శ్రీశైల మల్లన్నకు పాగా సిద్ధం | Mallanna Paaga decoration is only in Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైల మల్లన్నకు పాగా సిద్ధం

Feb 13 2026 5:20 AM | Updated on Feb 13 2026 5:20 AM

Mallanna Paaga decoration is only in Srisailam

నియమ నిష్టలతో తయారుచేసిన పృథ్వీ సుబ్బారావు కుటుంబ సభ్యులు  

జాండ్రపేట హస్తినాపురం నుంచి పాగా తీసుకుని శ్రీశైలం పయనం  

శ్రీశైలం టెంపుల్‌: మహా శివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలంలో మల్లికార్జునుడిని పెళ్లి కొడుకుగా సిద్ధం చేసే సమయాన తలపై చుట్టేందుకు పాగా సిద్ధమైంది. దేశంలో ఏ శైవక్షేత్రంలోనూ లేని విధంగా శ్రీశైలంలో మాత్రమే మల్లన్నకు పా­గా అలంకరణ ఉంటుంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం వంశపారంపర్యంగా మల్లన్న తలపాగా తయారు చేసి చుడుతోంది. గ్రామానికి చెందిన కందస్వామి, వేంకట సుబ్బారావు హయాంలో పాగా వస్త్రం తయారీకి ఒక ప్రత్యేక మగ్గాన్ని ఏర్పాటు చేసి నేసేవారు. 

రోజుకో మూర చొప్పున 300 రోజులు 300 మూరలు నేసేవారు. మహా శివరాత్రి పర్వదినానికి 15 రోజుల ముందు వ్రస్తాలతో శా్రస్తోక్తంగా గ్రామంలో ఊరేగింపు నిర్వహించి శ్రీశైలం బయలుదేరి మల్లన్లకు పాగా చుట్టేవారు. ప్రస్తుతం వారి వారసుడు పృ«థ్వీ సుబ్బారావు కుటుంబ సభ్యుల సహకారంతో కార్తీకమాసంలో మంచి రోజు చూసుకుని పాగా వస్త్రం నేతను ప్రారంభిస్తున్నారు. 

శివరాత్రికి పది రోజుల ముందు 300 మూరలు పూర్తయ్యే విధంగా ప్రణాళిక తయారు చేసుకుని స్వచ్ఛమైన తెల్లటి దారాన్ని వినియోగించి పాగా వ్రస్తాన్ని నేస్తున్నారు. పాగా నేత పూర్తయ్యే వరకూ శాకాహారమే తీసుకుంటూ నియమ నిష్టలను పాటిస్తారు. ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ... నేలపై నిద్రిస్తూ నిత్యం శివనామస్మరణ చేస్తారు.  

ఆలయ మర్యాదలతో స్వాగతం  
ఈ ఏడాది సిద్ధం చేసిన పాగాను తీసుకుని జాండ్రపేట హస్తినాపురం నుంచి  పృథ్వీ సుబ్బారావు కుటుంబ సభ్యులు శ్రీశైలం బయలుదేరారు. వీరు శుక్రవారం స్వామి క్షేత్రానికి చేరుకుని ఈ నెల 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని శివయ్యకు సమర్పిస్తారు. పృథ్వీ సుబ్బారావు కుటుంబానికి శ్రీశైల దేవస్థానం నుంచి ఏటా ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని దేవస్థాన అధికారులు అందజేస్తారు. 

పాగా వస్త్రంతో వచ్చే వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి... భోజనం, వసతి, ప్రత్యేక దర్శనాలతోపాటు ఆరి్థక ప్రోత్సా­హకాన్ని కూడా అందజేస్తారు. పాగా నేసేందుకు నెలకు రూ.6వేల చొప్పున అందజేయడంతో పాటు, మహాశివరాత్రి నాడు పాగా చుట్టిన తర్వాత రూ.50వేల ఆర్థిక ప్రోత్సాహకం అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement