ముందు నెయ్యి.. వెనుక గొయ్యి..‘హెరిటేజ్‌’ కోసమే కుట్ర! | Heritage Syndicate gets latest 10 lakh kg ghee contract | Sakshi
Sakshi News home page

ముందు నెయ్యి.. వెనుక గొయ్యి..‘హెరిటేజ్‌’ కోసమే కుట్ర!

Feb 13 2026 5:53 AM | Updated on Feb 13 2026 7:36 AM

Heritage Syndicate gets latest 10 lakh kg ghee contract

నెయ్యి కాంట్రాక్టు కోసం దిగజారిన చంద్రబాబు 

సాక్ష్యాలతో సహా బయటపడ్డ దుర్మార్గం.. దేవదేవుడి పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై దారుణమైన అభాండాలు

నెయ్యి తీగ లాగితే బయటపడ్డ హెరిటేజ్‌ డొంక  

ఇందాపూర్‌ డెయిరీకి కాంట్రాక్టు కోసమే చంద్రబాబు కుట్ర 

హెరిటేజ్‌కు అనుబంధ సంస్థే ఈ ఇందాపూర్‌ డెయిరీ 

మొత్తం 22 సంస్థలతో హెరిటేజ్‌ సిండికేట్‌ 

2014–19లో వాటికే రూ.189.19 కోట్ల నెయ్యి కాంట్రాక్టులు  

నాడు కిలో రూ. 278కే ఇందాపూర్‌కు కాంట్రాక్టు 

రేటు తక్కువ కాబట్టి కల్తీ అంటున్న బాబు సూత్రం ఇందాపూర్‌కూ వర్తిస్తుందిగా.. 

కూటమి అధికారంలోకి రాగానే రంగంలోకి వచ్చిన ఇందాపూర్‌ 

ఇతర డెయిరీలను బెదరగొట్టేందుకే నెయ్యిపై బాబు రాద్ధాంతం 

అందుకే టెండర్లలో పాల్గొనని ప్రముఖ డెయిరీలు.. 

హెరిటేజ్‌ సిండికేట్‌కు తాజాగా 10 లక్షల కిలోల నెయ్యి కాంట్రాక్టు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి.. అందులోనూ పరమపవిత్రంగా ప్రపంచమంతా భావించే తిరుమల శ్రీవారి విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవేవీ ఆలోచించలేదు. పవిత్రమైన లడ్డూ ప్రసాదంపై అంతులేని విషం అలవోకగా చిమ్మేశారు. జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె కలిశాయని అభాండాలు వేసేశారు. సీబీఐ సిట్‌ దర్యాప్తు జరిపి చార్జిషీట్‌ సమర్పిస్తూ క్లీన్‌చిట్‌ ఇచ్చినా ఆయన వెనక్కు తగ్గలేదు. 

లడ్డూ ప్రసాదానికి వాడిన నెయ్యిలో బాత్రూంల క్లీనింగ్‌కు వాడే రసాయనాలు కలిశాయని కూడా ఆరోపించారు. తన వాదనలను బలపరిచేందుకు సొంతంగా వన్‌మ్యాన్‌ కమిషన్‌ కూడా వేశారు. ఇక మానవమాత్రులెవరూ ఈ దుర్మార్గాన్ని అడ్డుకోలేరనుకున్నాడో ఏమో.. ఆ దేవదేవుడే దీనిపై దృష్టి సారించాడనుకుంటా.. చంద్రబాబు దు్రష్పచార కుట్ర వెనుక లోగుట్టు అనూహ్యంగా బద్దలయ్యింది. 

తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్‌ డెయిరీకి అడ్డగోలుగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే బాబు ఇంతటి రాద్ధాంతం చేస్తున్నారన్న విషయం సాక్ష్యాలతో సహా బయటపడింది. ప్రసాదంపై దుష్ప్రచారంతో ఇతర డెయిరీలను భయభ్రాంతులకు గురి చేసి టెండర్లలో పాల్గొనకుండా చేయడం... ఏకపక్షంగా హెరిటేజ్‌ ఫుడ్స్‌ సిండికేట్‌కే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టడం.. అసలు కుట్రన్న విషయం బయటపడింది.  

హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ లో భాగమే ఇందాపూర్‌ డెయిరీ అని స్పష్టం చేస్తున్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ వెబ్‌సైట్‌ 

ఇందాపూర్‌ డెయిరీ నుంచి 5,77,500 కిలోల నెయ్యిని 2015లో కొనుగోలు చేసినట్లు వెల్లడిస్తున్న టీటీడీ రికార్డులు 

తయారైన లడ్డూ ప్రసాదం సువాసనకు పైపూత కోసం 2018లో నెయ్యి సరఫరా టెండర్లను పిలిచిన టీటీడీ 

టీటీడీ నెయ్యి టెండర్ల తీగ లాగుతుంటే... 
హెరిటేజ్‌ ఫుడ్స్‌ డొంక కదులుతోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో హెరిటేజ్‌ ఫుడ్స్‌కు అడ్డగోలుగా నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నేరుగా కాకుండా హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీకి చెందిన మహారాష్ట్రలోని ఇందాపూర్‌ డెయిరీకి కాంట్రాక్టు కట్టబెట్టి కథ నడిపించారు. అది కూడా కేవలం కిలో రూ.278 చొప్పున అతి తక్కువ ధరకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వడం గమనార్హం.  ఇక ఆ ఐదేళ్లలో పూర్తిగా హెరిటేజ్‌ డెయిరీ ఆధ్వర్యంలోని పచ్చ సిండికేటే ఏకంగా రూ.189.19 కోట్ల విలువైన టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లను హైజాక్‌ చేసింది. 

ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరోసారి ఇందాపూర్‌ డెయిరీ తెరపైకి వచ్చింది. నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కొల్లగొట్టడం మొదలుపెట్టింది. 2014–19లో ఏకపక్షంగా కొనసాగించిన దోపిడీ విధానాన్ని పునరావృతం చేసేందుకే చంద్రబాబు పవిత్రమైన లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే కుతంత్రానికి బరితెగించారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై సృష్టించిన వివాదం మాటున చంద్రబాబు  అవినీతి బాగోతం ఇదిగో ఇలా ఉంది... 

‘ఇందాపూర్‌’ ముసుగే... దోపిడీ ‘హెరిటేజ్‌’దే 
2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులను హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థకు అడ్డగోలుగా కట్టబెట్టారు. అది కూడా ఇందాపూర్‌ డెయిరీ అనే సంస్థ ముసుగులో కట్టబెట్టడం చంద్రబాబు పన్నాగానికి నిదర్శనం. ఇందాపూర్‌ డెయిరీ ఎవరిదో కాదు హెరిటేజ్‌ ఫుడ్స్‌ అనుబంధ సంస్థే అన్నది అసలు విషయం. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చైర్‌పర్సన్‌గా ఉన్న హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌కు దేశంలో పాలు, పాల ఉత్పత్తులు(డెయిరీ ప్రొడక్ట్స్‌) తయారు చేసే 22 సంస్థలు ఉన్నాయి. 

మహారాష్ట్రలోని ‘ఇందాపూర్‌ డెయిరీ అండ్‌ మిల్క్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌’ కూడా వాటిలో ఒకటి. ఆ ఇందాపూర్‌ డెయిరీకే 2014–19లో టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. ఇందాపూర్‌ డెయిరీతోపాటు గోవింద్‌ డెయిరీ, సుభీ డెయిరీ, ప్రీమియర్‌ డెయిరీ, సేలం నమక్కల్‌ డెయిరీ, హ ర్యానాలోని కమల్‌ మిల్క్‌ తదితర డెయిరీలతో సిండికేట్‌గా ఏర్పడి వ్యవహారం నడిపారు. 

ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టా రు. అంతే కాదు ఇందాపూర్‌ డెయిరీ సరఫరా చేసిన నె య్యి శాంపుల్స్‌ 2016లో ల్యాబ్‌ పరీక్షల్లో విఫలమయ్యాయి. ఆ డెయిరీపై అనర్హత వేటు వేశారు. కానీ నెలలోపే అనర్హతను తొలగించడం గమనార్హం. 

హెరిటేజ్‌ సిండికేట్‌కే అడ్డగోలుగా నెయ్యి కాంట్రాక్టులు 
హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీకి చెందిన ఇందాపూర్‌ డెయిరీతోపాటు ఆ సిండికేట్‌లోని డెయిరీలకే చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టింది. 2014–19లో మొత్తం రూ.189.19 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టులు ఇచ్చారని టీటీడీ రికార్డులు వెల్లడిస్తున్నాయి. 

» 2015 జనవరిలో 16.50లక్షల కిలోల నెయ్యి కొనుగోలు కోసం టీటీడీ టెండర్లు పిలిచింది. కాగా ఇందాపూర్‌ డెయిరీ వేసిన బిడ్‌ ఎల్‌ 1గా రాలేదు. కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌(కేఎంఎఫ్‌)కు చెందిన మదర్‌ డెయిరీ యూనిట్‌ ఎల్‌ 1గా నిలిచింది. దాంతో ఆ డెయిరీపై అప్పటి టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఒత్తిడి తీసుకువచ్చి ఇందా పూర్‌ డెయిరీకి 35శాతం కాంట్రాక్టు దక్కేలా చే సింది. అంతేకాదు ఇందాపూర్‌కు అనుగుణంగా టెండరు నిబంధనలను కూడా సవరించారు. త ద్వారా ఇందాపూర్‌ డెయిరీకి 5,77,500 కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. అదీ కిలో రూ.306కే. అంటే మొత్తం రూ.17.61 కోట్ల విలువైన నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. 

» 2015, మేలో ఇందాపూర్‌ డెయిరీకి 2.25లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. కిలో రూ.278 చొప్పున సరఫరాకే ఆ కాంట్రాక్టు ఇవ్వడం గమనార్హం. అంటే మొత్తం రూ.6.25కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టారు.  

»  2016 జనవరిలో 18లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు కూడా ఇదే పచ్చ సిండికేట్‌కే కట్టబెట్టారు. కిలో నెయ్యి  కేవలం రూ.285 చొప్పునే గోవింద్‌ డెయిరీ, సుభి డెయిరీలకు ఇచ్చారు. అంటే రూ.51.30 కోట్ల కాంట్రాక్టును దోచిపెట్టారు.  

» 2016 మార్చిలో మరోసారి అదే సిండికేట్‌కు నె య్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది.  ఈసారి 2.25 లక్షల కిలోల నెయ్యిని కిలో రూ.306 చొప్పున సిండికేట్‌లోని గోవింద్‌ డెయిరీకి కట్టబెట్టారు. అంటే రూ.6.88 కోట్ల కాంట్రాక్టు ఇచ్చా రు. (విస్మయం కలిగించే అంశం ఏమిటంటే.. ఈ టెండర్లలో ఇందాపూర్‌ డెయిరీ పాల్గొంది. కానీ ఆ డెయిరీ నెయ్యి శాంపిల్స్‌ ల్యాబ్‌ పరీక్షల్లో విఫలమయ్యాయి. దాంతో అనర్హమైనదిగా ప్రకటించారు. ఆర్నెళ్లకే నిషేధం తొలగించి టెండర్లలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు.) 

»  2016 ఏప్రిల్‌లో ప్రీమియర్‌ డెయిరీకి 20లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. అ ది కిలో రూ.332కే చొప్పునే. అంటే రూ.66.40 కోట్ల విలువైన కాంట్రాక్టు కట్టబెట్టారు. 

»  2016, సెప్టెంబరులో 2.25లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు హర్యానాలోని కమల్‌ మిల్క్‌ కంపెనీకి ఖరారు చేశారు. ఆ డెయిరీ తొలిసారి టీటీడీ టెండర్లలో పాల్గొంది. పచ్చ సిండికేట్‌లో చేరడంతోనే ఈసారి ఆ సంస్థ పేరిట కాంట్రాక్టు ఇచ్చారు. కిలో రూ.376 చొప్పున రూ.8.46 కోట్ల కాంట్రాక్టు దక్కింది.   

» 2018, నవంబరులో మరోసారి ఇందాపూర్‌ డెయీరీకి 6.17లక్షల కిలలో నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టారు. ఇక అదే సిండికేట్‌లోని ప్రీమియర్‌ డెయిరీకి 3.33లక్షల కిలోల నెయ్యి, సేలం నమక్కల్‌ డెయిరీకి 85వేల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఇచ్చారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సిండికేట్‌లోని  ఆ మూడు డెయిరీలకు కిలో రూ.312 చొప్పున మొత్తం రూ.32.29కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారు. 

మీది కూడా కల్తీ నెయ్యేనా చంద్రబాబూ...!
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిలో నెయ్యి రూ.340 నుంచి రూ.410 వరకు పలు సార్లు వివిధ రేట్లకు కొనుగోలు చేస్తే తక్కువ రేటు కాబట్టి కల్తీ నెయ్యి అని చంద్రబాబు నానా రాద్ధాంతం  చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే... 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కిలో నెయ్యి కేవలం రూ.278, కిలో రూ.306 చొప్పున కొనుగోలు చేయడం గమనార్హం. 

అది కూడా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఇందాపూర్‌ డెయిరీ నుంచే. అంటే తక్కువరేట్లే కాబట్టి ఇందాపూర్‌ డెయిరీతోపాటు హెరిటేజ్‌ సిండికేట్‌ ఐదేళ్లపాటు సరఫరా చేసింది కల్తీ నెయ్యేనని చంద్రబాబు ఒప్పుకున్నట్టే కదా. మరి అందుకు చంద్రబాబు తిరుమల శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెబుతారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  

లడ్డూ ప్రసాదంపై పైపూతా...!?
ఇక 2014–19లో హెరిటేజ్‌ సిండికేట్‌ సరఫరా చేసింది కల్తీ నెయ్యేననే వాదనను అప్ప­టి ప్రభుత్వమే బలపరిచే విధంగా వ్యవహరించడం గమనార్హం. లడ్డూ ప్రసా­దాలు సువాసన వచ్చేందుకు పైపూతగా నెయ్యి సరఫరాకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం టెండర్లు పిలవడం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే లడ్డూ  ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యితోనే సువాసన రావాలి. 

కానీ సువాసన కోసం పైపూతగా నెయ్యి కొనుగోలు కోసం మళ్లీ టెండర్లు పిలవడం ఏమిటి...! అంటే హెరిటేజ్‌ సిండికేట్‌లోని డెయిరీలు సరఫరా చేసింది కల్తీ నెయ్యేనని ఒప్పుకున్నట్టే కదా. అందుకే పైపూతగా నెయ్యి సరఫరా కోసం 2018, ఆగస్టులో టెండర్లు పిలిచి పరాగ్‌ మిల్‌్క, దొడ్ల డెయిరీల నుంచి 87,750 కిలోల నె­య్యి కొనుగోలు చేసింది. దీనిని బట్టి లడ్డూ ప్ర­సాదం కల్తీ జరిగింది చంద్రబాబు ప్ర­భుత్వ హయాంలోనేనని స్పష్టమవుతోంది.  

కూటమి రాగానే మళ్లీ తెరపైకి ఇందాపూర్‌ డెయిరీ
2019లో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోగానే హెరిటేజ్‌ ఫుడ్స్‌ కు చెందిన ఇందాపూర్‌ డెయిరీ టీటీడీ టెండర్ల ప్రక్రియ నుంచి తప్పుకుంది. అయిదేళ్లపాటు కనీసం బిడ్లు కూడా దాఖలు చేయలేదు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ తెరపైకి వచ్చింది. 2025 నవంబరులో టీటీడీ నెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనడం గమనార్హం. 

కిలో రూ.658 చొప్పున నెయి సరఫరాకు బిడ్‌ దాఖలు చేసింది. మొత్తం 10లక్షల కిలోల నెయ్యిలో 35శాతం అంటే 3.50లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇందాపూర్‌ డెయిరీకి కట్టబెట్టారు. ఇక హెరిటేజ్‌ సిండికేట్‌లోని ఇతర డెయిరీలు మిగిలిన 6.50లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. అంటే మొత్తం రూ.65.80కోట్ల కాంట్రాక్టు కట్టబెట్టేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement