రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకే భూములా?
శాసన మండలిలో మండిపడ్డ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ
99 పైసలకే భూములిచ్చే విధానం దేశంలో ఎక్కడైనా ఉందా?
ఐటీ సంస్థల పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థలకు కేటాయింపులా?
విశాఖలో ప్రభుత్వం చేసిన భూ కేటాయింపులపై నిలదీత
భూముల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ఏపీఐఐసీ ఉంది కదా..
వారు చేసే పనిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకిస్తున్నారు?
లోపాయికారీ ఒప్పందాల వల్లే భూ కేటాయింపులని మండిపాటు
ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి సభ్యుల వాకౌట్
సాక్షి, అమరావతి: విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడు, ఎంపీ భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ ఆక్రమణలోని రూ.5 వేల కోట్లు విలువచేసే 55 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలా క్రమబద్ధీకరిస్తారని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రియల్ ఎస్టేట్, ప్రైవేట్ సంస్థలకు 99 పైసలకే భూములు ఎలా ఇస్తారని నిలదీశారు. లులు, సత్వా, ఉర్సా తదితర కంపెనీలకు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను రాసిచ్చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
ఏ ప్రశ్న అడిగినా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. విశాఖపట్నంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం 99 పైసలకే రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దీనిపై దాదాపు గంటపాటు చర్చ సాగింది. ఈ అంశంపై ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
గత 20 నెలల కాలంలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థలకు 99 పైసలకే కేటాయించిన భూముల వివరాలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ.. ఐదు సంస్థలకు 99 పైసలకే భూములు కేటాయించినట్టు వెల్లడించారు. తమ ప్రభుత్వ పాలసీలో భాగంగా ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం తీసుకొచ్చేందుకే ఈ కేటాయింపులు చేశామన్నారు. దీనిపై మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణతో కలిసి వైఎస్సార్‌సీపీ తరఫున ప్రశ్న లేవనెత్తిన మాధవరావు, వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. ‘ఐటీ కంపెనీల పేరుతో విలువైన భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా అతి తక్కువ ధరలకు ఇచ్చేస్తున్నారు.
రహేజా రియల్ ఎస్టేట్ సంస్థకు 99 పైసలకు 27 ఎకరాలు ఎలా కట్టబెట్టారు? ఆ సంస్థకు రూ.1,500 కోట్ల విలువైన భూమిని ఇచ్చేశారు. వాస్తవానికి భూములను అభివృద్ధి చేసి, మౌలిక వసతులు కల్పించి.. పరిశ్రమలకు ఇచ్చేందుకు ప్రభుత్వ రంగంలో ఏపీఐఐసీ ఉంది. కానీ వారు చేసే పనిని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకిస్తున్నారు? ఏపీఐఐసీ కంటే రియల్ ఎస్టేట్ సంస్థలు మెరుగైన అభివృద్ధి చేస్తాయా? 99 పైసలకే భూములు ఇవ్వడం దేశంలో మరెక్కడా లేదు. రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చా? ఈ విధానం ఎక్కడైనా ఉందా? ఐటీ పార్కుల అభివృద్ధి నుంచి ఏపీఐఐసీని తప్పిస్తున్నారా? ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధిని కూడా ప్రైవేటు కంపెనీలకు ఎందుకిస్తున్నారు?’ అని ప్రశ్నించారు.
లోపాయికారీ లావాదేవీలే..
విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం, డేటా సెంటర్ అని చెబుతూ లోపాయికారీగా వాళ్లకున్న లావాదేవీలతో, స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం అతి కారుచౌకగా భూ కేటాయింపులు చేస్తుందని బొత్స మండిపడ్డారు. ‘రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా 99 పైసలకు భూములు ఇచ్చుకోవచ్చని మంత్రి చెబుతున్నారు. విశాఖలోని విలీన భూములను 99 పైసలకే ఇస్తున్నారు. ఇందులో పారదర్శకత లేదు. వాస్తవాలు ప్రపంచానికి తెలియాలి. పక్క రాష్ట్రాల్లో పారదర్శకంగా జరుగుతున్నాయి. అక్కడ మార్కెట్ ధరలకు భూములు కొంటుంటే ఇక్కడ మాత్రం 99 పైసలకే ఇచ్చేస్తున్నారెందుకు? విశాఖలో ఐటీ ఎకో సిస్టం ఇప్పుడిది కాదు.
2004లోనే ప్రారంభించాం. అప్పుడు ఆ శాఖ మంత్రిని నేనే. 2014–19 మధ్య మీరేం చేశారో మీ తండ్రి (చంద్రబాబు)ని చెప్పమనండి. ఇప్పుడు మీరు ఏదైతే ఎకో సిస్టం, డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారో వాటిని 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక (విశాఖలో అదాని డేటా సెంటర్) తెచ్చింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ఈ భూ దోపిడీకి, లాలూచీలకు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల పట్ల వైఎస్సార్‌సీపీ నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.
విశాఖలో ఐదు సంస్థలకు 99 పైసల చొప్పున భూములు కేటాయించడం వాస్తవం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు 21.16 ఎకరాలు, కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాలు, ఏఎన్‌ఎస్‌ఆర్ గ్లోబల్ కార్పొరేషన్‌కు 13.29 ఎకరాలు, రహేజా రియల్ ఎస్టేట్‌కు 27.1 ఎకరాలు, సంవర్ధన మదర్శన్ ఇంటర్నేషనల్ సంస్థకు 3.55 ఎకరాలను 99 పైసలకే ఇచ్చాం. ఎకరం 99 పైసలకు కాదు. ఆయా సంస్థల్లో ఒక్కో సంస్థకు ఇచ్చిన మొత్తం భూమి 99 పైసలే. – శాసన మండలిలో వైఎస్సార్‌సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానం
ఏడాది క్రితం రిజిస్టరైన సంస్థలకు రూ.వేల కోట్ల భూములా?
గత 20 నెలల కాలంలో 99 పైసలకు ఐదు కంపెనీలకు భూములు ఇచ్చినట్టు చెబుతున్నారని, అయితే గత సంవత్సరంలో రిజిస్టర్ అయిన కంపెనీకి కూడా వేల కోట్ల విలువైన భూములు ఎలా కేటాయించారంటూ ఎమ్మెల్సీ మాధవరావు నిలదీశారు. ‘విశాఖ నడిబొడ్డున లులూ సంస్థకు 13.74 ఎకరాలు 99 ఏళ్లకు లీజుకిచ్చారు. విజయవాడలో రూ.156 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్ల భూమిని లీజుకిచ్చారు.
ఇంత తక్కువ పెట్టుబడికి ఎంతో విలువైన భూమి ఇవ్వడం ఏంటి? ప్రభుత్వం రూ.లక్ష కోట్లు పెట్టి టెండర్లు పిలిచి రాజధాని కడుతోంది. అదే 4.15 ఎకరాలకు టెండర్లు పిలిచి భవనం ఎందుకు కట్టడం లేదు?’ అని ప్రశ్నించారు. ‘ఇంకా పునాది దశలో ఉన్న అమరావతిలో భూముల ధరల కంటే విశాఖలో ఇంకా తక్కువకు ఇస్తున్నారు. వాస్తవానికి మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని తక్కువ ధరకు భూములిస్తారు.
కానీ విశాఖలో ఎంతో విలువైన భూమిని ఇంత తక్కువకు ఎందుకిస్తున్నారో చెప్పాలి’ అని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు మంత్రులు లోకేశ్, అచ్చెన్నాయుడులు జవాబిస్తూ 1994 నుంచి 2004 మధ్య నాటి సీఎం చంద్రబాబు తక్కువ ధరకు హైదరాబాద్‌లో భూములు కేటాయించబట్టే అనేక కంపెనీలు వచ్చాయన్నారు. ఇందులో భాగంగానే విశాఖలో భూములు కేటాయిస్తున్నామని చెప్పారు.


