాజధాని నిర్మాణ పనుల్లో నిబం‘ధన’ల లూటీ

Feb 13 2026 5:58 AM | Updated on Feb 13 2026 5:58 AM

Looting of funds earmarked for capital construction work

ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.3,005.25 కోట్ల పనులు కాంట్రాక్టర్‌కు అప్పగింత 

మొబిలైజేషన్‌ అడ్వాన్సులు చెల్లించేందుకు పీఏవో ససేమిరా 

దాంతో ఆ పనులకు అనుమతివ్వాలంటూ ఆర్థిక శాఖకు ఏడీసీఎల్‌ ఎండీ ప్రతిపాదన 

వాటిని ఆమోదించిన ఆర్థిక శాఖ 

గతంలో రూ.524.70 కోట్లతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్స్‌ పనుల్లోనూ ఇదే తీరు

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో ప్రభుత్వ పెద్దల దన్నుతో ఏడీసీఎల్‌ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌), సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ఉన్నతాధికారులు అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనడానికి ఇది మరో తార్కాణం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.3,005.25 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు ఏడీసీఎల్‌ అప్పగించేసింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఆ పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్‌ అడ్వాన్సు, బిల్లులు చెల్లించడానికి పీఏవో (పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) కార్యాలయం అధికారులు నిరాకరించారు. 

దీంతో చేసేదిలేక ఆ పనులకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖకు ఏడీసీఎల్‌ ఎండీ గతేడాది నవంబర్‌ 27, ఈ ఏడాది జనవరి 6న ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వాటిని ఆర్థిక శాఖ ఆమోదించింది. దీంతో రూ.3,005.25 కోట్లతో చేపట్టిన ఆ పనులకు అనుమతిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ గురువారం వేర్వురుగా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే తరహాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్ల పనులను రూ.524.70 కోట్ల వ్యయంతో కాంట్రాక్టర్లకు అప్పగించడం గమనార్హం. 

వివరాల్లోకి వెళితే.. రాజధానిలో జోన్‌–8 (కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి) లే అవుట్‌ అభివృద్ధి పనులను రూ.1,863 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏడీసీఎల్‌ అధికారులు పంపిన ప్రతిపాదనపై గతేడాది నవంబర్‌ 12న పురపాలక శాఖ ఆమోముద్ర వేసి, పరిపాలన అనుమతి ఇచి్చంది. అలాగే ఈ–13 రహదారిని ఎన్‌హెచ్‌–16 వరకూ పొడిగించేందుకు 7.29 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులను రూ.834.66 కోట్ల అంచనా వ్యయంతో.. 

ఇక ఈ–15 రహదారిని పాత మంగళగిరి హైవే వరకూ పొడిగించే పనులను రూ.307.59 కోట్ల వ్యయంతో చేపట్టేందుకు ఏడీసీఎల్‌ అధికారులు పంపిన ప్రతిపాదనపై గతేడాది మార్చి 19న పురపాలక శాఖ ఆమోదముద్ర వేసి, పరిపాలన అనుమతి ఇచి్చంది. ఈ మూడు పనులు చేపట్టడానికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు.  

మూడు ప్యాకేజీలూ మేఘాకే.. 
» ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఏ పనీ చేపట్టకూడదన్నది నిబంధన. కానీ.. ఆ నిబంధనను ఉల్లంఘించి ఈ మూడు పనులకు ఏడీసీఎల్‌ అధికారులు టెండర్లు పిలిచారు. రాజధానిలో జోన్‌–8 లే అవుట్‌లో రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, మురుగు నీటి వ్యవస్థ, విద్యుత్, ఇంటర్నెట్‌ కేబుల్‌ వంటి వాటికి యుటిలిటీ డక్ట్‌లు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, శుద్ధి చేసిన నీటిని పునర్‌ వినియోగించేందుకు పైపు లైను.. రహదారులకు ఇరువైపులా చెట్లను పెంచడంతోపాటు ట్రంక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పనులకు రూ.1305.39 కోట్ల వ్యయంతో నవంబర్‌ 14న ఏడీఎసీఎల్‌ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

» ఈ టెండర్లలో 4.03 శాతం అధిక ధర అంటే.. రూ.1358 కోట్లకు కోట్‌ చేసిన మేఘా సంస్థకు పనులు అప్పగించడానికి సీఆర్‌డీఏ అథారిటీ, కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాయి. దాంతో ఆ పనులను మేఘాకు అప్పగించారు. దీని వల్ల ఖజానాపై రూ.52.61 కోట్ల భారం పడింది. అంటే.. ఖజానాకు ఆ మేరకు నష్టం వాటిల్లింది. ఆ మేరకు కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూరింది. ఇక ఈ పనులు చేసిన కాంట్రాక్టర్‌కు జీఎస్టీ, సీనరేజీ, న్యాక్‌ వంటి పన్నుల రూపంలో రూ.277.85 కోట్లను రీయింబర్స్‌ చేస్తామని ఏడీసీఎల్‌ పేర్కొంది. అంటే.. ఈ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,635.85 కోట్లకు చేరుకుంది.  

» ఈ–13 రహదారిని ఎన్‌హెచ్‌–16 వరకూ పొడిగించేందుకు 7.29 కిమీల పొడవున ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులకు రూ.384.78 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్లలో 4.10 శాతం అధిక ధరకు అంటే రూ.400.55 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన మేఘా సంస్థ వాటిని దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ వంటి పన్నుల రూపంలో అదనంగా రూ.81.92 కోట్లు ఏడీసీఎల్‌ ఇవ్వనుంది. అంటే.. దాని కాంట్రాక్టు విలువ రూ.482.47 కోట్లకు చేరింది. అంటే.. కి.మీకు రూ.66.18 కోట్ల చొప్పున రోడ్డు నిర్మాణ పనులను అప్పగించినట్లు స్పష్టమవుతోంది. ఇదే పద్ధతిలో జాతీయ రహదారులను కి.మీకు రూ.20 కోట్ల వ్యయంతో ఎన్‌హెచ్‌ఏఐ నిరి్మస్తుండటం గమనార్హం. 

» ఇక ఈ–15 రహదారిని పొడిగించే పనులకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 3.98 శాతం అధిక ధరకు అంటే రూ.72.78 కోట్లకు కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచిన మేఘా సంస్థ వాటిని దక్కించుకుంది.  

» ఈ మూడు ప్యాకేజీల పనుల దక్కించుకున్న మేఘాకు.. కాంట్రాక్టు విలువలో 10 శాతం మొబిలైజేషన్‌ అడ్వాన్సు చెల్లించాలని ఏడీసీఎల్‌ అధికారులు పంపిన ప్రతిపాదనలను పీఏవో కార్యాలయం తిరస్కరించింది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చేపట్టిన ఆ పనులకు మొబిలైజేషన్‌ అడ్వాన్సులతోపాటు ఎలాంటి బిల్లులు చెల్లించబోమని తేలి్చచెప్పింది.  

గతంలోనూ ఇదే తీరు.. 
రాజధానిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారుల క్వార్టర్ల కోసం ఎస్‌+12 పద్ధతిలో 18 టవర్లలో 432 ఫ్లాట్ల (యూనిట్లు) నిర్మాణ పనులు 2019 నాటికే 72 శాతం పూర్తయ్యాయి. ఆ పనులకు రూ.363.68 కోట్ల బిల్లులు చెల్లించారు. మిగిలిన 28 శాతం పనుల వ్యయం రూ.272.22 కోట్లు. కానీ.. ఆ పనుల అంచనా వ్యయాన్ని రూ.524.70 కోట్లకు పెంచేసి, 2017లో వాటిని అప్పగించిన ఎన్‌సీసీ సంస్థకే మళ్లీ ఇప్పుడు కట్టబెట్టారు. అంటే.. అంచనా వ్యయాన్ని రూ.252.48 కోట్లు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. 

2018–19 నాటితో పోల్చితే ఇప్పుడు స్టీలు, సిమెంటు, పెట్రోల్, డీజిల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యతాస్యం లేదు. పైగా ఇసుక ఉచితం. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 92.75 శాతం పెంచేయడంపై ఇంజినీర్లు నివ్వెరపోతున్నారు. ఆ పనులకూ ఆర్థిక శాఖ అనుమతి లేకపోవడంతో మొబిలైజేషన్‌ అడ్వాన్సు చెల్లించేందుకు పీఏవో కార్యాలయం తిరస్కరించింది. దాంతో ఆర్థిక శాఖ అనుమతి కోసం సీఆర్‌డీఏ అధికారులు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వాటికి ఆర్థిక శాఖ అంగీకరించడంతో ఆ పనులకు అనుమతి ఇస్తూ గతేడాది జూలై 13న పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement