ఇటీవల కార్మీకులకు ప్రమాదం జరిగిన కొండుపల్లి భూగర్భ గని
కార్మీకుల భద్రత గాలిలో దీపమే
కొండుపల్లిలో అడ్డగోలుగా మైనింగ్
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహణ
యథేచ్ఛగా రాయల్టీ ఎగ్గొడుతున్న వైనం
పట్టించుకోని గనులు, భూగర్భ శాఖ అధికారులు
తాడిపత్రి టౌన్/ పెద్దవడుగూరు: అధికార అండతో ‘పచ్చ’ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఖనిజ తవ్వకాలు చేపట్టి దోచుకుంటున్నారు. ఆదాయం తప్ప భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా గనులు నిర్వహిస్తూ కార్మీకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మైనింగ్ మాఫియాగా ఏర్పడి చెలరేగిపోతున్నారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో స్టీటైట్ అనే ఖనిజ సంపద ఉంది. ఇక్కడ దాదాపు 42 గనులు ఉన్నాయి. టీడీపీకి చెందిన వారే ఎక్కువగా లీజు పొందారు. ఈ గనుల్లో 600 మంది దాకా కార్మికులు పనులు చేస్తున్నారు. భూగర్భ గనుల నిర్వహణలో కార్మికుల భద్రత చాలా ముఖ్యం.
కార్మీకులు హెల్మెట్, బూట్లు, హెడ్‌లైట్‌లు ధరించాల్సి ఉంటుంది. సొరంగంలో కొంత దూరం వెళ్లాక తగినంత గాలి, వెలుతురు కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొండుపల్లి గనుల్లో ఇలాంటి భద్రతా ప్రమాణాలు ఏవీ కనిపించవు. ఖనిజం వెలికితీసే ప్రక్రియల్లో మందుగుండు (జిలెటిన్‌స్టిక్స్) సామగ్రి ఉపయోగిస్తారు. ఇందుకు గాను మైనింగ్‌కు అర్హులైన మేనేజర్, మేట్, బ్లాస్టర్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఇదంతా రికార్డుల్లో మాత్రమే పొందుపరుస్తారు. వాస్తవంలో ఎవ్వరూ ఉండరు. నైపుణ్యం లేని కార్మికులతోనే జిలెటిన్ స్టిక్స్‌పెట్టిస్తూ.. ఖనిజాన్ని వెలికితీస్తున్నారు.
అనుమతికి మించి జిలెటిన్‌స్టిక్స్ వినియోగం
సాధారణంగా భూగర్భ గనుల్లోంచి ఖనిజం బయటకు తీసేందుకు మందుగుండు (జిలెటిన్‌స్టిక్స్) సామగ్రిని రోజుకు కేజీల లెక్కల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉంటుంది. కానీ ఇక్కడ టన్నుల్లో జిలెటిన్ స్టిక్స్ ఉపయోగిస్తూ ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. ఇలా విచ్చల విడిగా పేలుళ్లు జరిపే క్రమంలో కార్మికులు ప్రమాదాలబారిన పడుతున్నారు. గనుల్లో ప్రమాదం జరిగి కార్మీకుల మరణాలు సంభవించినా, కాళ్లు, చేతులు పోగొట్టుకున్నా బాధిత కుటుంబాలకు డబ్బు ఆశచూపి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొండుపల్లిలో ఈ నెల రెండో తేదీన అనుమతి లేని గనిలో ప్రమాదం జరిగి ఇద్దరు కార్మీకులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
నిబంధనలు ఉల్లంఘించినా మైనింగ్ నిర్వాహకులపై సంబంధిత శాఖ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. వారిచ్చే మామూళ్లు తీసుకుని పట్టనట్టుగా ఉంటున్నారు. అనుమతికి మించి స్టీటైట్ తవ్వకాలు చేపట్టి పౌడర్ ఫ్యాక్టరీలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. రాయల్టీ ఎగ్గొడుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. కొండుపల్లిలోని 688, 697, 698, 699 సర్వే నంబర్లలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు. 693, 694, 695 సర్వే నంబర్లలోని మైనింగ్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా 25 వేల టన్నుల ఖనిజం తరలించినట్లు గుర్తించిన అధికారులు 2022 మార్చి 21న రూ.6.41 కోట్ల జరిమానా విధిస్తూ గని సీజ్ చేశారు. అయితే నిర్వాహకులు ఆ గనిలో ఇప్పటికీ యథేచ్ఛగా తవ్వకాలు చేస్తూనే ఉన్నారు.


